గవర్నరే సర్వాధికారి... ఇక సీఎంలు ఎందుకు?

Update: 2017-11-07 17:30 GMT

గవర్నర్ రాష్ట్ర ప్రధమ పౌరుడు. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించాలి. రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రతినిధిగా వ్యవహరించాలని రాజ్యాంగం చెబుతోంది. ఇక్కడ ప్రతినిధి అంటే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షకుడు అని అర్థం. రాష్ట్రంలో ప్రతినిధి అంటే కేంద్ర ప్రయోజనాల పరిరక్షకుడు అని రాజ్యాంగం భాష్యం చెబుతోంది. గవర్నర్లు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడటమన్నది పాతమాట. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు, పరిరక్షకుడిగా, కేంద్రం ఏజెంటుగా పనిచేస్తున్నారు ప్రస్తుత గవర్నర్లు. ఈ క్రమంలో సీఎంలతో విభేదాలు, ఘర్షణలు అనివార్యం. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలోని దాని ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఉప్పూ...నిప్పే. బిల్లులు తొక్కిపెట్టడాలు, ప్రభుత్వంపై పరోక్ష విసుర్లు సర్వసాధారణం. ఇదంతా ఇప్పుడు చరిత్రగా మిగిలిపోనుంది.

ఢిల్లీలో గవర్నర్ దే పైచేయి....

తాజాగా దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దిగజారింది. గవర్నర్ కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తున్నారని ఢిలీలోని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. పరిధికి మించి వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయాలను తొక్కి పెడుతున్నారని ధ్వజమెత్తుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరి అధికారాలు ఏమిటో తేల్చాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యాలోని ఢిల్లీ సర్కార్ ఏకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్ దే కీలకమని, ఆయనే సర్వం సహాధికారి అంటూ ఢిల్లీ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో తీర్పు ఇచ్చింది. గవర్నర్ కు విస్తృత అధికారాలు ఉన్నాయన్న హైకోర్టు తీర్పును ఆప్ ప్రభుత్వం సుప్రీంకో్ర్టులో సవాల్ చేసింది. దీనిపై ఐదుగురి సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎకే సిక్రీ, జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రబోస్, జస్టిస్ అశోక్ భూషణ్ ఇతర సభ్యులు. నజీబ్ జంగ్ తర్వాత ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గావవచ్చిన అనిల్ బైజాల్ గత కొంతకాలంగా ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ, అక్కడ ముఖ్యమంత్రులతో ప్రత్యక్షంగా తలపడుతున్నారు. ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రిపై పెత్తనం చెలాయించాలని నామినేటెడ్ గవర్నర్లు ప్రయత్నించడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీయడమే.

అనేక ఫైళ్లను తొక్కిపెడుతూ....

ఢిల్లీలో ఎన్నికలైన అసెంబ్లీ ఉంది. దాని ద్వారా ఏర్పటిన ప్రభుత్వం ఉంది. దేశరాజధాని కావడంతో 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ అక్కడ ప్రజా ప్రభుత్వం, అసెంబ్లీ ఏర్పడే విధంగా 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీనిద్వారా 259 ఎఎ అధికారణం రాజ్యాంగంలో చేరింది. ఇందులోని నాలుగో నిబంధన లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రి మండలికి తోడ్పాటునందించాలని సూచిస్తోంది. ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే రాష్ట్రపతికి నివేదించాలని నిర్దేశిస్తోంది. రాష్ట్రపతి వద్ద కూడా పెండింగ్ లో ఉంటే లెఫ్ట్ నెంట్ గవర్నర్ తన విచక్షణతో వ్యవహరించి నిర్ణయం తీసుకోవచ్చని రాజ్యాంగం చెబుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ దే పైచేయి అన్న సంగతి దాన్ని బట్టి అర్థమవుతోంది. ఇతర గవర్నర్ల కన్నా లెఫ్టినెంట్ గవర్నర్లకే ఎక్కువ అధికారాలున్నట్లు ఈ విషయం చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వ్యవహారశైలి కూడా అనుమానాలకు ఆస్కారమిచ్చే విధంగానే ఉంది. పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం నుంచి, కాలనీల్లో ఆసుపత్రుల ఏర్పాటు తదితర కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయాలను గవర్నర్ బైజల్ తొక్కి పెట్టారు.

సుప్రీంకు కేజ్రీవాల్.....

ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆప్ ప్రభుత్వం న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలను తప్పుపట్టారు. గవర్నర్ చాలా కార్యనిర్వాహక నిర్ణయాలను తీసుకుంటున్నారని రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం రోజువారీ చేయాల్సిన పనులను కూడా 299 ఎఎ అధికరణంలోని నాలుగో నిబంధనను సాకుగా చూపుతూ గవర్నర్ చేస్తున్నారని స్పష్టం చేశారు. గవర్నర్ పరిధికి మించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కీలకం. అంతే తప్ప నామినేటెడ్ గవర్నర్ ది ఎంతమాత్రం కాదు. గవర్నర్ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేరు. ఎన్నికైన అసెంబ్లీ, ప్రజాప్రతినిధులను నిమిత్తమాత్రులను చేసినప్పుడు అసలు ఎన్నికలకు విలువేలేదు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రం సమానం. ఒకరు ఎక్కువ... మరొకరు తక్కువా కానే కాదు. మొత్తం మీద ఢిల్లీ లో లెఫ్టినెంట్ గవర్నర్ కే ఎక్కువ అధికారాలున్నట్లు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దస్త్రాలను తొక్కిపెట్టడం, తాత్సారం చేయడం తగదని కూడా స్పష్టంగా పేర్కొంది. తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుని వాటికి తగిన కారణాలు కూడా చెప్పాలని తెలుపుతూ విచారణను వాయిదా వేసింది. మొత్తంమీద గవర్నర్ కు కొన్ని పరిమితులను నిర్దేశించడం ఆహ్వానించదగ్గ అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News