చైనా దూకుడుకు కళ్లెం వేయగలమా?

Update: 2017-09-27 17:30 GMT

65వ దశకం ప్రారంభంలో జరిగిన చైనా యుద్ధంలో భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాటి పరాజయ భారం నేటికీ ప్రతి భారతీయుడినీ వెంటాడుతోంది. ఇది యుద్ధంలో ఓటమి కారణంగా పరాజయ భారంతో నాటి ప్రధాని పండిట్ నెహ్రూ పరమపదించారన్న అభిప్రాయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉండేది. భారత్ ఓటమికి కారణాలు అనేకం. చేతకాక, చేవలేక మనసైనికులు ఓడిపోలేదు. కనీస వసతులు కొరవడి తగినంత ఆయుధ సంపత్తి లేక మనసైన్యం వెనకబడి పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సైనికులకు అవసరమైన పాదరక్షలు, ఇతర చిన్నపాటి ఆయుధాలు కూడా వారికి అందుబాటులో లేవన్నది నగ్న సత్యం. ఇక సరిహద్దుల్లో కనీస మౌలిక వసతులు లోపించాయి. బ్యారక్ ల నుంచి సరిహద్దులకు సత్వరమే వెళ్లేందుకు అవసరమైన రహదారులు, రైలు మార్గాలు కూడా లేవు. ఇక వాయు మార్గాల ద్వారా చేరుకునే అవకాశం లేనే లేదు. ఇలా వివిధ కారణాల వల్ల అప్పట్లో పరాజయాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.

సరిహద్దుల్లో మౌలిక వసతులు......

ఈ పరిస్థితిని అధిగమించేందుకు రక్షణ శాఖ అనేక చర్యలు చేపడుతోంది. నిన్న మొన్నటి దాకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇటీవల కాలంలో కేంద్రం దృష్టి పెట్టడంతో పనులు వేగమందుకున్నాయి. భారత్ చైనాల మధ్య సుమారు 3,380 కిలోమీటర్ల సరిహద్దు విస్తరించి ఉంది. ఈశాన్య రాష్ట్రంతో పాటు, జమ్ముకాశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాయి. అన్నింటికన్నా ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల ప్రదేశ్ సరిహద్దు అత్యంత కీలకమైనది. దీనిని దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ యావత్ రాష్ట్రం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ రాష్ట్రంలో భారత అధినేతల పర్యటనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఇటీవల బౌద్ధమత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై నిప్పులు చెరిగింది. సమయం సందర్భం లేకుండా అరుణాచల్ ప్రదేశ్ పై అవాకులు,చవాకులు పేలుతూ అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. ఇతర సరిహద్దులు కన్నా ఈశాన్య సరిహద్దుపైనే డ్రాగన్ పూర్తి దృష్టి పెడుతోంది.

రహదారుల నిర్మాణానికి కోట్ల నిధులు.....

చైనా వ్యూహాన్ని పసిగట్టిన భారత్ సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. తక్షణమే ఆయా ప్రాంతాలకు సైనికులను చేరవేసేందుకు రహదారుల నిర్మాణాలు, విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ పనులను వేగవంతం చేసేందుకు సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్వో) కు విస్తృత అధికారాలిచ్చింది. సుమారు 3,409 కిలోమీటర్ల నిడివి గల 61 రహదారుల నిర్మాణంలో ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని సూచించింది. ఈ రహదారులు వ్యూహాత్మకంగా కీలకమైనవి. పనులు వేగవంతం చేసేందుకు సరిహద్దు రహదారుల సంస్థకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారాలు కల్పించింది. ఇందుకు అవసరమైన నిర్మాణ సామగ్రి కొనుగోలుకు బీఆర్వో డైరెక్టర్ జనరల్ కు వంద కోట్ల వరకూ ఆర్థిక అధికారాలు కల్పించింది. ఇప్పటి వరకూ స్వదేశీ పరికరాల కొనుగోలుకు 7.5 కోట్లు, విదేశాల నుంచి 305 కోట్లు విలువైన పరికరాల కొనుగోలుకు అధికారం ఉండేది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో టర్న్ నే పద్ధతిలో వివిధ కంపెనీల నుంచి సేవలు పొందడానికి విధానపరమైన మార్గదర్శకాలను రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

నూతన రైలు మార్గాలు కూడా.....

మరోపక్క నూతన రైలు మార్గాలపై కూడా రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. వాతావరణ పరంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సర్వే పనులు చేపట్టాలని నిర్ణయించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి బిలాస్ పూర్ నుంచి మనాలి మీదుగా లేహ్ వరకూ 498 కిలోమీటర్ల వరకూ రైలు మార్గం నిర్మించాలన్నది తాజా నిర్ణయం. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి లేహ్ కు 1100 కిలోమీటర్ల మేరకు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా రైళ్ల రాకపోకలు సాగించడానికి అవకాశం కలుగుతుంది. ఈ మార్గంలో కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. శీతాకాలంలో ఉష‌్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ లో ఉంటాయి. తరచూ మంచు చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంటుంది. భూకంపాల అవకాశమూ ఎక్కువే. మార్గమధ్యంలో సొరంగాలు, వంతెనల నిర్మాణం దృష్ట్యా పెద్ద మొత్తంలో వ్యయమవుతుంది. అస్సాంలోని మిస్సమారి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వరకూ 378 కిలోమీటర్లు, అరుణా చల్ ప్రదేశ్ నుంచి పాసిఘాట్ నుంచి అస్సాంలోని రుపైకు 227 కిలోమీటర్లు, అస్సోంలోని ఉత్తర లక్మపూర్ నుంచి సిలాపథార్ వరకూ 249 కిలోమీటర్ల మేర మూడు నూతన రైలు మార్గాల నిర్మాణానికి తుది సర్వేలు జరగుతున్నాయి. ఈ నాలుగు సర్వేలకు కలిపి ఇటీవల కేంద్రం 345 కోట్లు విడుదల చేసింది.

చైనాతోనే ఇబ్బంది.....

భారత్ కు వివిధ దేశాలతో సరిహద్దులున్నప్పటికీ చైనా, పాకిస్థాన్ సరిహద్దులే అత్యంత కీలకమైనవి. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక తదితర దేశాల సరిహద్దులతో పెద్దగా ఇబ్బందులు లేవు. పాక్ సరిహద్దుల్లో కాల్పులు తప్ప నేరుగా సైన్యం చొరబాట్లు ఉండవు. ఆ ప్రమాదం చైనాతో ఎక్కువ. ఇక్కడ నేరుగా చైనా సైనికులే హద్దులు దాటుతారు. ఉభయ దేశాల సరిహద్దయిన వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) ను ఇప్పటికీ గుర్తించని చైనా అక్రమ చొరబాట్లకు దిగడం మనకు అనుభవమే. ఇటీవల డోక్లాం ఉదంతమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందువల్ల డ్రాగన్ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలంటే సరిహద్దుల్లో అప్రమత్తత అవసరం. అదే సమయంలో సైన్యానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన మరీ ముఖ్యం.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News