కొడుకులు కుంపటి పెట్టేశారే...!

Update: 2017-11-30 15:30 GMT

తెలుగులో మంచి సామెత ఉంది. తండ్రికి పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కలగదు. సమాజం గుర్తించి అతని ఘనతను ప్రశంసించినప్పుడు నిజమైన పితృత్వంతో తండ్రి పులకించిపోతాడంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వారసులైన కేటీఆర్, లోకేశ్ మంచి దూకుడు కనబరుస్తున్నారు. దూసుకుపోతున్నారు. వంది మాగధులు వీరిపై ప్రశంసల జల్లులూ కురిపిస్తున్నారు. కానీ లోలోపల కుంపటి రగులుకొంటోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వారసత్వ పోరు లేదు. లోకేశ్ కు పోటీ కూడా లేదు. తెలంగాణలో మాత్రం కేటీఆర్ కు దీటైన పోటీదారులు హరీష్, కవితల రూపంలో కనిపిస్తున్నారు. కానీ రెండు చోట్లా తమ వారసులను బాగా ఎలివేట్ చేసేందుకు తండ్రులు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. కుటుంబంలోనూ, పార్టీపరంగానూ అసంతృప్తి బీజాలను నాటుతున్నాయి. ఇప్పటికిప్పుడు తిరుగుబాటు స్థాయి వాతావరణం కనిపించకపోయినా అసమ్మతి స్వరాలైతే మెల్లమెల్లగా సణుగుడు రూపంలో మొదలయ్యాయి. వర్గాలను సపోర్టు చేసే నాయకులు అటు ఇటు గా చేరి అగ్నికి అంతర్గత ఆజ్యం పోసేందుకూ సిద్దమవుతున్నారు.

జీ హుజూర్...జీఈఎస్

భారత ప్రభుత్వం, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంకా ట్రంప్ తర్వాత బాగా ఎక్స్ పోజర్ పొందిన వ్యక్తి కేటీఆర్. 50 శాతం పైగా మహిళలు, అందులోనూ 30శాతం 35 ఏళ్లలోపు యువత పాల్గొన్న సదస్సు ఇది. సదస్సులోని ఏదేని కీలకభేటీకి, బృంద చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి పార్లమెంటు సభ్యురాలు కవిత. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఆమె ఇప్పటికే వేలాది మందికి శిక్షణ ఇప్పిస్తూ కేంద్ర నిధులను రప్పిస్తూ మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. పార్లమెంటరీ బృందాలలో సభ్యురాలిగా విదేశాల్లో సైతం పర్యటించిన అనుభవం ఆమెకు ఉంది. లోక్ సభలో తెలంగాణ వాణి వినిపించడంలో ప్రధాని, కేంద్ర మంత్రుల అభినందనలు, గుర్తింపును కూడా ఆమె పొందగలిగారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. ఇటువంటి నేపథ్యం ఉన్న కవితను తొలిసారిగా తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఉన్నతస్థాయి సదస్సుకు దూరంగా ఉంచడం పార్టీలో చర్చనీయమవుతోంది. నిజానికి వయసు, జెండర్ రీత్యా ఈ సదస్సులో భాగస్వామ్యం వహించే అర్హత కేటీఆర్ కంటే కవితకే ఎక్కువగా ఉంది. ఈ సదస్సులో పాల్గొనదలచిన కీలక నేతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సంప్రతించినప్పుడు కేవలం కేటీఆర్ పేరునే పంపినట్లు అధికార వర్గాల సమాచారం. ఉద్దేశపూర్వకంగానే కవితను పక్కనపెట్టేశారనే ఆవేదన జాగృతి సభ్యుల్లో వ్యక్తమవుతోంది. అదే విధంగా మరో వారసత్వ పోటీదారు హరీశ్ రావు కూడా ప్రతిష్టాత్మక సదస్సు తనకు సంబంధం లేదన్నట్లుగా దూరంగా ఉండిపోయారు.

పార్టీలో వారే కీలకం...

నిజానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ఎన్నికల వ్యూహరచన , అందర్నీ కలుపుకుని పోవడం వంటి విషయాల్లో హరీశ్ రావు చురుకైన పాత్ర పోషిస్తారు. ఎటువంటి క్లిష్టమైన పనినైనా చక్కబెట్టగల సమర్థుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ విషయంలో హై ఫై గా కనిపించే కేటీఆర్ హరీశ్ ముందు తేలిపోతారు. పార్టీలోని కార్యకర్తలు, నాయకులతో సంబంధాలు కూడా అంతంతమాత్రమే. ఇక కవిత కూడా తెలంగాణ సంస్కృతి చిహ్నమైన బతుకమ్మకు ఒక గుర్తింపు తెచ్చింది. దూసుకుపోయే తత్వంలో తనకంటే చెల్లెలే బెటర్ అంటూ స్వయంగా కేటీఆర్ కితాబునిచ్చిన సందర్బాలున్నాయి. మహిళా నాయకురాలిగా కవితకు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ జాతీయ నాయకులే ప్రశంసలు గుప్పించారు. అయినప్పటికీ సొంతరాష్ట్రంలో తగిన గుర్తింపు లబించడంలేదని ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్, కవితలతో పోలిస్తే రాజకీయంగా కేటీఆర్ వెనకబడి ఉంటారనేది పార్టీ వర్గాల అంచనా. అయినప్పటికీ కేసీఆర్ మనసులో వారసుడిని ప్రతి సందర్బంలోనూ బాగా ప్రొజెక్టు చేయాలనే ఆలోచన ఉండటంతో కేటీఆర్ కు లభిస్తున్న అవకాశాలు మిగిలిన ఇద్దరికీ లభించడం లేదంటున్నారు. పార్టీలో కేసీఆర్ ను ధిక్కరించి మాట్లాడే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. కానీ కుటుంబపరంగా మాత్రం జీఈఎస్ వివాదం కుంపటి రగిలించే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు.

లోకేశ్ వర్సెస్ సీనియర్లు...

తెలుగుదేశం పార్టీకి ఏకైక వారసునిగా రూపుదాల్చిన లోకేశ్ వైఖరిపై తెలుగుదేశం సూపర్ సీనియర్లు మండిపడుతున్నారు. బహిరంగంగా ఎటువంటి అసంతృప్తి ప్రకటనలు చేయకపోయినా లోపల్లోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంతవరకూ తనదే పైచేయిగా పెత్తనం చెలాయించిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణునికి లోకేశ్ అడ్డుచక్రం వేస్తున్నారనేది పార్టీవర్గాల సమాచారం. 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంలో అప్పటి స్పీకర్ గా యనమల రామకృష్ణుడు కీలక పాత్ర పోషించారు. అప్పట్నుంచి పార్టీలో ద్వితీయస్థానం యనమలదే. లోకేశ్ మంత్రివర్గంలోకి చేరినప్పట్నుంచీ తూ.గో.లో యనమలకు చెక్ పెట్టేశారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దాంతో ఇటీవల యనమల తనకు రాజ్యసభ సీటు ఇప్పించవలసిందిగా చంద్రబాబును అభ్యర్థించారు. రాష్ట్ర రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. లోకేశ్ పనితీరుపై చంద్రబాబు కూడా పూర్తిస్థాయి సంతృప్తిగా లేరని సీనియర్ నాయకులు చెబుతున్నారు. నంద్యాల, కాకినాడ వంటి ఎన్నికల బాధ్యతలు లోకేశ్ కు అప్పగిస్తే సీనియర్లు సహకరించరనే భయంతోనే చినబాబును దూరంగా ఉంచారని ప్రచారం సాగింది. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి విచక్షణాధికారం లోకి వస్తుంది. అయినా దానిపై కూడా లోకేశ్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం తనపరిధిని అతిక్రమించడమేననే భావన సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోకేశ్ నంది అవార్డులపై చేసిన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేశాయి. ఇంకా రాజకీయ నాయకునిగా పరిపక్వత చెందకుండానే అన్నింటా తానున్నానని చాటుకోవాలనే తాపత్రయం,అత్యుత్సాహం సీనియర్లకు, లోకేశ్ కు మధ్య అగాధం సృష్టిస్తోంది. అయితే ప్రభుత్వంలో, పార్టీలో తనకు ప్రత్యామ్నాయం లేకపోవడం లోకేశ్ కు కలిసొచ్చే అంశం. చంద్రబాబు పక్కా రాజకీయ వేత్త. పార్టీకి, ప్రభుత్వ మనుగడకు ఇబ్బందికరమని భావిస్తే కుమారుడిని అయినా దూరం పెట్టేందుకు, మరొకరిని(బ్రాహ్మణిని?) ఆ స్థానంలోకి తెచ్చేందుకు కూడా వెనకాడరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News