జబర్దస్త్ జమిలీ..... పొలిటికల్ మోనోపలి

Update: 2017-10-08 07:30 GMT

దేశ రాజకీయ యవనికపై 1970 ల వరకూ కొనసాగిన రాజకీయ గుత్తాధిపత్యానికి మరోసారి పావులు కదులుతున్నాయి. స్వాతంత్ర్యోద్యమ చరిత్రతో తెచ్చుకున్న గుర్తింపుతో మూడు దశాబ్దాల పాటు కాంగ్రెసు పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యంతో తన హవా కొనసాగించింది. కేరళలో కమ్యూనిస్టులు, తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం వంటి పార్టీలు సవాళ్లు విసిరినా వాటి ప్రాబల్యం పరిమితం. స్థానికం. దేశ రాజకీయాలపై నామమాత్రం. ఎమర్జెన్సీ తర్వాత కాలం(1977) వరకూ దేశ రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకుంది కాంగ్రెసు. అత్యవసర పరిస్థితి తర్వాతనే విపక్ష రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెసును దీటుగా ఎదుర్కోవాలంటే అంతా ఏకం కావాలనే ఆలోచనతో సిద్దాంతరాద్ధాంతాలను పక్కనపెట్టి చిన్నాచితకా పార్టీలు, ప్రాంతీయ నాయకులు జనతా ప్రయోగంతో ఒక్కటయ్యారు. కాంగ్రెసును ఓడించారు. నాయకుల పెత్తందారీ వైఖరులు, అబిప్రాయభేదాలతో మళ్లీ ముక్కలు చెక్కలయ్యారు. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు విజృంభించాయి. ఉత్తరాదిన సోషలిస్టు నేతలు సొంత కుంపట్లు పెట్టుకున్నారు. మరోవైపు అస్తిత్వం కోసం దళిత,బలహీన వర్గాల గొంతు వినిపించే పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ రకంగా ఎనిమిది, తొమ్మిది దశకాలు దేశంలో రాజకీయంగా బలమైన శక్తులకు పునాదిరాళ్లు వేశాయి.

ప్రాంతీయనేతలు జాతీయ స్థాయిలో......

ప్రాంతీయ ఆశలు, ఆకాంక్షలు, భిన్నమైన అజెండాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా అంతవరకూ పాదుకొన్న కాంగ్రెసు తన ప్రాచుర్యాన్ని , ప్రాధాన్యాన్ని క్రమేపీ కోల్పోతూ వచ్చింది. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రాంతీయపార్టీలు, నేతలు జాతీయ స్థాయిలో ముఖ్యభూమిక పోషించే స్థాయికి చేరుకున్నారు. రాజకీయ బలాన్ని పెంచుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. తాజాగా నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్నికయ్యాక భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా అల్లుకుపోతున్న తీరు మరోసారి స్వాతంత్ర్యానంతర కాలంలో కాంగ్రెసు పాత్రను గుర్తుకు తెస్తోంది. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం ద్వారా కాంగ్రెసు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. బ్రిటిషు ప్రభుత్వ నిర్ణయాలపై వినతులు, విజ్ఞాపనలతో మొదలు పెట్టి సహాయనిరాకరణ, శాసనోల్లంఘన చివరికి క్విట్ ఇండియా వరకూ ఉద్యమాలతో ప్రజల్లో ఒక భాగంగా బలపడింది. సుదీర్ఘపోరాటం నుంచి లభించిన ఫలితం కాంగ్రెసుకు సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రయోజనం చేకూర్చింది . 1980 లలో ఏర్పాటైన బీజేపీ 1996 వరకూ జాతీయ అధికారపక్షం స్థాయి ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు. 1996లో స్వల్పకాలం, 1998నుంచి 2004 వరకూ ఆరేళ్లపాటు అధికారం దక్కించుకోవడంతో బీజేపీ కాంగ్రెసుకు దీటైన పక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ ఒక్క కర్ణాటకను మినహాయిస్తే ఉత్తరాది పార్టీగానే బీజేపీని చూసేవారు. 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే వాజపేయి నిష్క్రమణ, అద్వానీకి జాతీయంగా విపక్షాల మద్దతు కొరవడటంతో బీజేపీ భవిష్యత్తు ఏమిటనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. కానీ మోడీ రాకతో మొత్తం సమీకరణలు మారిపోయాయి. ప్రజల ఆమోదముద్రతో దేశంలోనే శిఖరసమాన నాయకునిగా ఎదిగిపోయారాయన.

దేశ వ్యాప్తంగా బలపడుతూ.....

నిన్నామొన్నటి వరకూ కమలం చిరునామా తెలియని రాష్ట్రాల్లో సైతం అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఎదిగిందా పార్టీ. కేరళ వంటి కమ్యూనిస్టు కోటల్లోనూ బలపడుతోంది. పశ్చిమబంగ వంటి ప్రగతి శీల రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈశాన్య భారతాన్ని కమ్ముకుపోయింది. ఆయా విజయాలతో తన శాశ్వత అజెండాను పైకి తీసే దిశలో పావులు కదుపుతోంది. హిందూవాద జాతీయ అజెండాను దేశవ్యాప్తం చేసేందుకు సంకల్పిస్తోంది. రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఒకే సారి జమిలీ ఎన్నికలు జరపాలనే యోచన సాగిస్తోంది. అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా 2018 సెప్టెంబరు నాటికి సాంకేతికంగా తాము సిద్ధంగా ఉంటామని చెప్పేసింది. బీజేపీ మాటకు ఎన్నికల కమిషన్ వంత పాట పాడుతోందంటూ విపక్షాలు విమర్శించాయి. సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన , రాజ్యాంగ పరమైన అంశాలను క్లియర్ చేసుకొన్న తర్వాతనే ఉమ్మడి ఎన్నికలు సాధ్యమవుతాయి. 1967 వరకూ కూడా దేశంలో అసెంబ్లీలు, లోక్ సభకు ఏకకాలంలోనే ఎన్నికలు నిర్వహించేవారు. తర్వాత రాజకీయ అస్థిరతలు, రాష్ట్రప్రభుత్వాల రద్దు వంటి చర్యలతో ఎన్నికల కాలం గతి తప్పింది. ఇప్పుడు మళ్లీ జమిలి ఎన్నికలు పెడితే జాతీయ అజెండా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

జమిలి సాధ్యమేనా? న్యాయపరమైన ఇబ్బందులుండవా?

అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడే చాన్సుంది. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎప్పుడూ ఏదో ఎన్నిక జరుగుతూ ఉండటంతో పరిపాలన దెబ్బతింటోందన్న భావన నిజమే. అయితే ఏక కాలం ఎన్నికలతో జాతీయ పార్టీలకు ఎక్కువ లాభం చేకూరుతుందని విశ్లేషకుల అంచనా. అందులోనూ మోడీ లాంటి నాయకుడు జాతీయ సారథ్యం వహిస్తుంటే ప్రాంతీయ పార్టీలు, చిన్నాచితక పార్టీలు చెల్లాచెదురు కాకతప్పదు. ప్రాంతీయ ఆకాంక్షలు దెబ్బతింటాయి. దేశ మూల సూత్రమైన సమాఖ్య స్ఫూర్తికి కూడా ఒక రకంగా విఘాతమనే చెప్పాలి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ బీజేపీ నాయకులు ఉమ్మడి ఎన్నికలపై సీరియస్ గానే దృష్టి సారించారు. న్యాయ,ప్రజాసంబంధ వ్యవహారాలను చూసే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా 2015 డిసెంబరులో ఉమ్మడి ఎన్నికలపై నివేదిక ఇచ్చింది. లోక్ సభ తో పాటే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలకు, రెండున్నర సంవత్సరాలు గడచిన తర్వాత మిగిలిన సగం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపితే బాగుంటుందని స్థాయి సంఘం అభిప్రాయపడింది. దీనివల్ల నిరంతరం ఎన్నికల వాతావరణాన్ని తప్పించవచ్చనే అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే మధ్యేమార్గంగా రెండువిడతలుగా ఎన్నికలు జరిపినా కొన్ని అసెంబ్లీల కాలవ్యవధిని కుదించాల్సి వస్తుంది. మరికొన్ని అసెంబ్లీల కాలవ్యవధిని పెంచాల్సి ఉంటుంది. ఇందుకు ముందుగా అన్ని పార్టీలతో సంప్రతింపులు జరపాలి. స్థూలంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఆ తర్వాత పార్లమెంటుతోపాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదంతో కూడిన రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. ఇవన్నీ 2019 లోపు సాధ్యం కాదనే చెప్పవచ్చు. సాధారణ మెజార్టీతో పార్లమెంటు ఆమోదిస్తే చాలు జమిలి ఎన్నికలను నిర్వహించేయవచ్చని కేంద్రం భావిస్తోంది. కానీ రాజ్యాంగంలో ఇందుకు సంబంధించి స్పష్టత లేదు. న్యాయసమీక్షకు నిలవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని చర్చకు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఇందుకు అవసరమైన ప్రాతిపదికను కేంద్రం సిద్ధం చేస్తోందనుకోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News