చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా?

Update: 2018-03-31 15:30 GMT

ప్రచారాస్త్రాలను చంద్రబాబు ఒకటొకటిగా బయటికి తీస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగం రగిలించడం ద్వారా ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు ప్రభావితులవుతారనేది గోబెల్స్ సూత్రం. దానిని తెలుగుదేశం సహా అన్ని రాజకీయ పార్టీలూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. అసెంబ్లీ, బహిరంగ సభ అన్న తేడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు అన్యాయం బీజేపీ, కాంగ్రెసుల మోసం సూత్రాన్ని క్రమం తప్పకుండా వల్లె వేస్తున్నారు. తాజాగా ప్రజలే ప్రభుత్వానికి రుణమివ్వాలనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనివల్ల ఎంత మొత్తం వసూలవుతుందన్నఅంశాన్ని పక్కనపెడితే మంచి ప్రచారాయుధంగా ఉపకరిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.

చాంపియన్ ఎత్తుగడ..

సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసమస్యలపై ప్రతిపక్షం ఛాంపియన్ గా నిలవాలని చూస్తుంది. వైసీపీ ఈ దిశలో కొంత ప్రయత్నం చేసింది. నవరత్నాలు, ప్రత్యేక హోదా వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఏడాదికాలంగా ప్లాన్ చేసుకొంది. నాలుగు నెలల క్రితం జగన్ పాదయాత్రనూ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగడంతో ఈక్వేషన్లలో మార్పు వచ్చింది. అవిశ్వాస ప్రతిపాదన, కేంద్రం చేస్తున్న ఆర్థిక అన్యాయం వంటి అంశాలను జాయింట్ ఫాక్ట్ ఫైండింగు కమిటీ పేరుతో విస్తృత ప్రచారంలోకి తెచ్చారు పవన్. అదే సమయంలో తాను స్వతంత్రంగా ఎదగాలంటే టీడీపీ భారాన్ని వదిలించుకోవాలనుకున్నారు. నారా లోకేశ్, టీడీపీలపై అవినీతి ఆరోపణలు గుప్పించడం ద్వారా ఒక్కదెబ్బతో టీడీపీ మైత్రిని దూరం చేయగలిగారు. అదే సమయంలో తాను ప్రతిపక్షం పాత్ర పోషించబోతున్నట్లు సంకేతాలిచ్చేశారు. ఆంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఛాంపియన్ గా ఎవరిని ప్రజలు భావిస్తారో వారే 2019 ఎన్నికలలో గెలుస్తారు. పవన్, జగన్ లు స్పీడు పెంచిన విషయాన్ని గ్రహించిన టీడీపీ రిస్కీ నిర్ణయమే అయినప్పటికీ బీజేపీకి దూరమవుతూ సొంత పథకాన్ని రచించుకోవడం ప్రారంభించింది. తానే చాంపియన్ గా నిలవాలనే వ్యూహంతో వివిధాంశాలపై ప్రజలను కేంద్రానికి వ్యతిరేకంగా సమీకరించే ప్రయత్నం ప్రారంభించింది. అదే సమయంలో జగన్, పవన్ లను బీజేపీ ‘పీకే’ టీములుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియా ప్రచారానికీ తెరతీసింది.

గతం నాస్తి...

ప్రజలు ప్రభుత్వానికి అప్పులిస్తే రాజధాని కడతామంటూ కొత్త నినాదం మొదలుపెట్టిందిటీడీపీ. బ్యాంకుల్లో లభిస్తున్నఏడుశాతం వడ్డీకంటే ఎక్కువ మొత్తమే ఇస్తామంటూ ఆఫర్లు కూడా ఇస్తోంది. నిజానికి డబ్బుల కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారా? అంటే అనుమానమే. గతంలోనే రాజధానికి ఇటుకలు, నీళ్లు అంటూ ప్రతిగ్రామం నుంచి తెప్పించడం , ‘ఈ’ ఇటుకలు అంటూ నిధుల సేకరణ వంటివి చేపట్టారు. కేవలం సెంటిమెంటుకి ప్రేరణగానే వ్యవహరించారు. ప్రచారం తప్ప ప్రయోజనం పెద్దగా సిద్ధించలేదు. వేల కోట్ల రూపాయలు వచ్చి పడిందిలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన నినాదానికి కూడా ప్రజల్లో పెద్దగా స్పందన రాదని పరిశీలకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు,కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలనుంచి కొంత మొత్తం సేకరించి దానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. ప్రజల్లో ఎమోషన్ ను పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్నికల నాటికి టీడీపీ తో సైకలాజికల్ సాన్నిహిత్యాన్ని పెంచేందుకు ఇటువంటి పబ్లిసిటీ ఉపయోగపడుతుందనేది అంచనా. ఆరోజున తాము ఎదుర్కొంటున్న సమస్యల ప్రాతిపదికే తప్ప ఇటువంటి సెంటిమెంట్లు గతంలో పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు.

అమరావతి ..అచ్చొచ్చేనా?

రాజధాని నిర్మాణం నిమిత్తం 34 వేల ఎకరాల భూసమీకరణ దేశంలోనే ఒక గొప్ప ప్రయోగం. అభినందించాల్సిందే. కానీ ప్రభుత్వానికి ఇక్కడి రైతాంగం అంతగా సహకరించడానికి విన్ విన్ సిచ్యువేషన్ ప్రధాన కారణం. అయిదారు లక్షల రూపాయల విలువ చేసే భూమి రాజధాని అని చెప్పగానే 20 నుంచి 30 రెట్లు పెరిగిపోయింది. ప్రభుత్వమే అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తుందనడంతో ఎక్కడెక్కడి నుంచో ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు రైతులకు కోట్ల రూపాయలు కుమ్మరించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ప్రజలనుంచి అదే తరహాలో నిధులు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఫలించే అవకాశాలు తక్కువ. మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుకుంటే 15 నుంచి 20 శాతం వరకూ లాభాలు వస్తాయి. ప్రభుత్వం విడుదల చేసే బాండ్లు కొనుగోలు వల్ల కలిసొచ్చేదేమీ ఉండదు. అందువల్ల ఆశించిన స్థాయిలో నిధులేమీ వెల్లువెత్తే అవకాశాలు లేవు. అమరావతి పైనే చంద్రబాబు దృష్టి కేంద్రీకరిస్తున్నారని ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఈ నిధుల సమీకరణ వాటికి ఆజ్యం పోసే ప్రమాదమూ పొంచి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News