జగన్ మరో కొత్త ఎత్తుగడ...?

Update: 2018-01-25 14:30 GMT

మళ్లీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాల పల్లవి మొదలు పెట్టింది. అట్టర్ కన్ఫ్యూజన్ లో అటు ఇటు కొట్టాడుతున్న పార్టీకి ఇదేదో అస్త్రంగా పనికొస్తుందనే భావన మొదలైనట్లుంది. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ తాజాగా గంభీరంగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. అందులో తానున్నానో లేదో చెప్పలేదు. పార్టీలో అంతర్గత విభేదాలు ఒక వైపు ప్రత్యేక సర్వేలు మరోవైపు పార్టీని గందరగోళ పరుస్తున్నాయి. అధినేత చేపట్టిన పాదయాత్రపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి మీడియా అభిప్రాయాల రూపంలో చేపట్టిన సర్వేలను పూర్తిగా పక్కనపెడుతున్నారు. వాటికి విశ్వసనీయత లేదని స్వయంగా జగన్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. వ్యూహకర్త ప్రశాంతకిశోర్ టీమ్ అందిస్తున్న సమాచారం జగన్ కు రుచించడం లేదు. తాజాగా రిపబ్లిక్ టీవీ చేసిన సర్వేలోనూ ఫలితాలు సానుకూలంగా కనిపించినా తానాశించినట్లు లేవని సన్నిహితుల వద్ద జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద మరో కొత్త ఎత్తుగడగా ఎంపీల రాజీనామాను తెరపైకి తెస్తున్నారు.

కాలం చెల్లింది...

రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా సకాలంలో చేయడం వల్లనే ఫలితాలు లభిస్తాయి. సందర్బాన్ని బట్టి రిస్కు తీసుకోవడానికి సైతం సాహసించాలి. లేకపోతే ఏటికి ఎదురీదినట్లవుతుంది. కాంగ్రెసు పార్టీ సమయం,సందర్బం లేని నిర్ణయాలతో తెలంగాణలో తీవ్రంగా దెబ్బతింది. 2014 వరకూ నాలుగైదు జిల్లాలకు పరిమితమైన టీఆర్ఎస్ మహాశక్తిగా మారడానికి కారణమైంది. జగన్ సైతం ఇదే రకమైన పోకడలు కనబరుస్తుంటారు. పార్టీలో విస్తృతమైన చర్చ లేకుండా సొంత నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. ఇది అనేక సందర్భాల్లో వికటించి చేదు ఫలితాన్నిస్తోంది. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారని దాదాపు ఏడాదిన్నర క్రితం ఆయన ప్రకటన చేశారు. 2017 బడ్జెట్ సెషన్ లోనే తమ ఎంపీలు పార్లమెంటును స్తంభింపచేసి తర్వాత రాజీనామా చేస్తారన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత మాటకు కట్టుబడతారనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. మాట తప్పను, మడమ తిప్పను నినాదాన్ని కూడా జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డి వారసత్వంగా స్వీకరించారు. ఎంపీల రాజీనామా వంటి ప్రధాన నిర్ణయాన్ని ఏడాదిన్నరగా వాయిదా వేశారు. అసలే కేసుల ఊబిలో ఉన్న తనపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతుందేమోనన్న ఆందోళన కూడా ఇందుకు కారణం. ఎన్నికల కాలం సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదా సెంటిమెంటును మళ్లీ రాజీనామాల రూపంలో వెలికి తీయాలని చూస్తున్నారు. ఈ బడ్జెట్ సెషన్ ముగిసిన తర్వాత రాజీనామా చేసినప్పటికీ ఎన్నికలకు ఏడెనిమిది నెలల కాలవ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ రాజీనామాల సంగతిని లోక్ సభ స్పీకర్ పట్టించుకునే అవకాశమే తక్కువ. ఆగస్టు వరకూ పెండింగులో పెట్టేస్తారు. ఆ తర్వాత వాటిని ఆమోదించినా సాధారణ ఎన్నికలతో కలిపేస్తారు. అందువల్ల రాజీనామాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఉప ఎన్నికల ఉపద్రవమూ ఉండదు. ఈ మొత్తం తంతుపై అవగాహనతోనే బడ్జెట్ సెషన్ తర్వాత రాజీనామాలంటూ కొత్త నాటకానికి తెరతీశారనేది ప్రత్యర్థుల ఆరోపణ.

డ్యామేజీ కంట్రోల్....

జగన్ ఉద్దేశపూర్వకంగానో, లేక యాధృచ్చికంగానో బీజేపీతో కలిసి నడుస్తామంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. తీవ్రంగానే డామేజీ కలిగించింది. జిల్లాల నాయకత్వం, దళిత,మైనారిటీ సామాజిక వర్గాల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం మొదలైంది. బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందో లేదో తెలియదు కానీ తమ ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని తేలిపోయింది. దీంతో పార్టీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అబ్బబ్బే తూచ్..మేము బీజేపీతో వెళతామనేది ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత సంగతి అంటూ దిద్దుబాటు ప్రకటన చేశారు. పీకల్లోతు పాతిపెట్టేసిన పాత అంశం స్పెషల్ స్టేటస్ కోసం ఎంపీల రాజీనామాను పైకి తీశారు. బీజేపీతో చెట్టాపట్టాలు కడతామన్న ప్రకటనకు బదులుగా ఈ సెంటిమెంటు పావును ప్రయోగించారు. అయితే జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. లోక్ సభ ఎంపీల సంగతిని పక్కన పెడదాం. వాళ్లందరి పదవీ కాలానికి మరో ఏడాది లో కాలం చెల్లిపోనుంది. నాలుగేళ్ల వరకూ రాజ్యసభలో పదవీ కాలం ఉన్న తన రాజీనామా గురించి మాత్రం విజయసాయి రెడ్డి తెలివిగా దాటవేశారు. ఉప ఎన్నికలు రాకూడదు. రాజీనామా లేఖలు మాత్రమే ఇవ్వాలన్న ధోరణి వైసీపీలో కనిపిస్తోంది. గతంలో ఎంపీల రాజీనామా ప్రకటన చేసినప్పుడు వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగా తమ పరిస్థితులు ఏమీ బాగా లేవు కనుక మొత్తం ఎన్నికల ఖర్చును పార్టీయే భరించాలని ఎంపీలు సూచించారు. అధికార పక్షమైన టీడీపీతో ఈవిషయంలో పోటీ పడలేమని గ్రహించి రాజీనామా ప్రకటనను జగన్ కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. కేంద్రప్రభుత్వం, బీజేపీపై పోరాటమన్న కలరింగ్ ఇచ్చేందుకు మళ్లీ అదే ప్రకటనను విజయసాయి రెడ్డి చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల అంచనా.

పీకేల గొడవ...

ఇద్దరు పీకేలు జగన్ కు చికాకు కలిగిస్తున్నారు. నిద్ర లేకుండా చేస్తున్నారు. ఒకరు పార్టీ వ్యూహకర్త ప్రశాంత కిశోర్. రెండో వ్యక్తి జనసేనాని పవన్ కల్యాణ్. పార్టీ గెలుపు అవకాశాల అంచనా, అభ్యర్థుల ఎంపిక, వ్యూహరచన ల నిమిత్తం కోట్ల రూపాయల పారితోషికంతో నియమించుకున్న వ్యక్తి ప్రశాంతకిశోర్. అతనిస్తున్నరిపోర్టులు, అంచనాలపై క్యాడర్ లోనూ, జిల్లా, నియోజకవర్గ నాయకత్వాల్లోనూ తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. జగన్ కూడా ఏమంత సంతృప్తి తో లేరు. జగన్ కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్న అభ్యర్థులపై కూడా పీకే పాజిటివ్ రిపోర్టులు ఇవ్వడం లేదు. ఆయా స్థానాల్లో కొత్తవారైతేనే బాగుంటారని సూచిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 27 వ తేదీన అనంతపురంలో ఇందుకు నాంది పలకబోతున్నారు. తన పాదయాత్ర కాలంలోనే పవన్ కూడా రంగంలోకి దిగితే అంతంతమాత్రం ప్రచారం కూడా తనకు లభించదన్న సంగతి జగన్ కు తెలుసు. మీడియా మొత్తం పవన్ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తుంది. జగన్ పాదయాత్ర ఇంపాక్ట్ పడిపోతుంది. జగన్ ఆందోళనకు ఇదో ప్రదాన కారణంగా నిలుస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News