గుజారాత్ లో మోడీకి పట్టుంది ఇక్కడేనా?

Update: 2017-11-28 16:30 GMT

ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీకి బనియా బ్రాహ్మిన్ పార్టీ అన్న పేరుండేది. 1980లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి నిన్న మొన్నటి దాకా ఈ పేరు బలంగా ఉండేది. బనియాలు అంటే వైశ్యులు. బ్రాహ్మిన్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వర్గాలప్రజలు అత్యధికంగా పట్టణాల్లో ఉండేవారు. దీంతో పార్టీకి పట్టణ ప్రజల పార్టీ అని, మధ్యతరగతి ప్రజల మద్దతున్న పార్టీ అన్న పేరుండేది. ఇందుకు తగ్గట్లుగానే పట్టణ, నగర ప్రాంతాల్లోనే పార్టీ మంచి ఫలితాలు సాధించేది. క్రమంగా ఆముద్ర చెరిగిపోయింది. 1989,1998,1999, 2004, 2009 ఎన్నికల్లో పరిస్థితి మారుతూ వచ్చింది. 2014లో పార్టీ పట్టణ, పల్లెలు అన్న తేడా లేకుండా ఆసేతు హిమాచలం విజయపతాకం ఎగురవేసింది.

పట్టణ ప్రాంతాల్లో కమలానిదే...

అయినప్పటికీ ఇప్పటికీ పార్టీ మూలాలు పట్టణాలు, నగరాల్లోనే బలంగా ఉన్నాయి. పార్టీకి కంచుకోటగా పరిగణించే గుజరాత్ లో గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగుతుండటం విశేషం. 1990 నుంచి 2012 వరకూ వరుసగా జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ దన్నుతోనే ఈసారి కూడా గుజరాత్ లో గెలుస్తామని కమలనాధులు ఢంకా బజాయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది నగరపాలకసంస్థలు ఉన్నాయి వీటి పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలుత 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎనిమిది ప్రాంతాల్లో 28నియోజకవర్గాలుండేవి. వీటిల్లో బీజేపీ సింహభాగం సీట్లు 17 దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం నాలుగు స్తానాలతో సరిపెట్టుకోగా జనతాదళ్ మిగిలిన ఏడు స్థానాలను దక్కించుకుంది. నాటి ఎన్నికల్లో బీజేపీ మొత్తం 182 స్థానాలకు గాను 143 చోట్ల మాత్రమే పోటీ చేయడం విశేషం. 1995 నాటికి పట్టణ ప్రాంతాల్లో పార్టీ మరింత బలపడింది. నాటి ఎన్నికల్లో మొత్తం 28కి గాను 24 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ నేతలు మూడు స్థానాలతో సంతృప్తి పడగా, మిగిలిన ఒక్క స్థానాన్ని స్వతంత్రులు గెలుచుకున్నారు. 1998 ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలకు గాను 25 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ కు కేవలం రెండు మాత్రమే దక్కాయి. మిగిలిన ఒక్క స్థానాన్ని ఇండిపెండెంట్లుగెలుచుకున్నారు. 2002 ఎన్నికల్లో 22సీట్లకే బీజేపీ పరిమితమైంది. కాంగ్రెస్ ఐదు చోట్ల విజయం సాధించింది. మరో స్థానాన్ని స్వతంత్రులు దక్కించుకున్నారు. 2007లో కూడా బీజేపీ 22సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో కాంగ్రెస్ తన బలాన్ని ఆరుకు పెంచుకోవడం విశేషం. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఉత్సాహం పెరిగింది.

నియోజకవర్గాల పెంపు....

నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, పట్టణ ప్రాంతాల విస్తరణ, నగరాల సరిహద్దులు విస్తరించడం తదితర కారణాల వల్ల నగర, పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల సంఖ్య 35కు పెరిగాయి. రాజధాని అహ్మదాబాద్ నగరం సహా ఎనిమిది నగరపాలకసంస్థలు ఆవిర్భవించాయి. అహ్మదాబాద్, రాజ్ కోట్, భావ్ నగర్, వడోదర, సూరత్, జామ్ నగర్, జానాఘడ్, గాంధీనగర్ లు నగరపాలక సంస్థలుగా ఆవిర్భవించాయి. వీటి పరిధిలో మొత్తం 39 నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 35 చోట్ల జెండా ఎగురవేసింది. హస్తం పార్టీ సీట్లు ఆరు నుంచి తగ్గడం గమనార్హం. అహ్మదాబాద్ నగరంలో రెండు చోట్ల, జామ్ నగర్, రాజ్ కోట్ లలో ఒక్కొక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

పట్టణాలపై ప్రత్యేక దృష్టి....

వచ్చే నెలలో రెండు దఫాలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పట్టణ, నగర ప్రాంతాల్లో పట్టు కొనసాగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది నగర పాలకసంస్థల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. 2015లో జరిగిన నగరపాలకసంస్థ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది నగరాల్లో పైచేయి సాధించింది. నాటి ఎన్నికల్లో తాలూకా, పంచాయతీ, జిల్లా పంచాయతీల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కాని పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం దానికి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క నగరపాలకసంస్థనూ గెలుచుకోలేక పోయింది. పటిష్టమైన యంత్రాంగం, నిబద్ధత గల నాయకులు, కార్యకర్తల కారణంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతిసారీ బీజేపీదే పైచేయి అవుతుంది. ఈసారీ పాత ఫలితాలనే పునరావృతం చేస్తామని పార్టీ ధీమాగా చెబుతోంది. ఈ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ణణ ప్రాంతాల్లో న్యాయవాదులు, వైద్యులతో సమావేశాలు నిర్వహించి ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నారు. రాహుల్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియాలంటే వచ్చేనెల వరకూ ఆగాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News