డ్రాగన్..నీ బుద్ధి మారదా?

Update: 2017-11-09 17:30 GMT

భారత్ ప్రయోజనాలకు భంగం కలిగించడం, అంతర్జాతీయంగా దానిని అడ్డుకోవడం... ఇదీ చైనా విధానం. ఇందుకు అనుగుణంగానే దాని మాటలు, చేతలు, చర్యలు ఉంటాయి. లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్ని కొండంతగా చూపి నానాయాగీ చేయడం బీజింగ్ విధానంలో అంతర్భాగం. తాజాగా మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అడ్డుపడటం, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం డ్రాగన్ దురహంకారానికి నిదర్శనం. ఇది చేయడం చైనాకు కొత్తేమీ కాదు. భవిష్యత్తులో ఇలా అనుచితంగా వ్యవహరించదన్న భరోసా కూడా ఏమీ లేదు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే ఈ మహ్మద్ (జేఈఎం) నాయకుడు, పఠాన్ కోట్ దాడి సూత్రధారి మసూద్ అజహర్ పై ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ అన్న ముద్ర పడకుండా చైనా అభయ హస్తాన్ని అందించింది. అజహర్ పై నిషేధం విధించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని పలుమార్లు ఆశ్రయించిన విషయం తెలిసిందే.

సాంకేతిక కారణాలను సాకుగా....

తాజాగా అక్టోబర్ నెలాఖరులో అల్ ఖైదా ఆంక్షల కమిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచింది. మండలిలోని ఐదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇందుకు తమ మద్దతును ప్రకటించాయి. ఇంతకు ముందు గత ఆగస్టులో సాంకేతిక కారణాలను సాకుగా చూపి మసూద్ పై నిషేధం ప్రతిపాదనను మూడు నెలల పాటు నిలిపివేయించింది. ఈ గడువు ముగియడంతో హడావిడిగా మండిలిని ఆశ్రయించింది చైనా. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదంటూ శాశ్వత సభ్యత్వ దేశంగా తన ‘వీటో’ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ ప్రతిపాదన వీగిపోతోంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని తన శాశ్వత సభ్యత్వ హోదాను అడ్డుపెట్టుకుని భారత్ వ్యతిరేకి అయిన మసూద్ అజహర్ ను కాపాడుతోంది. అజహర్ ను దుర్మార్గుడని తాము నమ్ముతున్నామని, అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా గుర్తించాలని కోరుకుంటున్నామని ఈ నెల 8న అమెరికా ప్రకటించడం గమనార్హం. ఆంక్షల జాబితాలో అజహర్ ను చేర్చాలా? లేక ఉగ్రవాద సంస్థను చేర్చాలా? అన్న విషయంపై చర్చలు సాగుతున్నాయని విదేశాంగ ప్రతినిధి హీతర్ నావెర్ట్ ప్రకటించడం గమనార్హం. ఉగ్రవాదంపై చైనా ద్వంద ప్రమాణాలకు ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదన్న భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి దవీశ్ కుమార్ వ్యాఖ్యలను ఎవరూ కాదనలేరు.

నిర్మల పర్యటనపై కూడా.....

తాజాగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ఈ నెల 6న అభ్యంతరం వ్యక్తం చేసి తన తెంపరితనాన్ని ప్రదర్శించింది. రక్షణ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నిర్మల శాఖాపరమైన అవగాహన కోసం సరిహద్దులను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జమ్మూకాశ్మీర్, సిక్కిం సరిహద్దులను కూడా సందర్శించారు. ఆఖరికి ‘డోక్లాం’ ప్రాంతాన్ని కూడా స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ కు కూడా వెళ్లారు. ఆ రాష్ట్రంలోని అన్జీ జిల్లాలో గల సైనిక స్థావరాలను సందర్శించారు. అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సైనికుల సంక్షేమం, సరిహద్దు చొరబాట్లు, నిఘాను పటిష్టం చేయడం తదితర అంశాలపై సవివరంగా సైనిక అధికారులతో చర్చించారు. బలగాల రక్షణ సన్నద్ధతను సమీక్షించారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రి బాధ్యతలను చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. మహిళ అయినప్పటికీ కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం అభినందనీయం. అలాంటి పర్యటనలపై బీజింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం దాని అసహనాన్ని సూచిస్తోంది.

ప్రధాని, రాష్ట్రపతి పర్యటనలపై కూడా....

మంత్రి పర్యటనతో అప్పటికప్పుడు పరిస్థితులు ఏమీ మారిపోవు. అద్భుతాలు జరగవు. అరుణాచల్ ప్రదేశ్ వివాదాస్పద ప్రాంతమని, ఆమె పర్యటన శాంతికి దోహదపడేదిగా లేదన్న చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువీ చున్యాంగ్ ఏమాత్రం వాస్తవం లేదన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. వివాద పరిష్కారానికి భారత్ తమతో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నట్లు చెప్పడంలో వ్యంగ్యం తప్ప వాస్తవం లేదు. దశాబ్దాల క్రితం భారత్ లో అధికారికంగా అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ను వివాదాస్పద ప్రాంతం అనడం హాస్యాస్పదం. చైనాలో టిబెట్ విలీనాన్ని భారత్ అధికారికంగా గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దానిపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఈ మాత్రం సంయమనాన్ని చైనా పాటించలేకపోతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పదే పదే ప్రకటించడం దాని అపరిపక్వతకు నిదర్శనం. ఒక రక్షణ మంత్రి పర్యటనే కాదు, భారత రాష్ట్రపతి, ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న చైనా అనుచిత వైఖరికి ధీటుగా ప్రతిస్పందించడం భారత్ బాధ్యత. పొడిపొడి మాటలు, మొక్కుబడి ఖండనలతో సరిపెట్టకుండా ధాటిగా జవాబివ్వాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News