జగన్ అస్త్రాలు బయటకు తీస్తారా?

Update: 2017-11-06 00:30 GMT

ఏపీ విప‌క్ష నేత, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఎన్నో ఆశ‌ల‌తో, మ‌రెన్నో ఆశ‌యాల‌తో సోమ‌వారం నుంచి ప్రారంభిస్తున్న పాద‌యాత్రపై అనేక అంచ‌నాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే, పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. అయితే, ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య కాలంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్ కూడా పాద‌యాత్ర చేశారు. దీనిద్వారా ఆయ‌న అట్టడుగు వ‌ర్గాల‌ను సైతం ప‌ల‌క‌రించే వెసులుబాటు ల‌భించింది.

పాద‌యాత్రలోనే వైఎస్‌, బాబుకు అధికారం....

వైఎస్ ఈ పాద‌యాత్ర ఫ‌లితంగా త‌న‌కు తిరుగులేద‌ని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబును అధికారానికి దూరం చేయ‌గ‌లిగారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సార్లు వైఎస్ గెలుపు బావుటా ఎగ‌రేశారు. నాడు వైఎస్‌ను కేవ‌లం పాద‌యాత్రే సీఎం చేసింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి సీఎం అయ్యారు. 2009లో వైఎస్ వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యాక అనూహ్య రీతిలో వైఎస్ దుర్మర‌ణం పాల‌య్యారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వ‌స్తున్నా మీ కోసం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్రజ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్యలు తెలుసుకున్నారు. వాస్తవానికి 9 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి, ప్రజ‌ల‌ను పాలించిన నేత ఇలా పాద‌యాత్ర చేప‌డ‌తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అయితే, ప్రజ‌లు మాత్రం బాబును మ‌ళ్లీ రిసీవ్ చేసుకున్నారు. ఫ‌లితంగా 2014 నాటి ఎన్నిక‌ల్లో బాబుకు ప్రజ‌లు అండ‌గా నిలిచారు.

జ‌గ‌న్ కూడా అదే ఫార్ములాతో ముందుకు...

ఇక‌, ఇప్పుడు ఇదే ఫార్ములాను న‌మ్ముకుని ప్రజ‌ల్లోకి వెళ్తున్నారు ఏకైక విప‌క్షం వైసీపీ అధినేత‌, జ‌గ‌న్‌. నేటి నుంచి ఆయ‌న ప్రజా సంక‌ల్ప యాత్ర పేరుతో ప్రజ‌ల్లో మ‌మేక‌య్యేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జ‌గ‌న్ కావాలి.. జ‌గ‌న్ రావాలి! నినాదం కూడా రెడీ అయింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం ఉబ్బిత‌బ్బిబ్బవుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చంద్రబాబుపై విమ‌ర్శల బాణాల‌ను ఎక్కు పెడ‌తాడ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల రేవంత్ రెడ్డి టీడీపీ నేత‌ల‌పై చేసిన విమ‌ర్శల‌ను తనకు అనుకూలంగా మ‌లుచుకునే ప్రయ‌త్నం చేసి.. టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టే ప్రయ‌త్నం చేయొచ్చు.

నాడు వైఎస్ క‌ష్టాలే నేడు జ‌గ‌న్‌కు...

వాస్తవంగా చెప్పాలంటే 2004 ఎన్నిక‌ల‌కు ముందు నాడు వైఎస్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వైఎస్ పాద‌యాత్ర చేసినా ఆయ‌న‌కు అధికారం రాదు...మ‌రోసారి చంద్రబాబుదే అన్న చ‌ర్చలు కూడా న‌డిచాయి. అయితే వైఎస్ అంద‌రి అంచ‌నాలు త‌లకిందులు చేస్తూ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా నాడు వైఎస్ ఎలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నారు. నేడు అంత‌కు మించిన ఇబ్బందుల్లో ఉన్నారు. నాడు జ‌రిగిన ఉప ఎన్నిక‌లు, ఇత‌ర స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యాలు సాధించింది. ఇక ఇప్పుడు నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లోను టీడీపీ గెలిచింది. జ‌గ‌న్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తున్నారు. నాడు, నేడు ఈ తండ్రికొడుకుల పాద‌యాత్ర ఒకే సారూప్యత‌తో ఉంది. నాడు ప్రభుత్వంపై వ్యతిరేక‌త ఉంది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజ‌ల్లో క‌న‌ప‌డ‌ని వ్యతిరేక‌త ఉన్నా దానిని స‌రిగా ఫోక‌స్ చేసుకోలేక‌పోవ‌డ‌మే జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్‌గా మారింది.

జ‌గ‌న్ వ‌ద్ద అస్త్రాలు ఎన్నో...

పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇవి ఇలా ఉంటే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు హోదా ఇవ్వకుండా నిలువునా ద‌గా చేశారు. ఈ హోదా విష‌యంలోనే కాదు చంద్రబాబు స‌ర్కార్ ప్రతి విష‌యంలోను కేంద్ర ప్రభుత్వంతో రాజీప‌డుతూ ఏపీ ప్రయోజ‌నాలు ప‌ణంగా పెడుతోంది. ఇక జ‌గ‌న్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నా బాబుపై నిప్పులు చెరగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎలాగూ పోల‌వ‌రం పూర్తయ్యే ప‌రిస్థితి లేదు. ఇది కూడా జ‌గ‌న్‌కు మంచి అస్త్రమే. ఇక భారీగా పెరిగిపోయిన అవినీతిని బేస్ చేసుకుని కూడా జ‌గ‌న్ చంద్రబాబును విమ‌ర్శించ‌వ‌చ్చు. ఏవిధంగా చూసినా.. జ‌గ‌న్ చేప‌డుతున్న పాద‌యాత్ర ఇటు ప్రభుత్వానికి, అటు టీడీపీ అధినేత‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాయ‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇక‌, జ‌గ‌న్ త‌న సొంత స్టైల్‌లో మ‌హిళ‌ల‌ను ప‌ల‌క‌రించ‌డం, సెల్పీలు దిగ‌డం, అవ్వా తాతా అంటూ ఆప్యాయ‌త‌ను కురిపించ‌డం కూడా పాజిటివ్‌గా మార‌నున్నాయ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి ఈ పాద‌యాత్ర జ‌గ‌న్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎంత వ‌ర‌కు ప్లస్ అవుతుందో ? చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News