‘చంద్ర’ జాలం ..‘చక్ర ’వ్యూహం

Update: 2017-11-05 15:30 GMT

ఎన్నికల ఎత్తుల్లో ఆరితేరిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి అనూహ్యమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇటు తెలంగాణలో 2014 తర్వాత తొలిసారిగా కాంగ్రెసు పార్టీ కొంత బలం పుంజుకుంటున్న వాతావరణాన్ని కల్పించగలిగింది. అటు ఆంధ్రప్రదేశ్ లో జనసంకల్పయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. నిర్ణీత గడువు ప్రకారం చూస్తే మరో 17 నెలల వరకూ ఎన్నికలకు సమయం ఉంది. కానీ అటు కేంద్రం, ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈవిషయంలో కొంత ముందుగానే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బలం పుంజుకోకుండా , ఒకేతాటిపైకి వచ్చేలా పోలరైజేషన్ జరగకుండా ఎన్నికలకు వెళితే మంచిదనే భావన టీడీపీ, టీఆర్ఎస్ లలో ఉంది. వామపక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీల మద్దతుతో టీఆర్ఎస్ ను ఢీ కొట్టాలని కాంగ్రెసు పార్టీ చూస్తోంది. పాదయాత్ర తో బలమైన ప్రజాసమీకరణ, మిగిలిపోయిన కాంగ్రెసు నేతల చేరికలతో టీడీపీని బెంబేలెత్తించాలని వై.సి.పి. తలపోస్తోంది. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు తాజా పరిణామాలు తమ ప్రధాన ప్రత్యర్థులకు లాభించకుండా ప్రతివ్యూహం పన్నుతున్నారు. ఇందుకు కేంద్రప్రభుత్వాన్ని కూడా రంగంలోకి లాగుతూ సైకలాజికల్ మైండ్ గేమ్ కు తెరతీస్తున్నారు.

పార్టీల్లో నేతలు ఫుల్లుగా అయి....

ఇప్పటికే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గస్థాయి నాయకులు ఎక్కువై కిక్కిరిసిపోయాయి. దాంతో రాజకీయావకాశాల కోసం అర్రులు చాస్తున్న నాయకులు కాంగ్రెసు, వై.సి.పిలను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే స్థితి ఏర్పడింది. మూడున్నర సంవత్సరాలుగా ఆకర్ష్ పథకాలతో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులను అధిరపక్షాల్లోకి చేర్చేసుకున్నారు. దీనివల్ల ప్రతిపక్షాలు బాగా బలహీనపడిపోయాయన్న భావన ఏర్పడింది. ఈ మేరకు పొలిటికల్ అడ్వాంటేజ్ టీడీపీ,టీఆర్ ఎస్ లకు లభించింది. ఇప్పుడు ఎన్నికల తరుణంలో ప్రధాన ప్రతిపక్షాల వైపు కీలకమైన నాయకులు క్యూ కడితే ఇంతవరకూ కాపాడుకుంటూ వచ్చిన ఆధిక్యభావం పోతుంది. ఇప్పుడు కేసీఆర్ , చంద్రబాబులను వేధిస్తున్న సమస్య అదే. దానికి పరిష్కారంగా శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోందన్న పాత పల్లవిని తాజాగా ఆలాపించడం ప్రారంభించారు. ఇప్పటికి కూడా టిక్కెట్లు ఆశించే నాయకులకు తొలి ప్రాధాన్యంగా అధికార పక్షాలే ఉన్నాయి. అయితే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి లేనందున ద్వితీయ ప్రాధాన్యంగా వై.సి.పి. , కాంగ్రెసులవైపు మొగ్గు చూపే పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. దీనిని తిప్పికొట్టడమే లక్ష్యంగా పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కేసీఆర్, ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు పెరగబోతున్నాయంటూ రాజకీయనేతల్లో ఆశలు మోసులెత్తించారు. ఎంతమంది వచ్చినా తీసుకుంటాం. నాయకుల ప్రాధాన్యాన్ని బట్టి టిక్కెట్లు కూడా ఇస్తామంటూ ఇతర పక్షాల వైపు ప్రజాదరణ కలిగిన నాయకులు పోకుండా పథక రచన చేస్తున్నారు.

హస్తవాసికి అడ్డుకట్ట....

తెలంగాణ కాంగ్రెసులో సీఎం క్యాండిడేట్లుగా భావించుకునే బాహుబలులు చాలామంది ఉన్నారు. తాజాగా మరికొందరు వచ్చి చేరుతున్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి 30 మంది వరకూ ముఖ్యనాయకులను కాంగ్రెసు వైపు మళ్లిస్తున్నట్లు టీఆర్ఎస్ వద్ద ఇంటిలెజెన్సు సమాచారం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా చేసినవారు, మాజీ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికి నియోజకవర్గాల్లో కొంత పలుకుబడి ఉంది. వ్యక్తిగతంగా నాలుగైదు వేల ఓట్లు తెచ్చుకోగల సామర్థ్యం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజాదరణ కల నాయకుల సంఖ్య అంతంతమాత్రమే. పూర్తిగా కేసీఆర్ ఇమేజ్ మీద ఆదారపడాల్సిందే. స్థానికంగా బలమైన నాయకులు ప్రత్యర్థులుగా పోటీకి దిగితే యాంటీ ఇంకంబెన్సీకి తోడు వారి ఇమేజ్ కూడా కలిసి అధికార పక్షానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని రాజకీయ అంచనా. దీంతో హస్త వాసికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఎమ్మెల్యే స్థానాలు మరో 20 రోజుల్లోనే పెరగవచ్చు. కేంద్రం నుంచి ఈమేరకు తనకు సమాచారం ఉందంటూ ఫీలర్ వదిలారు. ఇది కాంగ్రెసు ఆకర్ష్ ను అడ్డుకోవడానికి ఉద్దేశించిందే. రేవంత్ ఇంతవరకూ ప్రూవెన్ లీడర్ కాదు. అయినా ప్రచారం ద్వారా భారీ పరపతి సంపాదించుకున్నాడు. ఇది కాంగ్రెసుకు లాభించకుండా కొత్తనాయకులు అటువైపు క్యూ కట్టకుండా టీఆర్ఎస్ నాయకులు మంతనాలు మొదలు పెట్టారు. అవసరమైతే ప్రస్తుతమున్న కొందరు ఎమ్మెల్యేలను మార్చి మరీ టిక్కెట్లు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఈమేరకు అంగీకరించిన నాయకులతో కేటీఆర్, హారీష్, సంతోష్ వంటి అగ్రనేతల బృందంతో చర్చలకు కూడా సంకేతాలిస్తున్నారు. హస్తం బాటకు అడ్డుకట్టగా సీట్ల పెంపుదల ప్రకటన పని చేస్తుందని టీఆర్ఎస్ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది.

పంఖా రెక్కలకు పగ్గాలు....

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ దాదాపు భూస్థాపితం అయిపోయింది. కానీ అక్కడక్కడా ప్రజాదరణ ఉన్న నాయకులు మిగిలారు. వై.సి.పి.కి చెందిన మూడో వంతు ఎమ్మెల్యేలను టీడీపీ ఇప్పటికే తనలో కలిపేసుకుంది. ఇంకా అనేక చోట్ల ప్రధాన నాయకులు టీడీపీ రాజకీయ గాలానికి చిక్కారు. దీంతో వై.సి.పి 50 నుంచి 60 నియోజకవర్గాల్లో నాయకత్వ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పలుకుబడి కల కాంగ్రెసు నాయకులు, సామాజిక వర్గాల నేతలను పాదయాత్ర ద్వారా ఆకర్షించాలని జగన్ శిబిరం భావిస్తోంది. ఇదే జరిగితే జనసంకల్ప యాత్రకు ఉత్సాహంతోపాటు నాయకత్వ కొరత కూడా తీరుతుంది. ఎంతమాత్రం ఇందుకు తావివ్వకూడదని తెలుగుదేశం ప్రతివ్యూహం పన్నుతోంది. జగన్ పాదయాత్రలో ఉండగానే మరికొందరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీలో కలిపేసుకుని సంకల్ప యాత్రకు సవాల్ విసరాలని చూస్తోంది. కాంగ్రెసు నాయకులు ఫ్యాన్ పార్టీ వైపు వెళ్లకుండా టీడీపీలోకి తీసుకునేందుకు గాను అవసరమైన సంప్రతింపులు చేయాల్సిందిగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు. అయితే ప్రాచుర్యం కల నాయకులు ఎవరైనా టీడీపీలో రావాలంటే ఎమ్మెల్యే టిక్కెట్టు కు పూచీకత్తు ఉండాలి. ప్రస్తుతమున్న వాతావరణంలో అది సాధ్యం కాదు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతలు ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం టీడీపీలో పోటీ పడుతున్నారు.

సీటు ఇవ్వాలంటే...

కొత్తగా పార్టీలోకి చేరే పాపులర్ నాయకులకు సీటు గ్యారంటీ అన్న భావన కల్పించాలంటే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిందే. అందుకు గాను రాజ్ నాథ్ సింగ్ తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. చట్టపరమైన ఇబ్బందులేమీ లేవు. కేంద్రప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని హోం మంత్రి తేల్చి చెప్పారు. దీంతో రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా అమిత్ షా తో చంద్రబాబు మాట్టాడారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. పాదయాత్ర ముగిసేవరకూ ఈ వాతావరణాన్ని కొనసాగించగలిగితే వై.సి.పి ఆకర్ష్ పనిచేయదని టీడీపీ అంచనా. నియోజకవర్గాల పెంపు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని తిప్పడంలో ఇద్దరు సీఎంలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అదికార పక్షాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం, విపక్షాలకు చెక్ చెప్పడమే వీరి ప్రచారంలోని ఆంతర్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News