జగన్ తో పొత్తుకే రెడీ అవుతున్నారా?

Update: 2017-12-21 15:30 GMT

తెలుగుదేశం అడుగులు క్రమేపీ దూరమవుతున్నాయి. ప్రస్తుతానికి కమలానికి నమ్మకమైన మిత్రుడు కరవు అయిపోతున్నాడు. గుజరాత్ ఫలితం ఒక గుణపాఠం నేర్పింది. ప్రజలు తిరగబడేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రత్యామ్నాయం కనిపిస్తే పట్టం కట్టేందుకు తయారుగానే ఉన్నారన్న సంకేతం వ్యాపించింది. సొంత రాష్ట్రంలో మోడీ, అమిత్ షా ల ద్వయాన్ని ప్రజలు దాదాపు ఓడించినంత పని చేశారు. బీజేపీ 2014 ఎన్నికల్లో ఉత్తరభారతంలో సంతృప్త స్థాయికి చేరుకుంది. 2019 లో అక్కడ కోల్పోయే సీట్లే తప్ప కొత్తగా వచ్చి పడే ఓట్లు, సీట్లు లేవు. 282 స్థానాలతో బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడంలో ఉత్తరాది రాష్ట్రాలదే అగ్రతాంబూలం. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలను దాదాపుగా స్వీప్ చేసేసింది. కానీ ప్రస్తుతం గుజరాత్ వాతావరణం ,ఓటరు నాడిని పరిశీలిస్తే బీజేపీ గతంలో సాధించిన స్థానాల సంఖ్య 2019 ఎన్నికల్లో 200 లోపునకు పడిపోవచ్చని అంచనా. అంటే దాదాపు వంద సీట్లు ఇతర ప్రాంతాల నుంచి దక్కించుకోవాలి. లేదంటే మిత్రపక్షాలపై అతిగా ఆధారపడాల్సి ఉంటుంది. మొదటి ఆప్షన్ కే మోడీ, అమిత్ షాలు మొగ్గు చూపుతున్నారు. ప్లాన్ బీ కింద మిత్రపక్షాల మద్దతు అంశాన్ని పరిగణిస్తున్నారు. ఎన్నికలకు ముందే కొత్త పొత్తులతో సంకీర్ణ భాగస్వాములతో కలిసి ఎన్నికలకు వెళ్లడం , బీజేపీకి భారంగా మారిన మిత్రపక్షాలను వదిలించుకోవడమనే వ్యూహంతో ముందడుగు వేయాలని భావిస్తున్నారు.

గుబులు రేపిన గుజరాత్...

2019 మాదే . మిత్రపక్షాల సహకారం అవసరం లేదు. 300 ప్లస్ సాధిస్తామంటూ నిన్నామొన్నటివరకూ అమిత్ షా అదరగొట్టేసేవారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగానూ 150 ప్లస్ అంటూ ఊదరగొట్టారు. సెంచరీ కొట్టలేక చతికిల పడిన పరిస్థితి. యూపీ ఇచ్చిన ఉత్సాహంతో గుజరాత్ ఎన్నికల ఫలితాల వరకూ బీజేపీ చాలా ధీమాగా ఉంది. ఎన్నికల రోజు వచ్చిన ఎగ్జిట్ ఫలితాలూ అతి విశ్వాసాన్ని పెంచాయి. కానీ వాస్తవ ఫలితాలు కుదించుకుపోయాయి. బీజేపీ బాసులను ఆత్మావలోకనంలో, అంతర్మథనంలో పడేశాయి. కొత్త ప్రాంతాలకు పార్టీ విస్తరించకపోతే 2019 మనది కాదన్న చేదు నిజం కళ్లముందు ప్రత్యక్షమైంది. దీంతో స్ట్రాటజీ మారుస్తున్నారు. తాము అనుకున్నవిధానాలు, సిద్దాంతాలు అమలు చేయాలంటే సొంతంగానే మెజారిటీ సాధించాలనేది బీజేపీ నాయకుల లక్ష్యం. వాజపేయి పాలించిన సమయంలో ఎన్డీఏ రకరకాల ఒత్తిడులకు గురైంది. మిత్రపక్షాలను సంతృప్తి పరిచేందుకు తమ ప్రవచిత విధానాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొన్నింటికి వీడ్కోలు చెప్పక తప్పలేదు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటికీ రాజ్యసభ వంటి చిక్కులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ అంశాన్నే సాకుగా చూపుతూ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అజెండాలోని కొన్ని వివాదాస్పద అంశాలను వాయిదా వేస్తోంది. 2019లో కూడా సొంతకాళ్లపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యం లభిస్తే తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని సంఘ్ పరివార్ శక్తులు చూస్తున్నాయి. ఈదిశలోనే అడుగులు వేయాలని మోడీ, అమిత్ షా కూడా భావిస్తున్నారు. కానీ పరిస్థితులు అందుకు అనుగుణంగా కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ వ్యూహం పై ముందస్తు కసరత్తు మొదలు పెట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటక ఎన్నికల నాటికి ప్రత్యేక ప్రణాళికతో నష్టం వాటిల్లే సీట్లను భర్తీ చేసేందుకు దక్షిణ భారతం ఎంతవరకూ ఆసరాగా నిలుస్తుందనే విషయమై ఆరా తీస్తున్నారు. పార్టీ శ్రేణుల నుంచి సమాచారం తోపాటు ప్రొఫెషనల్ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు, వాటిని హైలైట్ చేయాల్సిన విధానం, సొంతంగా కానీ మిత్రపక్షాలతో కానీ ముందుకు వెళ్లాలంటే అవగాహన ఏ స్థాయిలో ఉండాలనే విషయాలపై మేధోమథనం మొదలు పెట్టారు.

ప్లాన్ బీ లో ప్యాన్...

ప్రస్తుతం కలిసి సాగుతున్న కొన్ని మిత్రపక్షాలు 2019 నాటికి వాటి సొంత ప్రయోజనాల దృష్ట్యా వేరు పడవచ్చని బీజేపీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. మరికొన్ని పక్షాలు కొత్తగా పొత్తు కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీకి భారంగా మారిన కొన్ని పక్షాలను తనంతతానే వదులు కుంటే బాగుంటుందంనే ఆలోచన కూడా ఉంది. దీర్ఘకాల మిత్రపక్షమైన శివసేన పార్టీని చాలా చికాకు పెడుతోంది. 2015 తర్వాత ఈ గొడవ బాగా పెరిగింది. బీజేపీ విజయాలను చిన్నవిగా చేసి చూపించేందుకు , పొరపాట్లను గ్లోరిఫై చేసేందుకు శివసేన నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రధానినే టార్గెట్ చేస్తోంది. ఈ బంధం తెగిపోయేవిధంగానే తయారైంది. ఒకవేళ అదే జరిగితే ఎన్సీపీతో ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాత కానీ మహారాష్ట్రలో కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. పంజాబ్ లో అవినీతి, అక్రమార్జన, కుటుంబ పాలనతో భ్రష్టు పట్టిపోయిన శిరోమణి అకాలీదళ్ ప్రభావం బీజేపీపై కూడా పడుతోంది. అక్కడ ప్రభుత్వం మారినా శిరోమణి అకాలీదళ్ పై ప్రజాగ్రహం చల్లారలేదని స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు పిర్యాదు చేశారు. సో, ఏమాత్రం అవకాశం దొరికినా శిరోమణిని కూడా వదిలించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కొంచెం ..కొంచెం దూరం పెంచుకుంటూ పోతోంది. ద్వితీయశ్రేణి నాయకత్వం ఇందుకు సంబంధించిన సంకేతాలను ఇప్పటికే అందిస్తోంది. ఫైనల్ గా పవన్ కల్యాణ్ తో కలిసి వెళుతూ కమలం పార్టీకి చెవిలో పువ్వు పెట్టేందుకు కూడా టీడీపీ వెనకాడకపోవచ్చు. ఇది కేవలం రాజకీయ పరిశీలకుల అంచనా మాత్రమే కాదు. డిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ బీజేపీ నాయకులు కూడా ఇదే రకమైన అవగాహనతో ఉన్నారు.

వై.సి.పి. వడ్డించిన విస్తరి...

ఓట్లు, సీట్ల విషయంలో టీడీపీకి దీటుగా -నిలిచే పక్షం వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ. తమతో కలవమని 2014లోనే బీజేపీ, వై.సి.పికి ఆఫర్ ఇచ్చింది. కానీ సాధ్యం కాలేదు. చంద్రబాబు నాయుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి కూటమి కట్టారు. అప్పటికి అది కలిసి వచ్చింది. 2019 లో బీజేపీతో కలిసి వెళితే వికటిస్తుందనేది రాజకీయ అంచనా. దీనిని గ్రహించడం రాజకీయ దార్శనికుడైన చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదు.అందుకే ఇప్పట్నుంచే రంగం సిద్దం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బీజేపీతో కలిసే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయనే విషయంలో కూడా బీజేపీ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి. దళిత, ముస్లిం వర్గాల బలమైన మద్దతు ఉన్న వై.సి.పి. నేరుగా బీజేపీతో కలవడం ఆత్మహత్యాసదృశం. అందుకే ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి కలిసేందుకు సానుకూలమేనన్నది బీజేపీ వర్గాల అంచనా. ఈ మేరకు విజయసాయి రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన రెడ్డిలతో అత్యున్నత స్థాయిలోనే మంతనాలు జరిగినట్లు సమాచారం. దీనిపై వై.సి.పిలోనే కొంత తర్జన భర్జన నెలకొంది. ఈ రకమైన ప్రచారం ప్రజల్లోకి వెళితే టీడీపికి లాభిస్తుంది. అది వై.సి.పికి భారీ డ్యామేజీ చేస్తుంది. అందుకే బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పకుండానే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తామని ధోరణిలోనే ప్రకటనలుండాలని వై.సి.పి. అగ్రనాయకత్వం, జగన్ స్థూలంగా నిర్ణయించారు. తాజాగా ఒక చానల్ తో మాట్లాడుతూ ప్రత్యేకహోదా ప్రకటిస్తే బీజేపీతో కలిసేందుకు తమకు అభ్యంతరం లేదని జగన్ ప్రకటించడంలోని ఆంతర్యమిదే.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News