కొంచెం కష్టపడితే మోడీ కోటను కొట్టేయొచ్చా?

Update: 2017-10-07 16:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. నాటి ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను హస్తం పార్టీ సాధించిన స్థానాలు అక్షారాలా ఇరవై ఆరే. ఐదేళ్ల అనంతరం 1999లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ 92 స్థానాలు సాధించి అధికారం అంచులదాకా వెళ్లింది. మరో ఐదేళ్లలో 2004లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. గత ఏడాది అస్సోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నాటికి బీజేపీ బలం కేవలం ఐదు సీట్లు. అయితే ఏకంగా అధికారాన్ని అందుకుంది. అప్పటి వరకూ కేంద్రమంత్రిగా ఉన్న సర్వానంద సోనోవాల్ సమర్ధ సారధ్యంలో పోరాడిన బీజేపీ అస్సోంలో తొలి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజాదరణను ఓటుగా మలచుకునే సమర్ధులైన నాయకులు ఉంటే విజయం అసాధ్యం కాదనడానికి నిదర్శనాలు పై రెండు ఉదంతాలు.

సమర్థమైన నాయకత్వ లేమి......

ప్రస్తుతం గుజరాత్ లో కాంగ్రెస్ కు లోపించింది సమర్ధులైన నాయకుల లేమి. అందువల్లే స్థిరమైన ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ అధికార బీజేపీ హవాను అడ్డుకోలేకపోతోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోంది. ఈసారి కూడా దాదాపు అదేపరిస్థితి నెలకొందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకసారి కాంగ్రెస్ బలాబలాలను పరిశీలిస్తే.. ఈవిష‍యం స్పష్టమవుతోంది. వరుసగా రెండు దశాబ్దాల నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ స్థిరమైన పనితీరును కనబర్చటం గమనార్హం. 1995లో తొలిసారి ఓటమి పాలయినప్పటికీ 32.9 శాతం ఓట్లు, 45 సీట్లు సాధించింది. 1998లో తన బలాన్ని కొంతవరకూ పెంచుకుంది. బీజేపీని అడ్డుకోలేక పోయినప్పటికీ 35.28 శాతం ఓట్లు, 53 సీట్లు కైవసం చేసుకుంది. తద్వారా తన బలాన్ని కాపాడుకుంది. 2002లో కూడా 39.59శాతం ఓట్లు, 51సీట్లు సాధించి తన బలాన్ని కాపాడుకుంది. 2002లో మోడీ బీజేపీని ఎదుర్కొని 40.59 శాతం ఓట్లు, 51 సీట్లు సాధించి తన బలాన్ని పదిలపర్చుకుంది. 2007లో 39.63 శాతం ఓట్లు, 59 సీట్లు సాధించడం గమనార్హం. 2012లోనూ 40.59 శాతం ఓట్లు 61 సీట్లను హస్తం పార్టీ సాధించింది. ఓట్ల శాతాన్ని, సాధించిన సీట్లను గమనిస్తే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ తన బలాన్ని కాపాడుకున్నట్లు అర్ధమవుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ తన బలాన్ని కాపాడుకుంది. ప్రతిసారీ 30 నుంచి 40 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోతోంది. సమర్ధులైన నాయకులు రంగంలో ఉండి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ మంచి వ్యూహరచనతో ముందుకు వెళితే అధికారపు అంచులదాకా వెళ్లడం అంతకష్టం కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవతోంది. దీనికి తోడు ఢిల్లీలోని కేంద్ర నాయకత్వం కూడా గట్టి పట్టుదలతో పోరాడితే ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమే. కేంద్ర నాయకత్వం కుదేలు కావడం, రాష్ట్రంలో సమర్ధ నాయకత్వం లోపించడం వల్ల పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు కేంద్రంలో చక్రం తిప్పినప్పటికీ గుజరాత్ లో బలోపేతం కావడంపై అధిష్టానం శ్రద్ధ చూపలేకపోయింది.

స్థానికసంస్థల ఎన్నికల్లో అనుకూల.....

ప్రస్తుతం ఉన్న సానుకూల పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2015లో జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావ వంతమైన ఫలితాలను సాధించింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ వ్యూహాలను, ఎత్తులను చిత్తుచేసి అహ్మద్ పటేల్ ను గెలిపించుకుంది. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించడంలో పార్టీ విఫలమయిందన్న వాదన విన్పిస్తోంది. ప్రభుత్వ విధానాలపై పోరాటం, పార్టీ శ్రేణుల్లో స్థయిర్యాన్ని నింపడం, సమన్వయం చేయడంలో సమర్ధంగా వ్యవహరించలేక పోతోంది. రాష్ట్రానికి చెందిన అహ్మద్ పటేల్ పార్టీ అధినేత్రి సోనియా రాజకీయ కార్యదర్శిగా క్రియాశీలక పాత్ర వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

బీజేపీ హవా కూడా అంతంత మాత్రమే....

మోడీకి ముందు ఎలాగున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ హవా అంతంత మాత్రమే. మోడీ అనంతరం వచ్చిన ఆనందీ బెన్ పటేల్ విఫలమయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా తడబడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే సమర్ధుడైన నాయకుడు కరువయ్యారన్నది వాస్తవం. పటేల్ వర్గీయుల రిజర్వేషన్ల ఆందోళనలకు పార్టీ అనుకూలంగా మలచుకోలేకపోయింది. సంప్రదాయ ఓటు బ్యాంకు తప్ప కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోలేక పోయింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అందువల్లే జిల్లా, నగర పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోన ప్రభావం చూపగలిగింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా సమర్థవంతమైన పోరాటాన్ని చేయలేకపోయింది. పటేళ్ల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన ఏక్తా హర్బ్ నాయకుడు అల్పేశ్ ఠాకూర్ ను ఆకట్టుకోలేకపోయింది.

ఎంతమందిని నియమించినా......

పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి సమర్థుడైన నాయకుడే అయినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి సరిపోడన్న అభిప్రాయం ఉంది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి మాధవ్ సింగ్ సోలంకి కుమారుడైన భరత్ సింగ్ సోలంకి 2015 డిసెంబర్ లో పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈయన తండ్రి మాధవ్ సింగ్ సోలంకి 90వ దశకంలో పీవీ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. భరత్ సింగ్ సోలంకి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో ఆనంద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా ఇతర కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన ఆయన అంతదూకుడిగా వ్యవహరించలేరన్న అభిప్రాయం ఉంది. ఇంతకాలం శంకర్ సింహ్ వాఘేలాపై ఆధార పడిన కాంగ్రెస్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఒకమాటలో చెప్పాలంటే పూర్తిగా ఆయనపై ఆధారపడి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోలేకపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇటీవల జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. గిరిజన నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి అమర్ సిన్హ్ చౌదురి కుమారుడైన తుషాల్ చౌదరి వారిలో ఒకరు. పటేల్ వర్గానికి చెందిన పరేష్ ధనవి, ఓబీసీ వర్గానికి చెందిన కువర్జీ బావాలియా, దళిత నాయకుడైన కర్సన్ దాస్ సొనాలిలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరు నలుగురు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన వారు. పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి క్షత్రియ వర్గానికి చెందిన వాడు. ఇక 32 మంది సీనియర్ నాయకులతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సత్యజిత్ గైక్వాడ్ ను పీసీసీ ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి పంపింది. సంప్రదాయ ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడటం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. వారిని కాపాడుకుంటూనే ఇతర వర్గాల వారిని పార్టీ దరి చేర్చుకోవాలి. అదే సమయంలో అందరినీ సమన్వయం చేయగల సమర్ధ నేత అవసరం. లేనట్లయితే పార్టీ భవిష్యత్తు నామమాత్రమే అవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News