ఛీ...ఛీ...ఇవేం మాటలు.... ఇవేం దూషణలు?

Update: 2017-12-28 14:30 GMT

మనిషికి, జంతువుకు తేడా చెప్పాల్పి వచ్చిన సందర్భంలో మొదట ప్రస్తావించేది మాట. మనిషిలోని సంస్కారాన్ని, సభ్యతను, నడతను పట్టి ఇచ్చేది కూడా మాటే. భావ వ్యక్తీకరణకు, పదుగురిని ప్రభావితం చేసేందుకు, పదిమందిలో పెద్దగా ఎదిగేందుకు ఉపకరించే సాధనమూ మాటే. అందుకే మాటే మంత్రం అని నానుడి స్థిరపడిపోయింది. కానీ తాజాగా మాటకు విలువ పడిపోతోంది. సభ్యసమాజంలో మనుషుల మనోభావాలను వ్యక్తం చేయాల్సిన మాట పదునెక్కి పక్కదారి పడుతోంది. పరనింద స్థాయి దాటి పరుష పదజాలంతో దూషణకు దిగజారుతోంది. అందులోనూ ప్రజలజీవన విధానాలను నిర్ణయించి జాతి భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేయాల్సిన రాజకీయాల్లో ఈ పతనం పరాకాష్టకు చేరుకుంది. చట్టసభలలో అయితే వాటిని రికార్డుల నుంచి తొలగించడమో, మాట కట్టు తప్పిన సభ్యుని సస్పెండ్ చేయడమో జరుగుతుంది. కానీ రోడ్డెక్కి తిట్టుకుంటే సామాజిక మాధ్యమాల్లో చవకబారు దూషణలకు దిగితే అడ్డుకునేవారెవరు? అసలు ఈ ఉద్ధృతికి అంతముందా? ఇదే ప్రశ్న నేటి సమాజాన్ని వేధిస్తోంది.

బజారు కాదు..బేజారు

చంక నాకు, బూటు నాకు, తోలు తీస్తా, బురదలో దొర్లాడిన పంది, కోన్ కిస్కా గొట్టం, పక్కలేసే వాడు...ఇలా మాటలు విశృంఖలత్వాన్ని సంతరించుకుని విచ్చలవిడిగా రోడ్డెక్కుతున్నాయి. గతంలో మరీ దిగజారుడు స్థాయిలో తిట్టుకుంటే బజారు భాష మాట్టాడుతున్నారని ఆక్షేపించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోతున్నారు మన నేతలు. బజారు భాష కాదు, వారి మాటలు వింటే సభ్యసమాజం తలదించుకుని బేజారెత్తి పోయే స్థితి. అందులోనూ రాజకీయాల్లో ఒక స్థాయికి చేరుకున్న నాయకులే ఇటువంటి భాషను వినియోగించడం దిగజారిన ప్రమాణాలనే కాదు, రాజకీయ పతనాన్ని పట్టి చూపిస్తోంది. తీరైన విమర్శకు బదులుగా తిట్ట పురాణంతో ప్రత్యర్థులు ఆడిపోసుకొంటున్నారు. వాటిని పదే పదే చూపిస్తూ మీడియా ప్రతి ఇంటి లివింగ్ రూమ్ కు చేరుస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర పడిన రేవంత్ రెడ్డి, నటి రోజా లు తమ వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. వీరేమీ చిన్నాచితక నాయకులేం కాదు. టీటీడీపీ వర్కింగు ప్రెసిడెంటుగా పనిచేసిన సీనియర్ రాజకీయ వేత్త రేవంత్. ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజాజీవితమూ ఆయనకుంది. రేపోమాపో తెలంగాణ కాంగ్రెసుకు వర్కింగు ప్రెసిడెంటుగా అవకాశం లభిస్తుందనే ప్రచారం ఉంది. అటువంటి రాష్ట్రస్థాయి నేత తన స్థాయిని, హోదాను, బాధ్యతను విస్మరించి ఇటీవల మంత్రి లక్ష్మారెడ్డి పై విరుచుకు పడ్డారు. ఏకవచనంతో పాటు బహిరంగ సవాళ్లు విసురుతూ ఒరే,తురే అంటూ సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పతనాన్ని సూచించడమే కాదు, వ్యక్తిగతంగా రేవంత్ కున్న ఇమేజ్ కు కూడా మచ్చ తెచ్చి పెట్టే విధంగా ఉన్నాయి. వ్యక్తిగత దూషణలు చెవులకు ఇంపుగానే ఉంటాయి. ఇష్టపడని వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ రాజకీయాల్లో ఉండాల్సిన హుందాతనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా చేసి తెలివైన రాజకీయ నాయకురాలిగా, పదునైన విమర్శల కాణాచిగా, వాగ్ధాటి కలిగిన ప్రసంగీకురాలిగా పేరు తెచ్చుకున్న రోజా పవన్ కల్యాణ్ జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు ఆమె వైపే వేళ్లు చూపించేలా ఉన్నాయి. పక్కలు వేసేవాళ్లు, భజన పరులు అంటూ తన స్థాయిని తగ్గించుకున్నారామె. గతంలో ఇదే తరహా ధోరణితో శాసనసభ నుంచి సస్పెండ్ కావాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారు. తిట్లు, దూషణలు తాత్కాలికంగా చప్పట్లకు ఉపకరిస్తాయి తప్పితే దీర్ఘకాలంలో రాజకీయాలకు చెరుపు తెస్తాయి. దీనిని నేటి రాజకీయనేతలు గమనించలేకపోతున్నారు. తాము చేస్తున్న వ్యాఖ్యలకు అప్పటికప్పుడు లభిస్తున్న స్పందననే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

నిరుడు కురిసిన హిమ సమూహాలు..

రాజకీయాల్లో విమర్శలు కొత్తేం కాదు. ఘాటైన ఆరోపణలు, విమర్శలు బహిరంగ సభల్లోనూ, చట్ట సభల్లోనూ నాయకుల మధ్య చోటు చేసుకుంటూ ఉండేవి. రాజకీయ ఉద్దండులు చేసే ప్రతి వ్యాఖ్య సద్విమర్శగానే ఉండేది. అంతే హుందాగా దానికి ప్రత్యర్థులు బదులిచ్చేవారు. ఆలోచింప చేసే వ్యాఖ్యలతోనే గాడతను చాటిచెప్పేవారు. 1962లో చైనాతో యుద్దం సందర్బంగా కొండలు , గుట్టలతో కూడిన వేలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని భారత్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయమై పార్లమెంటులో చర్చసాగింది. పచ్చగడ్డి కూడా మొలవని ప్రాంతం పోయినా ఫర్వాలేదన్నట్లుగా ప్రబుత్వం బదులిచ్చింది. దీనిపై స్పందించిన రామ్ మనోహర్ లోహియా మన ప్రధాని తలపై కూడా ఒక్క వెంట్రుక మొలవదు. అంతమాత్రం చేత దానిని వదులుకుంటామా? విలువలేనిదని బావిస్తామా? అంటూ ప్రధాని నెహ్రూను ఉద్దేశించే వ్యాఖ్యానించారట. అంతకంటే గాఢమైన, తీవ్రమైన వ్యాఖ్య, విమర్శ ఉంటుందా? కానీ దానిలోని తీవ్రత ఆలోచింపచేసేవిధంగా ఉండటంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి కావడమే కాదు, కిక్కురు మనలేని పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు. పుచ్చలపల్లి సుందరయ్య, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటివారు సభలోనూ, బయటా చేసే విమర్శలు ఆలోచింప చేసేవి. ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకునేలా మార్గం సూచించేవి. నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారు ప్రత్యర్థులు చేసే విమర్శలను సహృదయంతో స్వీకరించేవారు. ప్రతిపక్షాలకు చెందిన వారైనప్పటికీ యువ రాజకీయవేత్తలను తమకున్న మందబలంతో నిలువరించే ప్రయత్నం చేసేవారు కాదు, వారు చేసే విమర్శను మన్నించేవారు, బదులిచ్చేవారు. ఇప్పుడు నాయకుల మధ్య ఆ రకమైన వాతావరణం కరవైంది. నేతలు తమను తాము ప్రత్యర్థులుగా భావించుకోకుండా శత్రువులుగా చూసుకుంటున్నారు. వ్యవస్థాపరమైన అంశాలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. రాజకీయ రంగం మొత్తాన్ని ఇది కలుషితం చేస్తోంది.

రేపటి తరానికి ఇదా సందేశం...

నేటి నాయకులను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువతరం ఫాలో అవుతూ ఉంటుంది. వారు చేసే వ్యాఖ్యలు, విమర్శలు, చర్యలు వారిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. సినిమా రంగంలో డైలాగులను యథాతథంగా నిత్యజీవితంలో అనుకరించడం మనం చూస్తున్నదే. సినీ రంగం ప్రభావం ఒక్క తరానికే పరిమితమవుతుంది. అందులోనూ సమకాలీన యువత వారిని అనుసరించి ఆనందిస్తుంది. అంతటితో సరి. కానీ రాజకీయ రంగం ప్రభావం రేపటి తరాన్ని నిర్దేశిస్తుంది. రాజ్యాంగం, సంక్షేమం, అభివృద్ధి ,పరిపాలన, విద్య, వైద్యం..ఒక్కటేమిటి మనిషి జీవితాన్ని ముందుకు నడిపే అంశాలన్నీ రాజకీయ రంగంతోనే ముడిపడి ఉన్నాయి. కొత్తగా ఎదుగుతున్న యువనేతలూ తమ రెబల్ రోల్ మోడల్స్ నే ఫాలో అవుతూ ఉంటారు. తమ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మాటలను పక్కాగా పాటిస్తుంటారు. అందుకే ఈ రంగంలోని సీనియర్ నాయకులు మరింత బాధ్యతగా ప్రవర్తించాలి. అందులోనూ ఉన్నత పదవుల్లో ఉన్నవారు, వాటిని అధిరోహించాలని భావిస్తున్నవారు, అధిరోహించేందుకు అర్హతలు కలిగిన వారు మాట తూలే ముందు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే తాము పెద్ద పదవులు అధిష్టించిన తర్వాత ఆ తిట్లు తమనే వెన్నాడుతూ ఉంటాయి. ఇంత చీప్ గా తాము మాట్టాడామా? అని సిగ్గు పడాల్సిన సమయం వస్తుంది. ప్రత్యర్థులు ఇదే ధోరణితో విరుచుకుపడితే తమ పరువు పోతోందని తలదించుకోవాల్సి వస్తుంది. తమలపాకుతో నువ్వు ఒకటి అంటే తాటిమట్టతో నేను రెండు ఇస్తా అన్న మొరటు సామెత ఈ రాజకీయ తిట్ల పురాణానికి కూడా వర్తిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News