గుజ‌రాత్‌లో మోడీ ఆశలు గల్లంతవుతాయా?

Update: 2017-12-08 17:30 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌పై పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంతు కానున్నాయా? ఈ నెల‌లో ఈ రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడం ఖాయ‌మేనా? మోడీ త‌న సొంత రాష్ట్రంలోనే ఓటమిని చవి చూడనున్నారా? జాతీయ రాజకీయాల తీరుతెన్నుల కథనం హఠాత్తుగా మారిపోనుందా? అంటే ఇప్పుడు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. గాంధీ పుట్టిన‌ గుజరాత్‌లో బీజేపీ అధికార పార్టీ మాత్రమే కాదు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు పాతుకుపోయినట్టు ఈ పార్టీ కూడా గుజ‌రాత్‌లో బాగా పాతుకుపోయిన పార్టీ. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ సాధించిన భారీ విజయం (26 లోక్‌సభ స్థానాలకు 20) తర్వాత బీజేపీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓడింది లేదు.

ప్రతి ఎన్నికల్లోనూ ఆధిక్యత....

అప్పటి నుంచి జరిగిన 5 శాసనసభ ఎన్నికల్లోనూ అది 10 శాతం పాయింట్ల పటిష్టమైన ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చింది. బీజేపీ ఆధిపత్యం ఎన్నికలకే పరిమితం కాలేదు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల నుంచి సహకార సంస్థలు, మీడియా, మేధావులు సహా మొత్తంగా గుజరాత్‌ సమాజంపైనే అది తన ఆధిపత్యాన్ని నెలకొల్పగలిగింది. దాని ప్రత్యర్థి కాంగ్రెస్‌ అత్యంత సత్తువలేని ప్రతిపక్షం జాబితాలోకి వెళ్లిపోయింది. సో.. దీనికంత‌టికీ కార‌ణం.. ఒకే ఒక్క‌డుగా కీర్తించ‌బ‌డుతున్న న‌రేంద్ర మోడీ! సీఎస్‌డీఎస్‌ (సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌) బృందం గత ఆగస్టులో నిర్వహించిన తొలి రౌండు సర్వే బీజేపీ భారీ ఆధిక్యతలో ఉన్నదని తెలిపింది.

అంత బాగా లేదా?

ఆ ఆధిక్యత ఇక అధిగమించరానిదని అనిపించింది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ప్రభ వెలిగిపోతున్నప్పటిలా, గుజరాత్‌లో బీజేపీ గెలుపు చెప్పుకోదగిన వార్తేమీ కాదు. అదే దృష్టితో చూస్తే, అది ఓడిపోవడం అంటే భూకంపం సంభవించడమే. కానీ, గుజ‌రాత్‌కు భూకంపం త‌ప్ప‌నే వార్త‌లే వినిపిస్తున్నాయి. గుజరాత్‌ పరిస్థితిని చూస్తే మోడీ టీం చెబుతున్న‌ట్టు అంతా బాగా ఉన్నట్టేమీ లేదు. ‘గుజరాత్‌ నమూనా’ ఓ భారీ ప్రచార ఆర్భాటమేన‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా రాష్ట్రంలోని విద్య, ఆరోగ్యం వంటి సామాజిక సూచికల్లో గుజరాత్‌ ఇంకా మధ్యస్త స్థాయి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రంగానే ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి రైతులకు ఈ నమూనా వల్ల ఒరిగిందేమీ లేదు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అది, అత్యంత బలమైన రైతు నిరసనలు వెల్లువెత్తిన రాష్ట్రం గుజ‌రాతే కావ‌డం గ‌మ‌నార్హం.

ఏం జరిగినా ఆశ్చర్యం లేదు....

నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాక గుజరాత్‌లోని పరిస్థితులు మరింత అధ్వానంగా దిగజారాయి. గ్రామీణ సంక్షోభం తీవ్రమైంది. వరుసగా వచ్చిన రెండు కరువు కాలాల్లో ప్రభుత్వం రైతులకు సరిపడేంత సహాయాన్ని అందించడంలో లేదా వాటిని పూర్తిగా గుర్తించడంలో విఫలమైంది. గత ఏడాదిగా, గుజరాత్‌ అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యంగా ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్లు, గోవ‌ధ‌, గోసంర‌క్ష‌ణ పేరుతో జ‌రిగిన దాడులు. ఇలా చెప్పుకొంటూ పోతే.. అనేక లోపాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వీట‌న్నింటికీ జ‌వాబివ్వాల్సిన బీజేపీ.. ఎంత‌సేపూ కాంగ్రెస్‌ను విమ‌ర్శించుకుంటూనే పోతోంది. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. సో.. గుజ‌రాత్‌లో ఎంత డ‌బ్బా కొట్టుకున్నా మోడీకి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఎన్నిక‌ల టైంకు వ‌చ్చే స‌రికి గుజ‌రాత్ ఓట‌రు నాడి కాస్త మారిన‌ట్టు వ‌స్తోన్న వార్త‌లు మాత్రం నిజం. మ‌రి ఫ‌లితాల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News