కొలీజియం... పారదర్శకం

Update: 2017-10-13 17:30 GMT

దేశ న్యాయ వ్యవస్థకు దిక్సూచీ వంటిది సుప్రీంకోర్టు. అది అనుసరించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు యావవత్ న్యాయవ్యవస్థపై విశేష ప్రభావాన్నిచూపుతాయి. తన వ్యవహార శైలి ద్వారా దిగువ కోర్టులకు మార్గదర్శిగా నిలుస్తుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంది. తన పనితీరు ద్వారా ఆదర్శంగా నిలిచింది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకతను పెంచేందుకు అందుకు దారి తీసిన పరిస్థితులను వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయించడం హర్షణీయం. పనితీరులో వేగం తదితర చర్యల ద్వారా పెండింగ్ కేసులను గణనీయంగా తగ్గించడం ఆశాజనక పరిణామం. ఈ రెండు అంశాలు సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొలీజియంలో లోపాలు.....

హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలు, సుప్రీంకోర్టు నియామకాలకు సంబంధించి ఏర్పాటైన వ్యవస్థ కొలీజియం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలన్న సదుద్దేశ్యంతో, నియామకాల్లో ప్రభుత్వ జోక్యాన్ని , ప్రమేయాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టే స్వయంగా కొలీజియంను ఏర్పాటు చేసింది. 23 ఏళ్ల క్రితం 1993లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ జీఎస్ వర్మ ధర్మాసనం వెలువరించిన తీర్పు ఫలితంగా ‘కొలీజియం’ ఆవిర్భవించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఇందులో సభ్యులు. రాష్ట్రాలస్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సారథ్యంలో ఇలాంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఆరంభంలో అంతా సజావుగా సాగినా కాలక్రమంలో కొలీజియంలోని లోపాలు ఒక్కొక్కటీ బయటపడ్డాయి. అందులోని అవలక్షణాల కారణంగా మొత్తం వ్యవస్థ విశ్వసనీయతపైనే సందేహాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. నిర్ణయాలకు సంబంధించి పారదర్శకత లోపించడం ప్రధాన విమర్శగా న్యాయ నిపుణులు పేర్కొనేవారు. ఎవరిని న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు... ఎందుకు నియమిస్తున్నారు? వారికి గల అర్హతలు, వృత్తిపరమైన అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యం, నిబద్ధత వంటి విషయాలు నాలుగు గోడలకే పరిమితమయ్యేవి. నిర్ణయాల్లో గోప్యత ఉండేది. కొలీజియం నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించరాదు. ప్రతిరోజూ తన తీర్పుల్లో ‘పారదర్శకత’ గురించే న్యాయస్థానం తన దగ్గరకు వచ్చేసరికి దానిని పట్టించుకోక పోవడం విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వంతో పాటు, న్యాయ నిపుణులే కొలీజియం నిర్ణయాల్లో సహేతుకతను ప్రశ్నించారు. కొలీజియం ఏర్పాటు చేయాలంటూ తీర్పు ఇచ్చిన జస్టిస్ జీఎస్ వర్మ కాలక్రమంలో అది ఆదర్శంగా వ్యవహరించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జవాబుదారీతనం లోపించి.....

ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నాలు జరగక పోలేదు. వాజపేయి హయాంలో జస్టిస్ వెంకటాచలమయ్య సారథ్యంలో ఏర్పాటైన రాజ్యాంగ సమీక్ష సంఘం పరిపాలన సంస్కరణల సంఘం, పార్లమెంటరీ కమిటీలు ‘కొలీజియం’ బదులు న్యాయ నియామకాలు, బదిలీలు, పదోన్నతులకు సంబంధించి జాతీయ న్యాయ నియామకాల సంఘం (నేషనల్ జ్యడిషియల్ అపాయింట్ మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని సూచించాయి. ఈ సూచనకు న్యాయ పాలిక నుంచి మద్దతు లభించ లేదు. దీంతో ఈ దిశగా చట్టం చేసేందుకు యూపీఏ హయాంలో ప్రయత్నాలు జరిగినా న్యాయ రూపం దాల్చలేదు. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్.జే.ఏ.సీ చట్టం తీసుకు వచ్చినప్పటికీ దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహార్ ఈతీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుతో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ విభేదించారు. ప్రజా సారథ్యంలోని అన్ని వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పట్టుబడుతున్న న్యాయవ్యవస్థ తన దగ్గరకు వచ్చేసరికి ఇందుకు మినహాయింపు కోరడంలో అర్ధం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి బలంగా విన్పించాయి.

మార్పులు తీసుకొచ్చేందుకు.....

ఈ విమర్శల నేపథ్యంలో ‘కొలీజియం’ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడం అత్యంత హర్షణీయం. ఇక నుంచి కొలీజియం నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయించింది. అంతేకాక ఆ యా నిర్ణయాలకు దారితీసిన పరిస్థితులను, కారణాలను కూడా ఈ వెబ్ సైట్ లో పెట్లాలని నిర్ణయించడం ద్వారా పారదర్శకతను పాటించాలనుకోవడం ఆహ్వానించదగ్గది. ఇటీవల కొత్తగా 9మంది న్యాయమూర్తులను నియమించడానికి గల కారణాలను, మరికొందరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పొందుపర్చడం విశేషం. కేరళ హైకోర్టుకు ముగ్గురిని, మద్రాస్ హైకోర్టుకు ఆరుగురిని న్యాయమూర్తులుగా నియమిస్తూతీసుకున్న నిర్ణయానికి అనుసరించిన విధానాలను సుప్రీంకోర్టు తన వెబ్ సైట్ లో ఉంచింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్ రాజీనామా వ్యవహారంలో కొలీజియంపై విమర్శలు వచ్చాయి. వాస్తవానికి ఆయన అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉండగా సర్కార్ ప్రమేయంతోనే ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారన్న ఆరోపణలు న్యాయవర్గాల నుంచి వినవచ్చాయి. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక హైకోర్టుల్లో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బహుశా ఈ నేపథ్యంలోనే కొలీజియం నిర్ణయాల్లో పారదర్శకత పాటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ పారదర్శకత దిశగా సర్వోన్నత న్యాయస్థానం ఒక అడుగు వేయడం ఆహ్వానించ దగ్గది.

పెండింగ్ కేసులు సత్వరమే.....

సుప్రీంకోర్టులో అపరిష్కృత కేసుల సంఖ్య తగ్గుతుండటం మరో సానుకూల పరిణామం. ఈ ఏడాది జనవరి 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖేహార్ బాధ్యతలు స్వీకరించే నాటికి 62537 కేసులు వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉండగా మే 1 నాటికి వాటి సంఖ్య 60751 కి తగ్గడం విశేషం. నెలకు సగటున 357 చొప్పున ఐదు నెలల్లో 1786 కేసులు పరిష్కారమయ్యాయి. అపరిష్కృతంగా ఉన్న 60751 కేసుల్లో 33656 కేసులు ప్రాధమిక దశలో ఉన్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ హైకోర్టులు కూడా అపరిష్కృత వ్యాజ్యాల విషయంలో వేగంగా వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని హైకోర్టులు కూడా ఈ దిశగా సాగుతుండటం హర్షించదగ్గ పరిణామం. మొత్తం మీద పారదర్శకత, సత్వర న్యాయం దిశగా అడుగులు పడటం అందరూ హర్షించదగ్గ అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News