చంద్రబాబుకు మళ్లీ హ్యాండిచ్చిన కేసీఆర్...?

Update: 2017-12-14 10:45 GMT

దేశ విదేశాలకు ఆహ్వానాలు పంపించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతులను అతిథులుగా పిలిచారు. తెలుగు ప్రముఖులకు సన్మానాలకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర లో ఉన్న తెలుగు గవర్నర్ కూ కబురంపారు. కానీ పక్కనే ఉన్న సోదర తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి సంగతి మాత్రం మరిచిపోయారు. ఇంతకీ చంద్రబాబు నాయుడిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఎవరు ఆహ్వానించాలి? చివరి క్షణంలో తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులకు ఈ సందేహమే తలెత్తింది. ఆహ్వాన సంఘాలను, కేబినెట్ సబ్ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు. కానీ ఉద్దేశ పూర్వకమో, ఉదాసీనమో తన పూర్వ టీడీపీ సహచరుడు అయిన చంద్రబాబు విషయం విస్మరించారు. తమ స్థాయి కాదని, సీఎం చూసుకుంటారని కేబినెట్ కమిటీ అసలు ఆ దిశలోనే ఆలోచన చేయలేదు. పోనీ ఏదో అధికారులను పంపించి ఆయనకు పిలుపునంపుదామా? అంటే ప్రొటోకాల్ గుర్తు కొస్తోంది. భాషానుబంధం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సులో అసలు ఆహ్వాన పత్రికలో సైతం ఎక్కడా చంద్రబాబు పేరు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీనిని బట్టి చూస్తే పొమ్మనకుండా పొగ బెట్టినట్లు ,రమ్మనకుండానే విముఖత చూపినట్లయింది.

నేస్తమా... ఇద్దరి లోకం ఒకటే...

హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతికి మార్చిన తర్వాత ఇరువురి ముఖ్యమంత్రుల మద్య వ్యక్తిగత సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. ద్విశత చండీయాగం నిర్వహించిన సందర్బంగా స్వయంగా విజయవాడ వెళ్లి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. అమరావతి శంకుస్థాపనకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు వాటి స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఉత్సవాలే. 41 దేశాలకు చెందిన తెలుగు వారు పాల్గొంటున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన తెలుగువారికీ ఈ సదస్సు ఆతిథ్యం ఇస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషా, సాహిత్య, సంస్కృతులను నెమరువేసుకునే ఉత్సవం. అనుబంధాన్ని, ఆత్మీయతను పంచుకునే మధుర క్షణం. ఇటువంటి సందర్బంలో భేషజాలకు పోకుండా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని దేశ విదేశాల్లోని తమ సోదరులకు స్వాగతం చెప్పాల్సిన తరుణం. తెలుగు జాతి మనది రెండుగ, నిండుగ వెలుగు జాతి మనది అని చాటిచెప్పుకోవాల్సిన శుభ సమయం. తెలుగు జాతికి నాయకులైన ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఇగోలు, ఆధిపత్య భావనలు అనుబంధానికి అడ్డుకట్ట వేస్తున్నాయి.

వెంకయ్య పైనే వేయి కళ్లు...

ఉన్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న తెలుగు వ్యక్తి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఆయన సన్నిహితుడే. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన అనేక సమస్యల పరిష్కారంలోనూ, కేసులు పెట్టుకుని పరస్పర హననానికి పాల్పడాలని భావించిన సందర్భంలోనూ వెంకయ్య నాయుడే మధ్యవర్తిత్వం వహించారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. కలిసి నడిస్తేనే కష్టాలు తొలగుతాయని రాజీ కుదిర్చారు. కేంద్రం చేతిలోకి చక్రం వెళ్లకుండా అడ్డం పడి ఆపద్భాంధవునిలా ఆదుకున్నారు. జాతీయ స్థాయి సీనియర్ రాజకీయ వేత్త కూడా కావడంతో కేసీఆర్, చంద్రబాబులకు ఆయనపై వ్యక్తిగత గౌరవం కూడా ఉంది. రెండు ప్రాంతాల ప్రగతిని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇతర కేంద్రమంత్రులతో సంప్రతించి పరిష్కరించేవారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన చంద్రబాబును కావాలని సభలకు దూరం పెట్టడం మంచి సంకేతాలను అందించదని భాషా వేత్తలు పేర్కొంటున్నారు.

మరికొన్ని గంటల్లోనే...

మరికొన్ని గంటల్లోనే ప్రపంచ తెలుగు భాషోత్సవాలు ప్రారంభం కాబోతున్న స్థితిలో ఇంతవరకూ చంద్రబాబు నాయుడి రాకపై అధికారిక సమాచారం లేదు. ఆయనకు కనీస ఆహ్వానమే లేదనేది ఏపీ ప్రభుత్వ వర్గాలు ఇస్తున్న సమాధానం. భాష అనేది ప్రజల సెంటిమెంటుతో కూడా ముడిపడిన అంశం. యాసలు వేరైనా ఒకే భాష మాట్టాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి వేదికను పంచుకుంటే జాతికి మేలు జరుగుతుందని భాషా వేత్తలు కోరుకుంటున్నారు. దేశంలో అత్యధికులు మాట్టాడే మూడో భాషగా గుర్తింపు పొందిన తెలుగు వ్యాప్తికి, పరిరక్షణకు ఈ ఇద్దరు సీఎంలు ప్రపంచ సభల సాక్షిగా ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించవచ్చు. అటువంటి ప్రకటనలు తెలుగు భాష భవితవ్యానికి భరోసానిస్తాయి. చివరి క్షణాల్లో అయినా అప్రమత్తమై తెలంగాణ సర్కారు, ప్రత్యేకించి కేసీఆర్ చంద్రబాబును సంప్రతించడం మేలు. సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకోవాల్సిన సన్నివేశంలో దూరం పెంచుకోవడం ఉభయులకూ నష్టదాయకమే. వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని చంద్రబాబును రమ్మంటే ఇప్పటికీ ఆయన సభలకు వచ్చేందుకు అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల క్రితమే చంద్రబాబు ఒక రోజంతా హైదరాబాదులోనే గడిపారు. కేసీఆర్ సమయం తీసుకుని అప్పుడే కలిసి ఉంటే సమస్య ఉత్సన్నమయ్యేది కాదు. భాషా వేదిక పుణ్యమాని తెలియకుండానే ఇరు రాష్ట్రాల మద్య దూరం పెరిగిపోతోంది.

స్థిరవాసుల చిరు కోరిక..

కొన్ని తరాల ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కోస్తాంధ్ర,రాయలసీమ వాసులు ఇరువురు అగ్రనాయకులు కలవాలని మనసా వాచా కోరుకుంటున్నారు. ఇందువల్ల హైదరాబాదులో ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న తమకు మంచి జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. తీవ్రమైన రాజకీయ పోటీ తగ్గిపోయింది. తెలంగాణపై టీడీపీ ఆశలు కూడా సన్నగిల్లిపోయాయి. ఈ స్థితిలో చంద్రన్నలిద్దరూ చేయి కలపడం ఉభయ శ్రేయోదాయకంగా ఉంటుందంటున్నారు పెద్దలు. వెంకయ్య రాజ్యాంగ పదవిలోకి వెళ్లిపోయిన తర్వాత వీరిని కలిపి కూర్చెబెట్టి రాజకీయం నడపగల అగ్రనేతలు కరవయ్యారు. అది కూడా తాజా సమస్యకు కారణమవుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News