చీలికలే శ్రీరామ రక్ష...!

Update: 2018-01-01 15:30 GMT

దాదాపు అన్ని రాజకీయ పక్షాలను, సకల జనులను ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు విభజించి పాలించే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ భూతల స్వర్గంగా మారుతుందన్న హై ఎక్స్ పెక్టేషన్లతో రాష్ట్రంలోని ప్రజలు ఎదురుచూస్తుండటం వల్ల తీవ్రమైన అసంతృప్తి నెలకొంటోంది. ఆదాయ వనరులు అధికంగా ఉండటం వల్ల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గతం కంటే మెరుగైనప్పటికీ ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. ఆశలను తీర్చలేకపోతున్నాయి. ప్రజల డిమాండుకు, ప్రభుత్వ సరఫరాకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం నెలకొనడంతో అసంత్రుప్తి ఆవేదనగా, ఆందోళనగా మారుతోంది. విభిన్న రూపాల్లో రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, పౌరవేదికల ద్వారా నిరసన గళం విప్పుతున్నారు. ఈ స్వరాలన్నీ ఒకే వేదికపైకి చేరితే కచ్చితంగా అధికారపక్షానికి ఇబ్బందికరమే. ప్రజల ఆందోళన ఆగ్రహంగా మారితే అధికారపీఠానికి సంకటం తప్పదు. ఇది గ్రహించిన కేసీఆర్ త్రిముఖ వ్యూహంతో ప్రతి అడుగూ పక్కా రాజకీయ ఎత్తుగడగా మార్చేశారు. 2017 తెలంగాణ రాజకీయ ముఖచిత్రం లో కుల కూటముల జంజాటం జగమెరిగిన సత్యం.

కుల కూటములు...

అధికారపక్షమైన టీఆర్ఎస్ అధినాయకత్వం తెలంగాణ లో బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. అందువల్ల వివిధ సామాజిక వర్గాలను కులాలవారీగా సంతృప్త పరచడం ద్వారా మెజార్టీ మద్దతు కూడగట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనాభా అధికంగా ఉంది. వీరిలో ఎక్కువ మంది కులవృత్తులపై ఆధారపడి గ్రామాల్లో ఉపాధి పొందుతున్నారు. అందువల్ల కులాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యేక పథకాలు అమలు చేయడం ద్వారా టీఆర్ఎస్ ఓటు బ్యాంకు పటిష్ఠ పరిచే ప్రయత్నం సాగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ అప్పటికి ఉన్న తెలంగాణ సెంటిమెంటు ప్రభావం దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సెంటిమెంటు కరిగిపోయింది. ఇప్పుడు ప్రజలు వ్యక్తిగతంగా తమకు సమకూరే ప్రయోజనాల ఆధారంగానే ప్రభుత్వ పనితీరును అంచనా వేసుకుంటున్నారు. సామూహిక పథకాలు, మౌలిక వసతుల మెరుగుదల కంటే ఇంటింటికీ, ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ప్రయోజనం సమకూరేలా చేస్తేనే ఓటు బ్యాంకు స్థిరపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, వ్యక్తిగత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇవి కాకుండా యాదవ, కురుమ, బెస్త, పద్మశాలి ..ఇలా కులాల వారీగా సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభించారు. వేల కోట్ల రూపాయల తో గొర్రెల పంపిణీ, చీరల పంపిణీ, చేపల వలల పంపిణీ, చేనేతలకు సబ్సిడీలు వంటి పథకాలకు భారీగా నిధులు మళ్లిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. కులాలవారీగా సంక్షేమ భవనాలను హైదరాబాదులో నిర్మించేందుకు కేసీఆర్ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎంబీసీలను లక్ష్యంగా చేసుకుంటూ వెయ్యికోట్ల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమూ పొలిటికల్ కోణంలో తీసుకున్న నిర్ణయమే. సకల జాతులు ఒక్కటై నినదించి రాష్ట్రాన్ని తెచ్చుకోవడం నాటి అవసరం. కులాలవారీ లబ్ధి కోరుతూ ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూడాల్సి రావడం నేటి రాజకీయ ప్రాధాన్యం.

సంతృప్త సంక్షేమం...

ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉన్న తెలంగాణలో సంక్షేమపరంగా ఏ ఒక్కరూ తమను విస్మరించారని భావించకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. కుటుంబ సర్వేలను ఆధారంగా చేసుకుంటూ పింఛన్లు, రాయితీలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కొంత దుర్వినియోగం జరుగుతున్నప్పటికీ పెద్ద ఎత్తునే ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. శాశ్వతంగా ప్రజల మనస్సులో నిలిచిపోవాలంటే టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తులో ఎవరూ చేయడానికి కూడా సాహసించని విధంగా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. గడచిన అయిదారు నెలల్లో వీటిపైనే ఫోకస్ పెడుతూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. లక్ష రూపాయల రైతుల రుణమాఫీ కి సంబంధించి న వాయిదాలను ప్రభుత్వం క్లియర్ చేసేసింది. రైతాంగం భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపేలా, పెట్టుబడి రాయితీ పేరిట ఎకరాకు ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశంలోనే వినూత్నమైన ప్రయోగం. రైతాంగం రుణ పడి ఉండటమే కాదు, టీఆర్ఎస్ కి శాశ్వత మద్దతుదారులుగా అన్నదాతలు మిగిలిపోవాలనేది కేసీఆర్ భావన. ఈ దిశలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే టీఆర్ఎస్ ఎన్నికల పంట పండినట్లే.

డివైడ్ అండ్ రూల్...

కులాలు, మతాల వారీగా ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంతగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఒక్కోసారి కాలం కలిసిరాకపోతే ఆశించిన అధికారం దక్కకపోవచ్చు. ఇందుకు ప్రదాన కారణం, చీలికలు పేలికలుగా ఉన్న అసంతృప్త వాదులు, రాజకీయ పక్షాలు ఒకే తాటి పైకి వచ్చి బలమైన గొంతుక వినిపించినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. తెలంగాణ సమాజం భిన్న రాజకీయ బాణీలకు, వాదనలకు వేదిక. వీరంతా ఒక్కటై అధికారపక్షంపై దాడికి తెగపడితే టీఆర్ ఎస్ గెలుపు అవకాశాలపై ప్రతికూలత ఏర్పడుతుంది. ఒకే కూటమిగా కాంగ్రెసు,వామపక్ష, పౌరసంఘాలు చేరినప్పుడు గట్టిపోటీ తప్పకపోవచ్చు. దీనిని నిరోధించేందుకు కేసీఆర్ చేస్తున్న వ్యూహ రచన మరో పరిణామం. బీజేపీతో దూరమవుతున్న టీడీపీని వ్యూహాత్మకంగా చేరదీస్తున్నారు. మైనారిటీల మద్దతు కాంగ్రెసుకు మళ్లకుండా ఎం.ఐ.ఎంతో చెలిమికి బాటలు వేసుకున్నారు. కాంగ్రెసు, వామపక్షాలు కలవకుండా ముందస్తుగానే ఎదురుదాడి మొదలు పెట్టారు. వామపక్ష సీపీఐ తమ దాయాది సీపీఎం తో కలవకుండా కాంగ్రెసు బాట పడుతోంది. సీపీఎం నేత్రుత్వంలోని టీమాస్, పౌరసంఘాలు మరో వేదికగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇలా నాలుగైదు కూటములు బరిలో నిలవడం టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశమే. దీనిని ఇదే రకంగా ప్రోత్సహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. అన్నిపక్షాలు ఒకే బాటలోకి రాకపోవడం వల్ల టీఆర్ఎస్ ను ఎదుర్కొనే మహాకూటమి నిర్మాణం సాధ్యం కాదు. అందుకే ఆయా పక్షాల మధ్య పరస్పరం అనుమానాలు రేకెత్తేలా, విశ్వాసరాహిత్యం నెలకొనేలా టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. సింగరేణి ఎన్నికల్లో ఈరకమైన ఎత్తుగడతోనే వామపక్ష, కాంగ్రెసు అనుబంధ కార్మిక సంఘాలన్నీ ఒకే తాటిపైకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సీపీఎం నేత్రుత్వంలోని టీమాస్, పౌరసంఘాల వేదిక ఒక కూటమిగా, కాంగ్రెసు, సీపీఐ ఒక కూటమిగా, బీజేపీ, ఎంఐఎంలు ఒంటరిగా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బీసీల్లో కొంతమేరకు మద్దతు ఉన్న టీడీపీని కలుపుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావాలనేది కేసీఆర్ యోచన. ఇందుకు సంబంధించిన రాజకీయ వ్యూహంతో కూడిన ప్రాథమిక చిత్రానికి 2017లో క్లాప్ కొట్టేశారు కేసీఆర్.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News