జగన్ పిలిచినా ఎందుకు వెళ్లలేదు...?

Update: 2018-02-12 08:30 GMT

ఆయుధం పట్టను. యుద్ధం చేయను. నేను కావాలో నా చతురంగ బలాలు కావాలో తేల్చుకోండని మహా భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి దుర్యోధనుడికి ఆఫర్ ఇచ్చాడు ఆ రోజు. నేడు కలియుగ భారతంలో ఎన్నికల యుద్ధంలో వుండబోనని అంటున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ శ్రీ కృష్ణుడిలాగే వున్నారు. ఆయన ఇప్పుడు ఏ పక్షానికి తన సంపూర్ణ ఆశీస్సులు అందిస్తారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. తన ఆత్మీయ నేస్తం కుమారుడు వైఎస్ జగన్ ఒక వైపు. మరోపక్క రాజకీయ గీతోపదేశం కోసం ఎదురు చూస్తున్న జనసేనాని పవనుడు మరోవైపు. ఏ పక్షాన ఇప్పుడు ఆయన నిలుస్తారన్నది పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత అందరిలో ఉదయించిన ప్రశ్న. ఎన్నికల రాజకీయాలు విరమించాను. ఇక విశ్రాంత జీవితం ఎంజాయ్ చేస్తున్నా అంటూ వైరాగ్య రాజకీయాలు చేస్తున్న ఉండవల్లి అవసరం ఇప్పుడు రణక్షేత్రంలో అన్ని పక్షాలకు అవసరమే.

బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చినా ....

దేశమంతా అటల్ బిహారీ వాజపేయి గాలి ముమ్మరంగా వీస్తుంది. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లక్ష్యం అందినట్లే అంది చేజారుతున్న తరుణం. ఆ సమయంలోనే తూర్పు గోదావరి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ లో చురుకైన ఉండవల్లి అరుణ కుమార్, జక్కంపూడి రామ్మోహన రావు లకు బిజెపి నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇద్దరిని బిజెపి తమ పార్టీలోకి రావాలని జాతీయ స్థాయిలో కీలక నేతలనుంచి ఆహ్వానం అందింది. అలా పిలుపే కాదు టికెట్లు, పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత కూడా కల్పిస్తామన్న హామీ కూడా లభించింది. అటల్ గాలిలో ఎవరు అభ్యర్థిగా వున్నా గాల్లో గెలిచే ఛాన్స్ ఏ మాత్రం రాజకీయ అవగాహన వున్న వారికి అయినా అర్ధం అయ్యే రోజులవి. తీవ్రమైన వత్తిడి ఇద్దరి నేతలమీద పడింది. ఒక దశలో జక్కంపూడి కమలనాధుల ప్రతిపాదన ఆలోచించాలన్నా ఉండవల్లి ససేమిరా అనేశారు. ఒక పార్టీ సిద్ధాతం నమ్ముకు వచ్చాం కడవరకు అందులోనే వుండాలని తన మిత్రుడు రామ్మోహన్ కి దిశా నిర్ధేశం చేశారు. ఆనాడు జరిగిన ఎన్నికల్లో గిరజాల వెంకటస్వామి నాయుడు టిడిపి అభ్యర్థి ఎంవిఎస్ మూర్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆయనపై ఎంపీగా గెలిచి వాజపేయి గాలి ఏ స్థాయిలో వీచిందో తన విజయంతో చాటి చెప్పారు. అలా తన రాజకీయ జీవితంలో ఎన్నో అద్భుత అవకాశాలు వచ్చినా కాంగ్రెస్ ను తాను విశ్వసించే వైఎస్ ఆర్ చేతిని కడవరకు వీడలేదు ఉండవల్లి.

వైసిపి సిద్ధాంత కర్తగా ముద్ర వేస్తున్న విమర్శకులు ...

వైఎస్ దుర్మరణం, దుర్మార్గంగా జరిగిన రాష్ట్ర విభజన చూసిన ఉండవల్లి, ప్రత్యక్ష రాజకీయాలకు 60 ప్లస్ కి గుడ్ బై చెప్పాలన్న అంశానికి కట్టుబడి పోయారు. రెండు సార్లు ఎంపీగా పని చేసిన సంతృప్తి, ఆయిల్ అండ్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్ గా పార్టీలో అనేక కీలక బాధ్యతలు రాజీవ్, సోనియా వంటి జాతీయ నాయకులకు అనువాదకుడిగా లభించిన అరుదైన గౌరవం ముఖ్యమంత్రులు ఎవరున్నా అందరితో సాన్నిహిత్యం, ముఖ్యంగా వైఎస్ దగ్గర వున్న చనువు ఉండవల్లి కి తీపి గుర్తులే. అలాంటి అరుణ కుమార్ తనకున్న రాజకీయ జిజ్ఞాసతో ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలే నిర్వహిస్తూ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పినా టిడిపి ఆయనకు వైసిపి సిద్ధాంత కర్త అనే బిరుదు తగిలించింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడుతున్నా అన్నా ప్రత్యర్ధులు ఆయన్ను విడిచిపెట్టలేదు. వైఎస్ కుమారుడిని సీఎం చేయడానికే పని చేస్తున్నారంటూ విమర్శలు, ఆరోపణలు శరపరంపరగా గుప్పించే వారు. అలాంటి ఉండవల్లి ఇప్పుడు జనసేనాని ఆహ్వానం మన్నించి జనసేన పార్టీ కార్యాలయానికి స్వయంగా వెళ్ళి రాజకీయాలకు అతీతంగా పవన్ కి సలహాలు,సూచనలు తో సాయం చేసేందుకు సిద్ధం అయ్యారు.

జగన్ శిబిరంలో పెరిగిన అలజడి ....

వైసిపిలోకి రావాలంటూ ఉండవల్లి ని ఎన్నిసార్లు ఆహ్వానించినా ఆయన వారి ఆహ్వానం మన్నించలేదు. తటస్థం గా ఉండేందుకే ఇష్ట పడ్డారు అరుణ కుమార్. అలాంటిది తమ గత ఎన్నికల పరాజయంలో కీలక సూత్రధారి పవన్ తో జత కట్టడాన్ని వైసిపి వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. జగన్ పై కేసులు నిలబడేవి కాదని స్పష్టం చేయడంతో బాటు సీఎం కావడానికి అనుభవం అక్ఖర్లేదని పదే పదే చెప్పిన అరుణ కుమార్ పడిపోయిన వైసిపి అధినేత గ్రాఫ్ ను అమాంతం పైకి లేపారు. చంద్రబాబు కన్నా జగన్ బెటర్ ఏమో అన్న రీతిలో ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు వైసిపికి మైలేజ్ అంతా ఇంతా తీసుకురాలేదు . ఇప్పుడు అలాంటి ఉండవల్లి ఎన్నికలు దగ్గర పడే సమయంలో జనసేనాని తో జత కడితే సమస్యే అన్నది వైసిపి లో ఆందోళన కలిగిస్తుంది. మరి పవన్ ఇప్పుడు ఏపీకి అన్యాయం ఎవరి వల్ల జరిగిందో తేల్చనున్న నిజనిర్ధారణ కమిటీకే అరుణకుమార్ పరిమితం అవుతారా మునుముందు జనసేన కు సలహాలు సూచనలు ఇస్తారా అన్నది త్వరలో తేలనుంది.

Similar News