చంద్రబాబుకు చుట్టేశారు....!

Update: 2017-10-26 14:30 GMT

కేంద్రం తేల్చేసింది. చంద్రబాబు తలకు చుట్టేసింది. పైసా పెంచేది లేదు పొండంటూ పోలవరానికి పొగ బెట్టింది. ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టరును మార్చవద్దంటూ కఠినంగానే చెప్పింది. తగుదునమ్మా అంటూ అన్నీ తానై తలదూర్చిన చంద్రబాబు నాయుడే ఇక పోలవరం సంగతులు చూసుకోవాలి. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు 2019 నాటికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అన్నివిధాలా సహకరిస్తామంటూ ముక్తాయింపునిచ్చారు కేంద్రమంత్రి గడ్కరీ. రాజకీయం, ఆర్థిక కోణం, సాంకేతిక సమస్యలు అన్నిటినీ కలగలిపి రాష్ట్రం నెత్తిమీద పోలవరం పెనుభారంగా మారబోతోంది. కేంద్రం చిద్విలాసం చూడబోతోంది. క్రెడిట్ కొట్టేయాలని చూసిన సీఎం బాబుకు కెవ్వుమనిపించే షాక్ ఇచ్చారు గడ్కరీ. పోలవరం తొలి అంచనాలతో పోలిస్తే ప్రాజెక్టు వ్యయం మూడురెట్లు పెరిగిపోయింది. అందుకే కాంట్రాక్టును మార్చి కొత్తవారికి అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు కొత్త కాంట్రాక్టు అంటే కనీసం 30 శాతం ఖర్చుపెరుగుతుందంటూ ఈ ప్రతిపాదనను గతంలోనే కేంద్రం తోసిపుచ్చింది. అయితే ముఖ్యమంత్రి నాగపూర్ వెళ్లి మరీ గడ్కరీ తో చర్చించి కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖలు, పోలవరం అథారిటీతో సమావేశం నిర్వహించేందుకు అంగీకరింప చేశారు. మీటింగు జరిగింది కానీ తన తొలి వాదనకే కేంద్రం కట్టుబడింది. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లకు ససేమిరా అంటూ మరింత స్పష్టంగా తేల్చి చెప్పింది.

కాంట్రాక్టు ..మ్యారేజీ....

‘పెళ్లైన తర్వాత కాపురం చేయాల్సిందే. ప్రభుత్వానికి , గుత్తేదారుకు కుదిరిన ఒప్పందం కూడా వివాహ సంబంధం లాంటిదే. సమన్వయంతో పనిచేయించుకోండి‘ అంటూ ఉచిత సలహాను పారేశారు కేంద్రమంత్రి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టరువైపే ఉంటామన్న సంకేతాలిచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టు సంస్థ ఐసీయూలో ఉంది. దానిని చంపేయకుండా ఆక్సిజన్ ఇచ్చి బతికించి పనులు చేయించుకోండి. ఆర్థిక అవసరాలకు అడ్వాన్సులు మంజూరు చేయండి అంటూ అవ్యాజ్యమైన కరుణను, ప్రేమను కూడా కనబరిచారు గడ్కరీ. ఒకవేళ కాంట్రాక్టరును మారిస్తే అదనపు ఖర్చును మీరే భరించాలని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల నష్ట పరిహారం నాలుగైదు రెట్లు పెరిగిపోయింది. కనీసం దానినైనా చెల్లిస్తారని ఆశించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ప్రాజెక్టు నిర్మాణంతో దానిని ముడిపెట్టవద్దని విడిగా చర్చిద్దామని చెప్పారు. అంటే పోలవరం నిర్మాణం వరకే మాకు బాధ్యత. ఇతరత్రా వ్యవహారాలు మీరే చూసుకోండన్నట్లుగా ఉందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సంస్థలు, జాతీయ రహదారులు మంజూరు చేసే సందర్భాల్లో భూమి, మౌలిక వసతుల వంటి విషయాలను ఆయా రాష్ట్రప్రభుత్వాలు చూసుకుంటాయి. నిర్మాణం, సిబ్బంది నియామకాలు వంటివి కేంద్రం భరిస్తుంది. పోలవరానికి కూడా ఇదే వర్తింప చేసే ఆలోచన కేంద్రానికి ఉందేమోనన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. భూసేకరణ భారాన్ని పాక్షికంగా కూడా భరించే స్థితిలో రాష్ట్రం లేదు. నిజానికి ఇది జాతీయ ప్రాజెక్టు. సర్వం సహా కేంద్రమే చూసుకోవాలి. కానీ చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి పర్యవేక్షణ, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నారు. ఇదొక్కటి చాలు కేంద్రం కొర్రీ వేయడానికి. తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి. ఏతావాతా తేలిందేమిటంటే పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం పైకి చెబుతున్నదానికి , అంతర్గత ఉద్దేశాలకు మధ్య చాలా తేడా ఉంది. మీ చావు మీరు చావండన్నట్లుగానే ఉంది పరిస్థితి అంటున్నారు నీరుపారుదల శాఖ ఇంజినీర్లు.

చక్రం తిప్పిన రాయపాటి....

పోలవరం ప్రధాన కాంట్రాక్టును లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోనే చేజిక్కించుకుంది. అంచనా విలువకంటే 14 శాతం తక్కువ మొత్తానికి పూర్తి చేస్తామంటూ ఈ కాంట్రాక్టు పొందింది. ఇప్పుడు సంస్థకు ఈ కాంట్రాక్టు పెనుభారమై కూర్చుంది. గడచిన నాలుగు సంవత్సరాలలో పెరిగిన నిర్మాణ వ్యయంతో గిట్టుబాటు కావడం లేదు. నిధుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ ట్రాయ్ ను పక్కనపెట్టి సబ్ కాంట్రాక్టుల ద్వారానే పనులు కొనసాగిస్తున్నారు. ట్రాన్సుట్రాయ్ ను మార్చేసి ప్రధాన కాంట్రాక్టును వేరేవారికి అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ట్రాన్స్ ట్రాయ్ ప్రతిష్టకు ఇబ్బందికరం. దీనిని దృష్టిలో పెట్టుకునే ఎంపీ రాయపాటి కేంద్రస్థాయిలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అయిదుసార్లు లోక్ సభ సభ్యునిగా , ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన రాయపాటికి హస్తినలో బలమైన రాజకీయ సంబంధాలున్నాయి. పార్టీలకు అతీతంగా ఆయనకు పరిచయాలున్నాయి. అసలు పోలవరంలో ఏం జరుగుతోంది? కాంట్రాక్టరును మార్చాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్దేశమేమిటి? తక్కువ మొత్తంతో పనులను చేపట్టిన తాము ఎలా నష్టపోయింది? వంటి వివరాలన్నిటినీ కేంద్రప్రభుత్వ దృష్టికి రాయపాటి తీసుకెళ్లారు. ఇందుకు బీజేపీ అగ్రనాయకుల సహకారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు ఉద్దేశాలపై అధిష్టానానికి ఫిర్యాదులు గుప్పించారు. ఈ రెంటినీ బేరీజు వేసుకున్న తర్వాత కాంట్రాక్టరు మార్పు ప్రతిపాదనలను తోసిపుచ్చాలని కేంద్ర నాయకులు స్పష్టంగా నిర్ణయించుకున్నారు. గడ్కరీతో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపినా ఫలించలేదు. చంద్రబాబు ఎత్తుకు రాయపాటి ఫై ఎత్తు వేసి చిత్తు చేశాడంటున్నాయి హస్తిన వర్గాలు. ఒకరకంగా చెప్పాలంటే రాయపాటి చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి పొందాలనేది రాయపాటి జీవితాశయం. అందుకు సంబంధించి గతంలో బాబు హామీ ఇచ్చి కూడా ఈ చిన్నవరాన్ని ప్రసాదించడం లేదు. మరోవైపు ట్రాన్సుట్రాయ్ ను పూర్తిగా కాంట్రాక్టు నుంచి తొలగించాలని చూస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే ఢిల్లీలో వ్యూహాత్మకంగా పావులు కదిపి చంద్రబాబు పథకానికి చెక్ పెట్టారు.

గడ్కరీ .. గోల్డెన్ షేక్ హ్యాండ్....

నాది గోల్డెన్ హ్యాండ్ . ఏ ప్రాజెక్టు చేపట్టినా పూర్తవుతుందంటూనే పోలవరానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేశారని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. పునరావాస పథకానికి సంబంధించి కేంద్ర బాధ్యతను ప్రస్తుతానికి పక్కనపెట్టేశారు. పెరిగిన అంచనా వ్యయాన్ని పెంచేది లేదని స్పష్టం చేసేశారు. ప్రధాన కాంట్రాక్టరుకు రాష్ట్రప్రభుత్వం అడ్వాన్సులు ఇచ్చి పనులు చేయించుకోవాలని సూచించారు. తాము మాత్రం పనులు పూర్తయ్యాక బిల్లులు సమర్పిస్తేనే పాత అంచనాల ప్రకారం 75 శాతం నిధులు ఇస్తామన్నారు. తనిఖీల తర్వాత మరో 25 శాతం క్లియర్ చేస్తామన్నారు. అంటే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వానికి బాధ్యత అప్పగిస్తూ పాత అంచనాలతో ..గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేసినట్లేనని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తికరం. బీజేపీ, టీడీపీ సంబంధాలపై కూడా పోలవరం ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News