జనసేనాని అ‘‘జెండా’’ ఖరారు

Update: 2018-03-27 14:30 GMT

మొత్తానికి ఒక కొత్త కూటమికి నాంది పడింది. జనసేన,సీపీఎం,సీపీఐ కలిసి నడిచేందుకు ఒక అంగీకారానికి, అవగాహనకు వచ్చాయి. దీనికి గాను ఒక సైద్దాంతిక ప్రాతిపదికను నిర్మించుకున్నాయి. తక్షణ లక్ష్యంగా ఒకే ప్లాట్ ఫారంపైకి రావడానికి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాల చుట్టూ కేంద్రీకరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఇది ఎన్నికల నాటికి రాజకీయ కూటమిగా రూపుదాలుస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకూ జనసేనకు సంబంధించి కొన్ని అనుమానాలు, అపోహలు నెలకొని ఉన్నాయి. బీజేపీ ప్రయోగిస్తున్న అస్త్రంగా కూడా విస్తృతంగా ప్రచారం సాగింది. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించిన పవన్ కల్యాణ్ వామపక్షాలకు స్నేహహస్తం అందించారు. తానే స్వయంగా చొరవ తీసుకుని కలిసిపనిచేద్దామని ప్రతిపాదించారు. దాగుడుమూతలకు తెరదించారు. టీడీపీ , వైసీపీలే కాకుండా వామపక్షాలతో కూడిన జనసేన కూడా 2019 నాటికి ఒక బలమైన పార్టీగా రంగంలో ఉండబోతోంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెసులు ఒంటరిగానే రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో అభిమానులున్న పవన్ సీపీఐ,సీపీఎం లతో కలవడంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ దాగి ఉందంటున్నారు.

క్లారిటీ కోరిన కామ్రేడ్లు...

ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కలవరపడుతున్నపరిస్థితుల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీని పూర్తిగా విస్మరించి చంద్రబాబునాయుడు, లోకేశ్ పై ఆరోపణలు చేయడమేమిటని చాలామంది ప్రశ్నలు సంధించారు. ఇంతకాలం అధికారపార్టీకి మద్దతిస్తున్నట్లుగా కనిపించిన పవన్ ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకోవడంలో బీజేపీ పాత్ర ఉందని అందరూ అనుమానించారు. టీడీపీని దుయ్యబట్టడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. కానీ టైమింగ్ మాత్రం దెబ్బతీసింది. కేంద్రానికి, బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఒక స్టాండ్ తీసుకున్న పరిస్థితుల్లో పవన్ తిరుగుబాటును తెలివిగా బీజేపీ ఖాతాలో వేసేశారు చంద్రబాబునాయుడు. ఈవిషయంలో నెలకొన్న సందేహాలు వామపక్షాలను కూడా తటపటాయింపునకు గురిచేశాయి. తాజా సమావేశంలో బీజేపీ విషయంలో జనసేన వైఖరిపై సీపీఐ,సీపీఎం నాయకులు స్పష్టత కోరినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కమలంతో చేతులు కలిపే ప్రసక్తే లేదని పవన్ స్వయంగా హామీ ఇచ్చినతర్వాతనే కలిసి పనిచేద్దామనే ప్రతిపాదనను ఖరారు చేసుకున్నారు.

బలాలు..బలహీనతలు...

జనసేనానికి నాలుగైదు జిల్లాల్లో బలమైన అభిమానవర్గం ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను శాసించగల స్థాయిలోనే సామాజిక వర్గ పరంగా పవన్ ఆధిక్యత కొనసాగుతుందని అంచనా. ఉత్తరాంధ్ర, చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల, తారుమారు చేయగల స్థాయి అభిమాన సందోహం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే పార్టీకి నిర్మాణం లేదు. పోలింగు బూత్ వరకూ తీసుకొచ్చి ఓటింగు వేయించుకోగల పోల్ మేనేజ్మెంట్ పద్ధతులూ జనసేనకు కరవే. కటౌట్లు కట్టడం, తమ హీరోపై ఎవరైనా విమర్శలు చేస్తే దాడి చేసే వీరోచిత అభిమానమే వారి సొంతం. నిర్మాణాత్మకంగా పార్టీని ముందుకు నడపాల్సి ఉంటుంది. వ్యవధి తక్కువగా ఉంది. అందువల్ల ఈ బలహీనతను కమిటెడ్ క్యాడర్ ను కలిగి ఉన్న కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అధిగమించాలని జనసేనాని యోచిస్తున్నారు. కమ్యూనిస్టులకు ప్రజలతో సత్సంబంధాలే ఉన్నాయి. ఇంకా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలున్నారు. కానీ ఎన్నికల బరిలో తమపై తామే నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లే తాము వేయించుకోలేని దుస్థితి. జనసేనతో కలిస్తే ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్ లోనూ ఒక విశ్వాసం నెలకొంటుంది. దీంతో తమకు పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవగల సత్తా వస్తుందని వామపక్షాలు భావిస్తున్నాయి.

ఇక వర్గ పోరు షురూ...

టీడీపీ, వైసీపీ,బీజేపీ, కాంగ్రెసు లు వామపక్ష, జనసేన కూటమికి ఇక వర్గ శత్రువులు కాబోతున్నాయి. ఆయా పార్టీలపై దాడికి అవసరమైన సైద్ధాంతిక విధానాలు సిద్దమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ సమస్యలే అజెండాగా ఆరోపణలను ఎక్కుపెడుతున్నారు. టీడీపీ నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏపీకి అన్యాయం చేసిందని మొదటి అస్త్రం అధికార పార్టీపైనే ప్రయోగిస్తున్నారు. వైసీపీ ప్రధానప్రతిపక్షంగా అటు రాష్ట్రప్రభుత్వంతో ఇటు కేంద్రప్రభుత్వంతో పోరాటంలో విఫలమైందని వాదిస్తున్నారు. బీజేపీతో రాజీమార్గం అనుసరిస్తున్నారనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవిభజనలో సమ న్యాయం చేయలేకపోయిన కాంగ్రెసు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ఏపీకి ద్రోహం చేశాయని ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ప్రత్యర్థులపై బలమైన విమర్శలనే గుప్పిస్తున్నారు. అయితే వామపక్షాలకు, జనసేనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. తొలి నుంచీ వామపక్షాలు ప్రత్యేక హోదా డిమాండు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా హోదా విషయాన్ని ఏడాదిన్నర క్రితమే బీజేపీకి వ్యతిరేకంగా లేవనెత్తారు. అందువల్ల ప్రజల్లోకి వెళ్లడం , వారి మద్దతు కూడగట్టడం పెద్ద కష్టసాధ్యం కాబోదని వామపక్ష, జనసేన నాయకులు భావిస్తున్నారు. దశలవారీ ఉద్యమాలతోపాటు ఎన్నికల నాటికి ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడానికి నేతలు సిద్ధమవుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News