చైనా కుట్రలు, కుతంత్రాలకు అంతేలేదా?

Update: 2017-11-02 18:29 GMT

చైనా విదేశాంగ విధానం విచిత్రంగా ఉంటుంది. భారత్ కు చికాకులు పుట్టించడం, ఇబ్బందులు కల్గించడం దానివిదేశాంగ విధానంలో ముఖ్యాంశం. నిత్యం ఏదో ఒక రూపంలో భారత్ ను ఇరుకున పెట్టడం బీజింగ్ విధానం. సరిహద్దులను ఉల్లంఘించడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం, అంతర్జాతీయంగా భారత్ నుఏకాకి చేయడం, భారత్ ఇరుగుపొరుగు దేశాల్లో భారత్ వ్యతిరేకతను సృష్టించడం.. స్థూలంగా ఇవీ చైనా చేసే పనులు. పాక్ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహించడం, ఇరు దేశాల మధ్య నదీ ప్రవాహాన్ని అడ్డగించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడటం ‘డ్రాగన్’కు వెన్నతో పెట్టిన విద్య. పైకి నంగనాచి కబుర్లు చెబుతూ తెరవెనక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడటం ఆదినుంచి బీజింగ్ అనుసరిస్తున్న విధానమన్నది అందరికీ తెలిసిందే.

సొరంగ మార్గం నిర్మించి....

తాజాగా బ్రహ్మపుత్ర నదీజాలాలను మళ్లించేందుకు ప్రయత్నిస్తూ భారత్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. బ్రహ్మపుత్ర నదీజలాలను మళ్లించేందుకు సుమారు వెయ్యి కిలోమీటర్ల మేరకు సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల ఇంజినీర్ల సమావేశంలో ప్రతిపాదనలపై పరిశీలన చేస్తోంది. తమ దేశంలోని షిన్ జియాంగ్ రాష్ట్రానికి నీటిని తరలించాలన్నది ప్రణాళిక. షిన్ జియాంగ్ కరవు పీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించకుండా టిబెట్ పీఠభూమి అడ్డుకుంటోంది. భారత్ నుంచే రుతుపవనాలు వెళ్లాల్సి ఉంది. నిత్యం కరువు కారణంగా ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. దీంతో టిబెట్ లోని సాంగ్రి కౌంటి నుంచి సొంరగ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం మన అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ బ్రహ్మపుత్ర చాలా విశాలంగా ఉంటుంది. అందువల్ల నీటి తరలింపునకు అనువుగా ఉంటుంది. ముందుగా నది మధ్యలో కృత్రిమ దీవిని నిర్మిస్తారు. నీటి నుంచి బురద రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నియంత్రిత వ్యవస్థల ద్వారా సొరంగ మార్గంలోకి నీటిని తరలిస్తారు. ఇప్పటి వరకూ చైనా 85 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించింది. లియానింగ్ ప్రావిన్స్ లోని నీటి పథకం కోసం దీనిని నిర్మించారు. ప్రస్తుత ప్రాజెక్టు కింద వంద మంద్రి శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. యునాన్ ప్రావిన్స్లో సుమారు 600 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. తాజా ప్రాజెక్టు కు ఇది ముందస్తు కసరత్తు అని నిపుణులు చెబుతున్నారు.

భారత్ కు, బంగ్లాకు నష్టమే....

సొరంగ మార్గం నిర్మాణం వల్ల బ్రహ్మపుత్ర పరీవాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్ లకు నష్టం జరుగుతుంది. దీనివల్ల దిగువ దేశాలైన భారత్, బంగ్లాలకు నీటి ప్రవాహం బాగా మందగిస్తుంది. వరదల సమయంలో నిల్వ నీటిని ఒక్కసారిగా వదిలితే దిగువ ప్రాంతాలకు ముప్పు కలుగుతుంది. ఒక్క భారత్ తోనే కాదు, ఇతర దేశాలతో కూడాచైనా ఇలానే వ్యవహరిస్తుంది. అప్పర్ మెకాంగ్, అప్పర్ సాల్వీన్ నదులపై బీజింగ్ నిర్మించిన ప్రాజెక్టుల వల్ల, జల విద్యుత్తుకేంద్రాల వల్ల కంబోడియా, లావోస్, మయన్మార్, థాయ్ లాండ్, వియత్నాం తదితర దేశాలు నష్టపోయాయి. ఆయా దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు అప్పటికప్పుడు అలాంటిది ఏమీ లేదని సర్దిచెప్పడం, ఆ తర్వాత తాను అనుకున్న విధంగా వ్యవహరించడం చైనా నైజం.

అతి పెద్ద నది.....

ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఇది చైనాలో ప్రారంభమై భారత్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవహించి అక్కడ బంగాళాఖాతంలో సముద్రంలో సంగమిస్తుంది. చైనాలో ఈ నదిని ‘‘యార్లంగ్ సాంగ్పా’’ అని పిలుస్తారు. టిబెట్ పీఠభూముల నుంచి ప్రారంభమయ్యే ఈ నది భారత్ లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి అస్సోంలోకి ప్రవహిస్తుంది. అస్సోం, మేఘాలయా సరిహద్దుల్లో ప్రవహిస్తూ అస్సోంలోని ధుభ్రి వద్ద బంగ్లాదేశ్ లోకి అడుగుపెడుతుంది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ‘‘తీస్తా’’ నదిని, మేఘనా నదులు ఇందులో కలుస్తాయి. బంగ్లాలోని ఫరీద్ గంజ్ తర్ావత చిట్టగాంగ్ కు పశ్చిమాన బంగాళాఖాతంలో కలుస్తుంది. నదీప్రాంతం సుమారు 2900 కిలోమీటర్లు. ఇందులో దాదాపు 1700 కిలోమీటర్లు టిబెట్ లోనే ప్రవహించడం గమనార్హం.

సమాచారం ఇవ్వకుండానే....

భారత్ కు బ్రహ్మపుత్ర నదికి అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఈశాన్యరాష్ట్రాలకు ఇది జీవనాడి. అసోం, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో బ్రహ్మపుత్ర పాత్ర అత్యంత కీలకం. నిరంతరం నది ప్రవహించడం వల్ల తీర ప్రాంతంలో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. బోర్ల ద్వారా ఈ నీటిని ఉపయోగించుకుని రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ఎగువన ఉన్న చైనా చేపట్టే వివిధ నిర్మాణాల వల్ల భారత్ కు లభించే నీటిలో భారీగా గండి పడుతుంది. దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. ఒప్పందం ప్రకారం చైనా నుంచి భారత్ లోకి ప్రవహించే నదులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎగువ దేశమైన చైనా దిగువ దేశమైన భారత్ కు తప్పనిసరిగా తెలియజేయాలి. నీటి లభ్యత, వర్షపాతం, వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఏటా రెండుసార్లు భారత్ కు తెలియజేయాలి. రెండు దేశాల మధ్య 2008, 2010, 2013ల్లో కుదిరిన ఒప్పందాల ప్రకారం నదులకు సంబంధించిన సమస్త సమాచార మార్పిడి తప్పనిసరి. కాని డోక్లాం ఘటన అనంతరం భారత్ అంటే అసహనం ప్రదర్శిస్తోన్న చైనా ఒప్పందాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు నీటి పంపకాలు చేసుకోవడం తెలిసిందే. కానీ చైనా అయితే ఏకపక్షంగా, స్వార్థపూరితంగా ఏ దేశం కూడా వ్యవహరించదు. సింధూ నదీ జలాలను భారత్-పాకిస్థాన్ లో పంచుకుంటున్నప్పటికీ పెద్దగా వివాదాలు లేవు. గంగానది నీటిని భారత్ -బంగ్లాదేశ్ పంచుకుంటున్నాయి. ఆయా దేశాలతో ఎప్పుడు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కాని చైనాతో నిత్యం సమస్యలే. డ్రగాన్ ఏకపక్ష వైఖరే ఇందుకు కారణం...!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News