చంద్రబాబూ ఇదా... సమర్థ పాలన?

Update: 2017-10-20 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అస్తవ్యస్థంగా ఉంది. పాలకుల మాటలకు, చేతలకు అసలుపొంతనే ఉండటం లేదు. రెండింటికి మధ్య హస్తిమశాకంతరం తేడా కనపడుతోంది. వేదికలపై పాలకులు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య సారూప్యత ఉండటం లేదు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కన్నా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు జేబులు నింపే లక్ష్యంతోనే పథకాల రూపకల్పన జరుగుతోందన్న ఆరోపణలను తోసిపుచ్చలేం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా తదితర అంశాల్లో ప్రభుత్వ వైఖరి అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. పారదర్శరకత కొరవడుతోంది. ఫలితంగా విభజిత ఏపీ ఉసూరుమంటోంది. ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా అటకెక్కించింది. దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్య పెడుతోంది. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా నష్టపోతున్న ఏపీకి ప్రత్యేకహోదా పదేళ్లు కావాలని నాటి బీజేపీ అగ్రనాయకుడు, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. మరో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పదేళ్లు చాలదు... పదిహేనేళ్లు కావాలని...గళమెత్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు నాయుళ్లు మాట మార్చారు. ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని దబాయించారు. అంతేకాక ప్రత్యేక హోదా గతంలో పొందిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి సాధించలేదని వాదించడం వారికే చెల్లింది. 14వ ఆర్థిక సంఘం నిబంధనలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఈ లెక్కలు తప్పా?

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎంపీ వివేక్ గుప్తా ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ ఇచ్చిన వివరాలు చూస్తే ఏపీకి జరిగిన నష్టం ఏమిటో అర్ధమవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.... ప్రత్యేక హోదాగల 11 రాష్ట్రాల్లో జనాభా 7.5 కోట్లు. దేశ జనాభాలో ఈ రాష్ట్రాల వాటా 6.2 శాతం. జనాభా ప్రాతిపదికన చూస్తే అన్ని రాష్ట్రాలకు కలిపి 9,42,745 కోట్లు ఇస్తే.... 11 రాష్ట్రాలకు 1,32,582 కోట్లు కేంద్రం విడుదల చేసింది. 6.2 శాతం జనాభా ఉన్న 11 రాష్ట్రాలకు 14.06 శాతం నిధులు ఇచ్చారు. ఏపీ జనాభా 4.2 కోట్లు కాగా నిధులు 4.06 శాతం కావడమే గమనార్హం. హోదా లేని కారణంగా వచ్చింది 44,747 కోట్లు మాత్రమే. అదే హోదా ఉండి ఉంటే సుమారు 88 వేల కోట్లు వచ్చి ఉండేవి. అర్థ శాస్త్రంలో పీజీ చేసిన చంద్రబాబుకు ఈ గణాంకాలు తెలియనవి కావు. కానీ కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితుల్లో ఆయన ఈరోజు లేరు.

ఎందుకీ కుప్పిగంతులు....?

ప్రతిష్టాత్మకమైన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులు సగటు పౌరుడిని అయోయమంలో పడేస్తున్నాయి. ఈ పేరు చెప్పి ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేయడం తప్పితే నిర్దిష్టంగా ముందుకు వెళ్లిన దాఖలాలు లేవు. నిష్ణాతులైన ఇంజినీర్లను పక్కన బెట్టి రాజమౌళి, బోయపాటి శీను వంటి సినీ దర్శకులపై ప్రభుత్వం ఆధారపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ గడ్డపై పుట్టి పెరిగిన కె.ఎల్.రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ చెక్కు చెదరకుండా ప్రజాసేవలో పునీతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణాల్లో కె.ఎల్. రావు సేవలు చిరస్మరణీయం. ఆయన సేవలకు కృతజ్ఞతగా ఒకసారి విజయవాడ నుంచి లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈతరంలో తెలుగు ఇంజినీర్ల ప్రతిభాపాటవాలు ఎల్లలు దాటుతున్నాయి. ఆప్ఘనిస్తాన్ లో పార్లమెంటు భవనాన్ని ఏపీకి చెందిన బొల్లినేని శీనయ్య కంపెనీ నిర్మించిన విషయం గమనార్హం. కళ్ల ముందే కనపడుతున్న వాస్తవాలను విస్మరించి, ఈ పేరుతో బాబు బృందం విదేశీ పర్యటనలు చేయడం, సినీ దర్శకులపై ఆధారపడటం దాని దివాలాకోరుతనానికి నిదర్శనం. రాజధాని భూసమీకరణ స్వచ్ఛందంగా జరగలేదని, బలవంతంగా, బెదిరింపులతో ప్రభుత్వం ముందుకు వెళ్లిందన్న సగ్నసత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో అమరావతిని సందర్శించిన ప్రపంచబ్యాంకు బృందం ముందు బాధితులు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రపంచబ్యాంకు బృందం తన పర్యటనలో గుర్తించింది. ఈ ప్రాంతంలో భూమిలేని కూలీలలు సుమారు 20,259 మంది ఉంటారని అంచనా. ప్రస్తుతం వారికి ఇస్తున్న నెలవారీ పింఛను 2500 రూపాయలు వారి జీవనోపాధికి ఎంతమాత్రం చాలడం లేదు. గతంలో ఈ ప్రాంతంలో పంటలు పండే సమయంలో కూలీలకు సగటున రోజుకు కనీసం రూ.500లు కూలీ లభించేది.

పోలవరం పై అనుమానాలు.....

ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి అనుమానాలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉంది. ఎప్పుడో 80వ దశకం ప్రారంభంలో తెలంగాణ నాయకుడైన ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు తిరిగి వైఎస్ హయాంలో వెలుగులోకి వచ్చింది. 1996 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు మాత్రం తానే సర్వస్వం అయినట్లు బడాయిలకు పోతున్నారు. వైఎస్ హయాంలో కుడికాల్వ పనులు చేపట్టినప్పుడు ప్రాజెక్టు నిర్మాణం కాకుండానే కాలువలు ఎలా నిర్మిస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఇదే జలయజ్ఞం కాదని ధనయజ్ఞమని ధ్వజమెత్తారు. కుడి కాల్వ పనులకు సంబంధించి భూసేకరణ తదితర వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని చికాకు పెట్టేందుకు రైతుల పేరుతో చంద్రబాబు టీడీపీ నాయకుల చేత కోర్టుల్లో కేసులు కూడా వేయించారు. వైఎష్ దాదాపుగా పూర్తి చేసిన కుడికాల్వ ద్వారా పట్టిసీమ పేరుతో కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తరలిస్తున్న బాబు అంతా తన ఘనతేనని అదే పనిగా ప్రచారం చేసుకోవడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఇప్పటిదాకా ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిస్తామని బీరాలు పలికిన బాబు ఇప్పుడు మాట మారుస్తున్నారు. టీడీపీకి చెందిన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుదిగా చెబుతున్న అసమర్థ కంపెనీ టాన్ స్ట్రాయ్ కు తొలుత ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పారు. సరైన ట్రాక్ రికార్డు లేన టాల్ స్టాయ్ కు కాంట్రాక్టు ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా కాంట్రాక్టర్ ను మార్చేందుకు కేంద్రంపై వత్తిడి తెస్తున్నారు. అదేపనిగా వేల కోట్ల రూపాయలను పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేయడం తప్ప ఇప్పటి వరకూ పెద్దగా చేసింది ఏమీ లేదన్న విమర్శలకు జవాబు లేదు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలంటే ప్రస్తుత కాంట్రాక్టరును తొలగించి కొత్తవారికి అప్పజెప్పడమే ఏకైక మార్గమని చెప్పడం విచిత్రం. ఇందుకు కేంద్రం ససేమిరా అంటున్నా కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రత్యేకంగా నాగపూర్ వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. కాంట్రాక్టరును మారిస్తే 30 శాతం అదనపు భారం పడుతుందని స్వయంగా గడ్కరీ చెప్పడం విశేషం. తగిన సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం లేని సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వడమే పెద్ద తప్పు. దానిని కొనసాగించడం మరో తప్పు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కాంట్రాక్టరు సామర్థ్మంపై సందేహాలు రావడం విచిత్రం. సమర్థుడైన చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా?

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News