జగన్ లెగ్ వర్క్ వల్లనే సర్వే పాజిటివ్ గా వచ్చిందా?

Update: 2018-01-19 06:30 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న పార్టీకి తాజాగా వెలుగు చూసిన ఎన్నిక‌ల స‌ర్వే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఏపీలో త‌న‌కు తిరుగులేద‌ని, త‌న‌ను ప్ర‌జ‌లు మ‌ళ్లీ సీఎంను చేసేందుకు ఉర్రూత‌లూగుతున్నార‌ని, త‌న పార్టీకి తిరుగులేద‌ని, రాష్ట్రంలోని 25 ఎంపీస్థానాల్లో 20కి పైగా త‌మ పార్టీ కైవ‌సం చేసుకుంటుంద‌ని ప‌దే ప‌దే ఊద‌ర గొట్టిన చంద్ర‌బాబు భారీ షాక్ ఇస్తూ.. తాజాగా ఆర్నబ్ గోస్వామికి చెందిన ఛానెల్ ఒక‌టి నిర్వ‌హించిన స‌ర్వేలో బాబు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఆర్న‌బ్ గోస్వామి ఛానెల్ రిప‌బ్లిక్ టీవీ తాజాగా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఏడాదిన్న‌ర ఉంది. పోనీ ఎంత ముందుగా నిర్వ‌హించాల‌ని భావించినా.. న‌వంబ‌రు వ‌ర‌కు కూడా స‌మ‌యం ఉంటుంది.

మోడీ హవా మాత్రం చెక్కు చెదరలేదు....

అయితే, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ తాజాగా ప్రారంభ‌మైంది. కేంద్రంలో తిరుగులేని నేత‌గా ఎదిగిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా ఎంత మేర‌కు ఉంటుంది? మ‌రోసారి ఆయ‌న‌కు గెలిచే ఛాన్స్ ఉందా? అనే కోణంలో ఈ సర్వే సాగింది. మోడీకి అనుకూలంగా ఈ స‌ర్వే రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. అయితే, అదే స‌మ‌యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలో కూట‌మిగా ఉన్న ఏపీలోని టీడీపీ పార్టీపై మాత్రం ఈ స‌ర్వే కళ్లు బైర్లు కమ్మే ఫ‌లితాన్ని ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏపీలోని టీడీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని స‌ర్వే చాటిచెప్ప‌డం విశేషం. నిజానికి ఎన్డీయేకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ ఆయ‌న స‌మ‌ర్ధించారు.

మెజారిటీ సీట్లు వైసీపీ వల్లనేనా?

ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌పై శివ‌సేన వంటి పార్టీలు జీఎస్టీ, నోట్ల ర‌ద్దుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసినా.. బాబు మాత్రం స‌మ‌ర్ధిస్తూనే వ‌చ్చారు. అలాంటి చంద్ర‌బాబు పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మిని చ‌విచూస్తుంద‌ని ఈ స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, బాబుకు కంట్లో న‌లుసుగా మారిన వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌వా పెరుగుతోంద‌ని ఈ స‌ర్వే చెప్ప‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ హవా పెరుగుతుంద‌ని, 25 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని.. 13ఎంపీ సీట్లు ఆ పార్టీకి దక్కుతాయని ఈ సర్వేలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. జగన్ పాదయాత్ర చేసిన తర్వాత ఈ సర్వే చేయడంతో పాదయాత్రతో పార్టీకి మరింత మైలేజీ వచ్చిందన్నది ఈ సర్వే ద్వారా వెల్లడయిందంటున్నారు వైసీపీ నతేతలు. మరి ఎన్డీయే అనుకూల సర్వేలో.. కమలం పార్టీ మిత్రపక్షాలకు కూడా అనుకూల ఫలితాలు చూపించిన సర్వేలో టీడీపీ పరిస్థితి ఇలా ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. మ‌రి బాబు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

Similar News