చందమామ కథలు...చంద్రబాబు రాజధాని

Update: 2017-09-17 02:30 GMT

‘శకకర్త వైన నీవు ఆధునిక భారత రాజకీయాల లక్ష్యాన్ని అన్వేషించేందుకు అలుపెరుగక సాగిస్తున్న బహుదూరపు ప్రయాణం బహు ముచ్చట గొలుపుతున్నది మహారాజా. అలసట తెలియక దూరాభారం ఎరుగక నీ గమ్యం చేరేందుకుగాను కాలక్షేపానికి ఒక కథ చెబుతాను విను’ అన్నాడు విక్రమాదిత్యుని భుజాలపై శవ రూపంలో పరుండిన భేతాళుడు. మాయారూపంలో మనం ప్రస్థానిస్తున్న ఈ ప్రాంతం ప్రాచీన చరిత్ర కల ధాన్యకటక కేంద్రం. అమరావతి రాజ్యం. రెండువేల ఏళ్ల నాటి గత వైభవాన్ని పునరుద్ధరించి ఈక్షేత్రానికి రాజధాని హోదా కల్పించాలని సంకల్పించారు ప్రజాస్వామ్య ప్రభువు. అనుకున్నదే తడవుగా పార్లమెంటు మొదలు పంచాయతీ మట్టి వరకూ దీని నిర్మాణ క్రతువులో భాగస్వామ్యం చేయపూనుకున్నారు. గ్రామగ్రామాన్ని కదిలించారు. పత్రం,పుష్పం,ఫలం ,తోయం అన్నట్లుగా ఇటుక,మట్టి,జలం ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడ్డాయి. హస్తిన నుంచి వేంచేసి, ప్రధాన సచివుడే పునాది రాయి వేశారు. ప్రపంచంలోనే ఒక అద్భుత నగరం ఆవిష్కృతం కాబోతోందంటూ సకల విధ ప్రచార సంరంభం నిర్వహించారు. గుత్తేదారులు గుంభనంగా తరలివచ్చే నిధుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రపంచప్రఖ్యాత భవన నిపుణులు మయసభలను తలపించేలా మనోజ్ణ ఆకృతులను సమర్పించారు. లయ విన్యాసాలతో కూడిన మహోన్నత సౌధాలకు చిత్రిక పట్టారు.

రాజధాని....భేతాళ ప్రశ్న.....

ఏదో వంకతో వాటన్నిటినీ తోసిపుచ్చుతున్నారు పాలక చంద్రులు. ఆధునిక కళాకృతితో ఉంటే ఆధ్యాత్మికత మేళవించాలంటున్నారు. పోనీ ఆధ్యాత్మికతకు కాన్వాసు పరిస్తే చారిత్రక కోణం ఎక్కడంటున్నారు. పోనీ రెంటినీ సమ్మేళితం చేస్తే సాంస్కృతిక వారసత్వం మాటేమిటంటున్నారు. దీంతో విశ్వవిఖ్యాత వాస్తు,భవన,కళా నిపుణులు సైతం విస్తుపోతున్నారు. ప్రజలకు తమ కలలు కల్లలవుతాయేమోనని బెంగ పట్టుకుంది. ప్రభువులకు నిద్ర పట్టడం లేదు. దీంతో బహువిధాలుగా యోచించి,శోషించి..బహుళ ప్రజాదరణతో అద్బుత విజయం సాధించిన జానపద చలనచిత్ర దృశ్య కావ్యానికి దర్శక బాధ్యత వహించిన ఛత్రపతికి ఈ డిజైన్ల రూపకల్పన మార్గనిర్దేశకత్వాన్ని అప్పగించారు పాలకప్రభువు. ఏదో చందమామ,బొమ్మరిల్లు, బాలజ్యోతి మాసపత్రికల్లోని రాజుల కథల దృశ్యాలు, హాలీవుడ్ చలనచిత్రాల సెట్టింగులు చూసి ప్రేరణ పొంది ఊహాజనిత నగరాన్ని నేను రూపొందించుకుంటే వాస్తవ నగరం అంటారేమిటి? ప్రభూ నా వల్ల కాదన్నాడా దర్శక ధీరుడు. రాజులు తలచుకోవాలే కానీ దెబ్బలకు కొదవా? ప్రభువే కోరుకున్నాకా కాదంటే కుదురుతుందా? నయానాభయానా చెప్పి చూశారు. చివరికి నీ జన్మభూమికి ఈ మాత్రం చేయలేవా? అంటూ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. దెబ్బకు దెయ్యం దిగి వచ్చింది. ప్రజలిచ్చిన అధికార కాలవ్యవధిలో మూడొంతులు గడచిపోయింది. అయినా ఆకృతుల విషయంలో అడుగు ముందుకు పడింది లేదు. ప్రభువుల పదవీకాలం ముగింపు దశకు చేరి కాలాతీతం అవుతున్నప్పటికీ పాలకులు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడం లేదు? ప్రపంచ స్థాయి నిపుణులను కాదని కాగితపు డిజైన్లతో ఊహలకు ఊపిరిపోసే దర్శకుని ఈ కార్యానికి నియోగించడంలో ఆంతర్యమేమిటి? అమరావతి నిర్మాణ విషయంలో ప్రభువుల మదిలోని లోగుట్టు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది‘ అన్నాడు భేతాళుడు.

తన వల్లే సాధ్యమవుతుందని.....

రాజనీతిలో తలపండిపోయిన విక్రమార్కుడు చిరునవ్వు చిందించి చెప్పనారంభించాడు. ‘ అక్కడ ... ఇక్కడ జరిగింది తెలుసుకుంటూ చిలువలుపలవలు చేర్చి మసాలా దట్టించి ప్రజల్లోకి చొప్పించే ప్రసారమాధ్యంలా వ్యవహరించే ,ఓయి భేతాళా.. నీకు తెలియని కొన్ని పరిపాలన సూత్రాలు చెబుతాను విను. నరమానవునికి సాధ్యం కాని అద్భుత విజయాలు, విషయాలు తాను సాధించి చూపుతాననే నమ్మకాన్ని పాలకుడు ప్రజల్లో రేకెత్తించాలి. ఆశల మోసులెత్తించాలి. నా విష్ణు: పృథ్వీ పతి: అంటారెందుకని? సాక్షాత్తు దేవునికి , రాజుకు తేడా లేదని చెప్పేందుకే. వేరే సాధారణ పాలకునికి ఎవ్వరికీ సాధ్యం కాని అమరావతి నిర్మాణం తమ ప్రభువు వల్ల మాత్రమే సాధ్యమౌతుందన్న విశ్వాసం పాలితులకు కల్పించాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచ విఖ్యాత నిపుణుల చిత్రికలను సైతం తోసిపుచ్చడం ద్వారా తానెంతగా తపన పడుతున్నదీ ప్రజల్లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు పాలక ప్రభువు. అదే సమయంలో జనాదరణలో , ప్రాచుర్యంలో రికార్డు సృష్టించిన ఒక స్వాప్నికుని భాగస్వామిని చేయడం ద్వారా ఆ ఊహా జగత్తు నిజం కాబోతోందన్న భావన ప్రబలంగా వ్యాపిస్తుంది. తద్వారా తన రంగంలో కార్యాచరణలో నిరూపించిన దర్శకుని ఖ్యాతి కూడా పాలకుని ఖాతాలో పడుతుంది. విశ్వసనీయత రెట్టింపు అవుతుంది.

యధాతధ పాలన కోసం.....

ప్రతి అయిదు సంవత్సరాలకు పాలితుల పరీక్షకు నిలవాల్సిన ప్రజాస్వామ్య యుగంలో నిరంతరం ప్రజలను కలల లోకంలో ఊరేగించడం పాలకులకు తప్పనిసరి విధి. ప్రభువుల లోగుట్టు ఏమిటన్న నీ చివరి ప్రశ్నకు సమాధానం ఆలకించు. ఆధునిక కాలంలో పదవీకాల కొనసాగింపు, అధికార పరిరక్షణ రాజనీతిలో అంతర్భాగం. స్వాప్నిక దర్శకుని సహకారంతో రూపుదిద్దుకున్న ఆకృతులకు ఆచరణరూపమివ్వాలంటే యథాతథ పాలన కొనసాగాలి. అందుకు మరోసారి ప్రస్తుత ప్రభువుకు అవకాశం ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు. ఈ విషయాన్ని పాలితులకు చాటిచెప్పడమే పాలకుని లోగుట్టు. సకాలంలో ,సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే రాజు సమర్థత బయటపడుతుంది. ముందుగానే అన్ని పనులు చేస్తే ప్రజల స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి అద్భుతమైన ఆకృతుల అందమైన ఊహలు ప్రజల కళ్లముందు కదలాడుతుండగానే ఎన్నికల పరీక్షకు నిలవాలి. ఏదో జరగబోతోందనే భావనతో ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాలి. ప్రభువుల మదిలోని ఆంతర్యమిదే.‘ విక్రమార్కుడు స్థూలంగా పాలన లోగుట్టును విశదీకరించాడు. అమరావతి ప్రభువు త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న రహస్యాల ముడి విడిపోవడంతో మరో కొత్త విషయాన్ని అన్వేషిస్తూ భేతాళుడు శవంతో సహా మాయమైపోయాడు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News