చేతులు కాలాక... చెప్పేదేముంది?

Update: 2018-01-14 15:30 GMT

సుప్రీం వివాదం న్యాయవ్యవస్థకు చుక్కలు చూపిస్తోంది. ఉన్నత న్యాయమూర్తులు తమ మధ్య విభేదాలను బయటపెట్టుకోవడం అసలు సమస్యే కాదంటున్నాయి న్యాయవాద వర్గాలు. అందరికీ నీతులు చెప్పి వ్యవస్థలను సక్రమంగా నడిచేలా చూసే సుప్రీం కోర్టు ను ఇప్పుడు దారిలోకి తెచ్చేదెవరు? అన్న ప్రశ్న తొలిచేస్తోంది. ఒకవేళ అందుకు ఎవరైనా పూనుకుంటే సుప్రీం అంగీకరిస్తుందా? లేకుంటే రెండు పిల్లులు వివాదం తీర్చడానికి కోతి రాజు పాత్ర పోషించేందుకు మరొక రాజ్యాంగ వ్యవస్థ సిద్ధంగా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ మంచో, చెడో అంతర్గత సర్దుబాబు, దిద్దుబాటు చర్యలకు పూనుకోకుండా ఒక్కసారిగా సీనియర్ మోస్టు న్యాయమూర్తులు సంచలనాలకు వేదిక అయిన మీడియాను నేరుగా ఆశ్రయించడం అవ్యవస్థకు దర్పణం పడుతోంది. ఈ పరిణామం ఎటుదారితీసినా భవిష్యత్తులో ఒక వేలు న్యాయవ్యవస్థను తప్పుపట్టేందుకు సదా సిద్దంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

లుకలుకలు కాదు..లూప్ హోల్స్...

పరిపాలనపరమైన అంశాలు, కేసుల కేటాయింపులో వివక్ష, కొన్ని కీలకమైన కేసులు సీనియర్ జడ్జిల బెంచీలకు రాకుండా జాగ్రత్తపడుతున్నారనే అభియోగాలే మొదటగా బహిరంగమయ్యాయి. సీనియర్ న్యాయమూర్తుల సలహాలు, సూచనలను ప్రధానన్యాయమూర్తి పట్టించుకోవడంలేదన్న స్పర్థతోనే మీడియాను ఆశ్రయించారని తొట్టతొలుత న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి. మరింత లోతైన కారణాలు ఇందులో దాగి ఉన్నాయని సుప్రీం కోర్టుతో సంబంధం నెరిపే న్యాయవాద, పరిపాలక వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీజనరల్ ద్వారా కొన్ని పనులను చక్కబెట్టిస్తూ ఉంటుంది. నేరుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, బెంచిలతో సమావేశమయ్యే యాక్సెస్ ఆయనకు ఉంటుంది. కొన్ని చట్టాలు, అత్యున్నత పదవుల నియామకాల అంశంలో సుప్రీం నుంచి రాజ్యాంగ పరమైన అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్త పడే క్రమంలో అటార్నీ జనరల్ చురుకైన పాత్ర పోషిస్తుంటారు. సుప్రీం కనుక తప్పుపడితే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. విపక్షాలకు బ్రహ్మాండమైన రాజకీయ సమరాయుధం దొరుకుతుంది. అటార్నీ జనరల్ కుండే ఈ ప్రత్యేక సమావేశావకాశం దుర్వినియోగమవుతుందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమిత్ షా దోషిగా ఉన్న సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు విచారిస్తున్న జడ్జి లోయ మృతి కేసులో సుప్రీం వేగంగా స్పందించకపోవడం,మెడికల్ సీట్ల స్కాములో న్యాయమూర్తులపైనే ఆరోపణలు వెల్లువెత్తడం వంటివన్నీ చర్చనీయమవుతున్నాయి. పారదర్శకతకు ఆస్కారం లేకుండా కప్పిపుచ్చుకునే క్రమంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమంటున్నారు. న్యాయస్థానాలు విచారిస్తున్న అత్యధికశాతం కేసుల్లో వాది లేదా ప్రతివాదిగా ఉండే కక్షిదారు ప్రభుత్వమే. అటువంటి స్థితిలో న్యాయస్థానం ప్రభుత్వాన్ని సైతం దూరంగానే ఉంచాలి. కానీ ప్రభుత్వ న్యాయాధికారికి న్యాయవ్యవస్థలో కొన్ని విశేషావకాశాలు లభిస్తున్నాయి. అదే నేటి వివాదంలో అంతర్బాగం.

క్రమశిక్షణ గడప దాటితే...

ప్రభుత్వ వ్యవస్థలు కట్టుతప్పకుండా నియమనిబంధనలు ఉంటాయి. ఆయా వ్యవస్థలు సక్రమంగా నడవటానికి ఆయా రూల్స్ రక్షణ కవచంగా ఉంటాయి. ప్రభుత్వం, ఇతర వ్యవస్థలు కట్టుతప్పినట్లయితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సరిదిద్దుతుంటాయి. అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. కానీ ఇప్పుడు తమలో మొదటి వాడైన చీఫ్ జస్టిస్ పైనే తర్వాతి స్థానాల్లోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఆరోపణలు చేశారు. ఇది క్రమశిక్షణ రాహిత్యంగానే న్యాయకోవిదులు అంగీకరిస్తున్నారు. జస్టిస్ కర్ణన్ వంటి వారు సర్వోన్నతన్యాయస్థానంపై ఆరోపణలు చేసిన సందర్బంలో న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలుగుతోందని జైలు శిక్ష విధించారు. మరిప్పుడు ఈ పరిస్థితికి ఎలా సమాధానం చెబుతారనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. న్యాయం ముందు అందరూ సమానులే. కర్ణన్ విషయంలో ఒక తరహాలో తమలోని మరో నలుగురు న్యాయమూర్తుల విషయంలో మరో తరహాలో సుప్రీం వ్యవహరించకూడదనే సన్నాయి నొక్కులూ వినవస్తున్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వివాదాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నం చేస్తోంది. అటార్నీ జనరల్ కూడా అదేమంత పెద్ద సంగతి కాదన్నట్లు చెబుతున్నారు. కానీ ఇప్పటికే రోడ్డెక్కిన న్యాయం రోదిస్తోంది. నాలుగు నెలలుగా సుప్రీంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బార్ అసోసియేషన్ కు స్సష్టమైన సమాచారం ఉంది. ముందుగానే జోక్యం చేసుకుని రాజీ కుదిర్చి ఉంటే వ్యవహారం ఇంతవరకూ వచ్చేది కాదు. ఇప్పుడు ప్రత్యేక కమిటీని వేసేందుకు, కేసుల విషయంలో సీజేఐ తర్వాత కొలీజియం న్యాయమూర్తుల బెంచీలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బార్ అసోసియేషన్ రాజీ చేసినట్లు సమాచారం. అయితే సీనియర్ మోస్టు న్యాయమూర్తులే తమ లేఖలో ప్రస్తావించినట్లు సుప్రీంలో అందరు న్యాయమూర్తులూ సమానులే. మరి కేసుల విషయంలో కొలీజియం న్యాయమూర్తులకే ఎందుకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రశ్నలకు బదులు దొరకదు.

రాష్ట్రపతి ...రాజ్యాంగం...

దేశంలో అన్ని వ్యవస్థలపైనా సార్వ భౌమాధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగం సహా అన్నిటినీ మార్చుకోవచ్చు. కానీ దానికి అధిపతి రాష్ట్రపతి. రాజ్యాంగ పదవులు ఆయన సంతకంతోనే భర్తీ అవుతాయి. న్యాయమూర్తుల నియామకాలు, మహాభియోగతీర్మానాలు వంటివాటికన్నిటికీ రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం, పార్లమెంటు చేసే నిర్ణయాలపై సందేహాలుంటే రాష్ట్రపతి సుప్రీం కోర్టు న్యాయసలహా కోరతారు. సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. తమకు తామే ఆర్డర్లు ఇచ్చుకునే సౌలభ్యం ఉంటుంది. వసతులు మొదలు వేటికైనా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. సుప్రీంకు కష్టం ఏర్పడితే నేరుగా రాష్ట్రపతిని అభ్యర్థించే అవకాశం ఉంది. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ విషయంలో రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక బాధ్యతలు, హక్కులు ఉంటాయి. న్యాయవ్యవస్థలో ని అవాంఛనీయ పరిణామాలపై లోకం కోడై కూయకముందే సీనియర్ మోస్టు న్యాయమూర్తులు రాష్ట్రపతిని సంప్రతించి ఉంటే బాగుండేదని కొందరి అభిప్రాయం. సీజేఐ అభిశంసన వంటి విషయంలో ప్రజలే నిర్ణయించాలని గోడు వెళ్లబుచ్చుకున్న న్యాయమూర్తులు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే ప్రథమ పౌరుడు రాష్ట్రపతిని విస్మరించడం విషాదం. స్వయంగా న్యాయకోవిదుడైన కోవింద్ దృష్టిలో పెట్టి ఉంటే సమస్య ఇంతదూరం వచ్చి ఉండేది కాదంటున్నారు. కేంద్రప్రభుత్వ పెద్దలతో ఆయనకున్న సాన్నిహిత్యం రీత్యా తీవ్రతను ప్రధాని దృష్టిలో పెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకొని ఉండేవారనేది సుప్రీంలోని కొందరు న్యాయనిపుణుల వాదన. రాష్ట్రపతి, పార్లమెంటు, ప్రభుత్వము మూడు వ్యవస్థల ద్వారా సమస్యను పరిష్కరించే వెసులుబాటు ఉంది. ఆ మార్గాలేవీ కాకుండా మీడియా నోట్లో పడటంతో గంటల కొద్దీ సమయం, పేజీల కొద్దీ సమాచారం న్యాయవ్యవస్థ నాణ్యత, ప్రమాణాలపై ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News