చిక్కుల్లో కేసీఆర్

Update: 2017-01-05 06:31 GMT

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ కోసం టి. సర్కార్ జారీ చేసిన జీవో నెంబరు 123పై ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇకపై తెలంగాణలో ఎటువంటి భూసేకరణ జరపవద్దని స్పష్టమైన ఆదేశాలను న్యాయస్థానం జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. వీటికోసం భూసేకరణను చేయాల్సి ఉంది. మల్లన్నసాగర్, ప్రాణహిత, గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల కోసం పెద్దయెత్తున భూసేకరణ జరపాల్సి ఉంది. చిన్నచిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా భూసేకరణ జరపాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఉత్తర్వులు రావడంతో భూసేకరణ ప్రక్రియకు ఆటంకం కల్గే పరిస్థితి ఏర్పడింది.

అయితే 2013 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్ట ప్రకారం అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాని తెలంగాణ సర్కారు 2013 భూసేకరణ చట్టం కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చేందుకే జీవో నెంబరు 123 ని తెచ్చామని చెబుతోంది. 123 జీవోతో 2013 చట్టం కన్నా ఏడు రెట్టు అధికంగా నిర్వాసితులు లబ్దిపొందుతారని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు. కాని మల్లన్నసాగర్ తో పాటు మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అనేకమంది భూనిర్వాసితులు జీవో నెంబరు 123పై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు 123 జీవో ప్రకారం భూసేకరణ జరపడానికి వీల్లేదని చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భూ సేకరణలో చిక్కులు తప్పేట్లు లేవు.

Similar News