గుజరాత్ లో ఈ ముగ్గురూ ఒక్కటైతే...?

Update: 2017-10-25 16:30 GMT

కాంగ్రెసుకు, కమలానికి మధ్య యుద్ధమా? సామాజిక అసంతృప్తికి, రాజకీయ ఆధిపత్యానికి మధ్య సమరమా? గుజరాత్ లో ఇదో విచిత్రమైన పరిస్థితి. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా పటిష్ఠమైన ప్రచార వ్యూహాలతో , ప్రజలలో భాగంగా కలిసిపోతూ గుజరాత్ లో హస్తం పార్టీ కొత్త సందడిని నెలకొల్పుతోంది. 1985 ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ ఖామ్ (కెహెచ్ ఏ ఎం) కాంబినేషన్ తో గుజరాత్ లో ఘనవిజయం సాధించింది. ఇందులోని ఒక్కో అక్షరానికి ఒక సామాజిక వర్గం(క్షత్రియ,హరిజన,ఆదివాసీ,ముస్లిం) ప్రతీకగా ఆనాడు సోషల్ ఇంజినియరింగ్ చేయగలిగింది. అప్పట్లో మాధవ్ సింగ్ సోలంకి పీసీసీకి నేతృత్వం వహించారు. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత అతని కుమారుడు భరత్ సింగ్ సోలంకి ఇప్పుడు గుజరాత్ పీసీసీకి సారథ్యం వహించడం యాదృచ్చికమే. కానీ అదే తరహా కలయికను పునరావృతం చేయడం ద్వారా సంఘంలోని వివిధ వర్గాల సమీకరణతో కొత్త రాజకీయ పునరేకీకరణ చేసి కాంగ్రెసు విజయం సాధించాలని చూస్తోంది. 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై నెలకొన్న వ్యతిరేకత, ఈమధ్యకాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉద్యమాలు హస్తవాసికి అనుకూల పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ పవనాలను ఎంతగా తనవైపు మళ్లించుకోగలదన్న అంశంపైనే గుజరాత్ లో కాంగ్రెసు భవితవ్యం ఆదారపడి ఉంది.

ముగ్గురితో ముచ్చెమటలు...

కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు కాంగ్రెసు పార్టీకి ముగ్గురు నాయకులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. విభిన్న సామాజిక సమీకరణతో కూడిన వీరి నేపథ్యం కమలంలో కంగారు రేకెత్తిస్తోంది. అదికార పక్షానికి హడలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో 14 శాతం జనాభా ఉన్న పటేదార్లు బలమైన సామాజిక వర్గం. శాసనసభలోని 117 మంది బీజేపీ సభ్యుల్లో 37 మంది ఈ వర్గానికి చెందినవారే. రెండేళ్ల క్రితం వరకూ ఈ సామాజిక వర్గంలో మూడింట రెండు వంతుల మంది బీజేపీకే మద్దతుగా నిలిచేవారు.తమ వర్గానికి ఓబీసీ రిజర్వేషన్లు కావాలంటూ హార్దిక్ పటేల్ పటేదార్ అనామత్ ఆందోళన సమితి పేరిట 2015లో ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో బీజేపీ పొలిటికల్ ఫార్చూన్ తిరగబడటం మొదలైంది. మరోవైపు బీజేపీ విధానాలతో విభేదిస్తూ ఓబీసీలు నిరసన గళం వినిపించడం మొదలుపెట్టారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన నాయకుడు అల్పేష్ ఠాకూర్ ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ ఏక్తా మంచ్ పేరిట ఒక బలమైన ఉద్యమానికి నాంది పలికారు. ఠాకూర్లలో గట్టిపట్టున్న అల్పేష్ ప్రభావం కూడా బలంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెసు తీర్థం తీసుకున్నారాయన. ఉత్తర, మధ్య గుజరాత్ లలోని 40 నియోజకవర్గాల్లో ఠాకూర్ల ప్రాబల్యం విస్తారంగా కొనసాగుతోంది. గోరక్ష ఇతర పేర్లతో దళితులపై దాడుల నేపథ్యంలో జిగ్నేష్ మేవాని ప్రతిఘటనోద్యమ నేతగా ఆవిర్భవించాడు. ఠాకూర్, దళిత, పటేల్ సామాజిక వర్గాల వాటా గుజరాత్ జనాభాలో 38 శాతం వరకూ ఉంది. బీజేపీలో గుబులు రేపుతున్న అంశమిదే. ఈ ముగ్గురు నేతలు తమ సామాజిక వర్గాలను ఎంతమేరకు ప్రభావితం చేస్తారన్న అంశం పక్కన పెడితే వీరు లేవనెత్తుతున్న డిమాండ్లు మాత్రం అధికార పక్షంలో ప్రకంపనలు రేపుతున్నాయి.

అందిపుచ్చుకుంటున్న హస్తం ..

బలమైన యువప్రతినిధులుగా ఆవిర్భవించిన హార్దిక్,అల్పేష్,జిగ్నేష్ లను తనతో చేతులు కలపమని కాంగ్రెసు ఆహ్వనించింది. అల్పేష్ సంతోషంగా అంగీకరించాడు. కామన్ గోల్ ఒకటే అయినప్పటికీ హార్దిక్ , జిగ్నేష్ లకు కాంగ్రెసుతో కొన్ని భావ వైరుద్ధ్యాలున్నాయి. అందువల్ల నేరుగా పార్టీలో చేరలేదు. బీజేపీ ముక్త గుజరాత్ నా లక్ష్యం అందుకు కాంగ్రెసుకు సహకరిస్తాను అంటూ హార్దిక్ ప్రకటించాడు. కాంగ్రెసు నేతలతో సంప్రతింపులు , చర్చలు జరుపుతూ ప్రచార వ్యూహాలకు సైతం తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు. బీజేపీని అధికారంలోంచి దింపడానికి ఎదురుగా కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెసు పార్టీ . అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చాడు జిగ్నేష్. మొత్తమ్మీద ఈ ముగ్గురు కూడా కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

కమలం కంగారు.....

అగ్రనేతల స్వరాష్ట్రం కావడంతో ప్రస్తుత పరిస్థితులపై బీజేపీలో చాలా ఆందోళన వ్యక్తమవుతోంది. 1990 నుంచి తమకు గట్టి మద్దతు దార్లుగా ఉన్న పటేదార్లలో చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హార్దిక్ పటేల్ శిబిరాన్ని ఛిన్నాభిన్నం చేయడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎర వేస్తున్నారు. ఇదంతా పార్టీ పరంగా సాగుతోంది. మరోవైపు పటేదార్ల ఉద్యమం సందర్బంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నారు. అన్ రిజర్వ్ డ్ క్లాసు వెల్ఫేర్ కమిషన్ ను ఏర్పాటు చేసి పటేదార్ల డిమాండ్ల పరిశీలన బాధ్యత అప్పగించారు. ఇవన్నీ కూడా ఆవర్గాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న అధికారిక ప్రయత్నాలు. మరోవైపు హార్దిక్ శిబిరంలో చిచ్చుపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కోటి రూపాయలతో బీజేపీ తనను కొనేందుకు అడ్వాన్సుగా పదిలక్షల రూపాయలు ఇచ్చిందంటూ హార్దిక్ పటేల్ అనుచరుడు నరేంద్రపటేల్ చేసిన ఆరోపణ బీజేపీ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కొన్ని వారాల క్రితం బీజేపీలో చేరిన మరో హార్దిక్ అనుచరుడు నిఖిల్ సవానీ మళ్లీ తన పాత గూటికి చేరిపోయాడు. ఇవన్నీ బీజేపీ వ్యూహాలు వికటిస్తున్న తీరును కళ్లకు కడుతున్నాయి. జైభీమ్, జై మాతాజీ, జై సర్దార్ అంటూ మూడు ప్రధాన సామాజిక వర్గాల ప్రతీకాత్మక నినాదాలతో కాంగ్రెసు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News