గడి గడి.. గండం...!

Update: 2017-12-25 15:30 GMT

నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే. ఇద్దరూ కలిసే నడుస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారివి. మేము 2019లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటారు అమిత్ షా. బీజేపీపై విమర్శలు చేయకుండా సంయమనం పాటించండి అంటారు చంద్రబాబు. వీరు సర్వం సహా అధినేతల కిందే లెక్క. అయినా దిగువస్థాయిలో మాత్రం తీవ్రస్థాయి విమర్శలు వెలువడుతుంటాయి. ఎమ్మెల్సీలు తిట్టుకుంటూ ఉంటారు. మంత్రులు మాటకు మాట తిప్పికొడుతుంటారు. ఇదో కొత్త రకం మైత్రీ బంధం. టీడీపీ, బీజేపీల మధ్య కొనసాగుతున్న రాజకీయ సయ్యాట. ప్రియమైన శత్రువుల పితలాటకం ఆంధ్రప్రదేశ్ తెరపై అన్ని హంగులను ఆవిష్కరిస్తోంది. ప్రధానంగా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవిలో కుదురుకుపోయిన తర్వాత అగ్రనేతల స్థాయిలో పార్టీని నియంత్రించే యంత్రాంగం కరవైంది. బీజేపీలోని సీనియర్లెవరూ కూడా తెలుగుదేశం పార్టీని కేర్ చేయడం లేదు. పోలవరం వంటి అంశాల్లో రాష్ట్రప్రభుత్వాన్నే తప్పుపడుతూ విరుచుకుపడుతున్నారు. విడిపోదామని ప్రకటన చేయండంటూ టీడీపీ నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు. యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో ఈ పొలిటికల్ పోరాటం సాగడం లేదు. పక్కా ఎత్తుగడతో, రాజకీయ వ్యూహంతోనే వీరి గిల్లికజ్జాలు పకడ్బందీగా అమలవుతున్నాయి.

పాత నీరుకు కొత్త సెగ...

అధికారంతో సంబంధం లేకుండా బారతీయ జనతాపార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నాయకత్వం ఉంది. పదవులు, అదికార ప్రయోజనాలు వీరికి ముఖ్యం కాదు. పార్టీ సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం, దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి ప్రజల్లోకి వెళ్లడమనేది ప్రధాన లక్ష్యం. ఇంకో రకం నాయకులు అధికారం వచ్చినప్పుడు, లేదా వచ్చే అవకాశం ఉందని గ్రహించినప్పుడు మాత్రమే పార్టీ తరఫున పోటీ చేసి పదవులను రాబట్టుకుంటుంటారు. మొదటి వర్గం నాయకులకు పార్టీలో మంచి పట్టుంటుంది. రెండో వర్గం నాయకులను అవసరానికి అనుగుణంగా పార్టీ వాడుకుంటుంది.అదే తరహాలో వారు కూడా పార్టీని వాడుకుంటుంటారు. కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకూ ఎదిగిన సోము వీర్రాజు వంటి వారు పార్టీలో పట్టున్న నాయకులు. సిద్దాంతాలు నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి. కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు పొందిన వారిలో చాలామందికి పార్టీ విధానాలపై విశ్వాసం కానీ, ఆచరణలో చూపించాలన్న ధృఢ సంకల్పం కానీ లేవు. అందుకే పాత వర్సస్ కొత్త నేతలు కొట్లాట చాలా ఉద్ధృతంగానే ఇటీవలి కాలం వరకూ సాగింది. కాంగ్రెసు పార్టీ నుంచి బీజేపీ లోకి వచ్చిన చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగానూ, టీడీపీకి పార్టీ పరంగానూ శతృత్వం వహించేవారే ఉన్నారు. ఈ అంశం టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీవ్ర ఘర్షణకు దారితీసింది. మాటల యుద్ధం ఢిల్లీ వరకూ చేరింది. ఫిర్యాదులతో చంద్రబాబు బీజేపీని ఎదగనీయడం లేదని నిరంతరం అధినాయకులను కలుస్తూ ఉండేవారు. కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీ నారాయణ,పురందేశ్వరి వంటివారు ఈ రకమైన పద్ధతిలో టీడీపీపై, చంద్రబాబుపై దాడికి యత్నించారు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ , టీడీపీ లాభపడుతోందని చెబుతూ వచ్చారు. వీరంతా పెద్ద నాయకులే అయినప్పటికీ కాంగ్రెసు నుంచే రావడంతో కొంత మీమాంస ఏర్పడింది. ఈలోపుగానే చంద్రబాబు చక్రం తిప్పి వీరంతా కాంగ్రెసు కోవర్టులు అన్న బలమైన ముద్రను బీజేపీ అధిష్ఠానం చెంతకు చేరవేయగలిగారు. దీంతో అధిష్టానం వద్ద వీరి పలుకుబడి కొంతమేరకు పడిపోయింది. బీజేపీని తెలుగుదేశానికి సమాంతరంగా అభివృద్ధి చేస్తారనుకున్న నేతలంతా నీరుగారిపోయారు.

పాత కాపు కొడితే పక్కా......

చంద్రబాబు నడిపిన చాణక్యానికి వెనకడుగు వేసిన కాంగ్రెసు నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నేతలు తాజాగా కొత్త పంథాను అమలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కొంత సంఘర్షణ ఏర్పడింది. 2019 ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో ఆలోచనలు, రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూనే రెండు పార్టీలు నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నవారు తమ పరిధి దాటకుండా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీగా గెయినింగు పాయింట్ల విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం స్వేచ్ఛ తీసుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఐస్ క్రీం పుల్ల లాంటిదని టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఘాటుగా విమర్శించారు. అసలు మీ స్థాయిని మరిచిపోయారంటూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బీజేపీని దెప్పిపొడిచారు. దీనికి ప్రతిగా బీజేపీ మాకవసరం లేదని చంద్రబాబు ప్రకటించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. టీడీపీ రాజేంద్రప్రసాద్ కు బోలెడంత రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ విధాన నిర్ణయాల హార్డ్ కోర్ కమిటీలో అతనొక సభ్యుడు. సోము వీర్రాజు పదవులతో సంబంధం లేకుండా బీజేపీలోనే తొలినాటి నుంచి ఎదిగిన సీనియర్ రాష్ట్రస్థాయి నేత. స్వతంత్ర పంథాను అనుసరిస్తూ పార్టీకే రాష్ట్రంలో గైడెన్సు ఇచ్చే వ్యక్తి. టీడీపీపై తొలి నుంచీ కూడా సోము ఆరోపణలు , విమర్శలు చేయడం కొనసాగుతోంది. ఇప్పుడు పొత్తు వద్దు అనే స్థాయికి ఆయన వాయిస్ పెంచారు. ఈ సెగను ఎగదోస్తున్నది మాత్రం కాంగ్రెసు నుంచి వచ్చిన సీనియర్ నేతలనేది పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు పాతకాపులతోనే పక్కా ఆరోపణలతో విమర్శలు గుప్పించడం ద్వారా టీడీపీని కంట్రోల్ చేయాలనేది ఇందులోని వ్యూహం. చంద్రబాబు సహా ఇరుపక్షాల నాయకులు సంయమనం పాటించమని సుద్దులు చెబుతున్నారే తప్ప పార్టీ విధానాల ఉల్లంఘన కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఆ రకమైన సంకేతాలు ఇవ్వడం లేదు. హెచ్చరికలు చేయడం లేదు. ఇదే రాజకీయ రహస్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News