గుజ‌రాత్‌లో జెండా ఎగ‌రాలంటే ఆ మూడే ముఖ్యం..!

Update: 2017-12-01 17:30 GMT

దేశ ప్ర‌జ‌లంద‌రి చూపూ ఇప్పుడు గుజ‌రాత్ వైపే ఉంది. ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో పాటు.. ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తుండ‌టంతో అంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఫ‌లి తాలు ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ ప్ర‌భావం.. దేశ రాజ‌కీయాల‌పై ప‌డుతుంద‌ని విశ్లేష‌కుల‌తో పాటు ప్ర‌జ‌లం ద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే పట్టు నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ఈసారి బీజేపీ కోట‌ను బ‌ద్దలు కొట్టాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దృఢ నిశ్చ‌యంతో ఉన్నారు. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ నాయ‌కులు కూడా కాంగ్రెస్‌కు జ‌త‌క‌ట్ట‌డం బీజేపీకి మింగుడుపడ‌ని అంశం. అయితే గుజ‌రాత్‌లో జెండా ఎగ‌రేయ‌డానికి మూడు అంశాలు మాత్రం అత్యంత కీల‌మ‌ని చెబుతున్నారు.

ఈసారి గట్టపోటీనే....

రెండు దశాబ్దాలుగా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తున్న బీజేపీ ఈసారి మాత్రం గట్టిపోటీ ఎదుర్కొంటోంది. బీజేపీ ఓటమి లక్ష్యంగా ముగ్గురు బలమైన సామాజిక నేపథ్యం ఉన్న నాయకులు ప్రచారం సాగిస్తుండటం కాంగ్రెస్‌కు బాగా క‌లిసివ‌స్తోంది. దీనికి తోడు కుల సమీకరణాలు ఈసారి బ‌లంగా ప్ర‌భావితం చేయ‌బోతున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఒక‌టి ఉపాధి. రెండోది ఆర్థిక వ్య‌వ‌స్థ‌! మోడీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తర్వాత‌.. భారీగా నిరుద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని అంతా భావించారు. వీరి ఆశ‌లు నిరాశ‌గానే మిగిలిపోయింది.

ఈ అంశాలు కూడా....

ఇక జీఎస్టీ, నోట్ల‌ర‌ద్దు అంశాలు ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌బోతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్నం అయిన విష‌యం తెలిసిందే! ఈ ప్ర‌భావం ప‌రిశ్ర‌మ‌లు అధికంగా ఉన్న‌ గుజ‌రాత్‌పైనే ఎక్కువ‌గా ప‌డింది. వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఈ నేప‌థ్యంలో ఈరెండు అంశాల‌ను కాంగ్రెస్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతోంది. వీటితో పాటు మ‌రో కీల‌క‌మైన అంశం కుల స‌మీక‌ర‌ణాలు!! బలమైన సామాజిక వర్గాల నుంచి మద్దతు కూడగట్టడంలో బీజేపీ, కాంగ్రెస్ చాలా రోజుల నుంచే పోటీ పడుతున్నాయి. వీరిలో పాటిదార్లు కీలకం. వీరు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నప్పటికీ, పాటిదార్లలోని నవతరం మొత్తం సామాజికవర్గాన్ని ముందుండి నడిపిస్తుండ‌టం సమీక‌ర‌ణాల‌ను మారుస్తోంది!

వీరే నిర్ణయాత్మకమా...?

ఆరుకోట్ల మంది జనాభా ఉన్న గుజరాత్ లో పాటిదార్లు 12శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రవచిత 'ఖామ్' ఫార్ములా ప్రకారం క్షత్రియులు 11 శాతం, హరిజనులు 7, ఆదివాసీలు 14, ముస్లింలు 9 శాతం జనాభా ఉన్నారు. ఈ నెలలో జరిగే ఎన్నికల్లో ఓబీసీలు 32 శాతం, క్షత్రియ, దళిత, ఆదివాసీలు కలిపి 21, అగ్రకులాల్లలో 21, పాటిదార్లు 18 శాతం మంది ఓటేయనున్నారు. మొత్తం 182 శాసనసభ స్థానాల్లో 60 చోట్ల గెలుపోటములను పాటిదార్లు ప్రభావితం చేయగలరు. మరో 68 సెగ్మెంట్లలో ఠాకూర్లు, కోలీలు నిర్ణయాత్మకం కానున్నారు. గుజరాత్ ఎన్నికల్లో గెలవాలనుకునే పార్టీ ఈ కులాలను విస్మరించలేదు. 1980లో కాంగ్రెస్ ప్రయోగించిన క్షత్రియ - హరిజన (దళిత) - ఆదివాసీ - ముస్లిం (కేహెచ్‌ఏఎం) సమీకరణ ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది.

ఖాప్ ఫార్ములాతోనే...

182 అసెంబ్లీ స్థానాలకు 141 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. 1985లో ఏకంగా 149 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మాధవసింగ్ సోలంకి రెండు పర్యాయాలు సీఎం అయ్యారు. అదొక రికార్డు. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 140కి మించి స్థానాలను పొందలేదు. ఖామ్ ఫార్ములాను పునరుద్ధరించి దానికి పాటిదార్లను జతచేసిన నూతన సామాజిక కూటమిని ఖాప్ (కేహెచ్‌ఏపీ)గా చెబుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. గుజరాత్‌లో గత‌ ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల వాటా గణనీయంగా పెరుగలేదు. 1995లో 42.5శాతంగా 2012నాటికి అది 47.9శాతానికి పెంచుకోగ లిగింది. ఇక 2012 ఎన్నికల్లో అధికార బీజేపీ 116 సీట్లు మాత్ర‌మే పొందిన విష‌యం తెలిసిందే!

 

-గుజరాత్ నుంచి ‘తెలుగుపోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News