కేసీఆర్ రివర్స్ గేర్...?

Update: 2017-10-28 15:30 GMT

ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రభుత్వ వేగానికి ప్రతిపక్షాలు కళ్లెం వేస్తుంటాయి. ప్రభుత్వ విధానాలను వెనుక నుంచి పట్టి లాగుతూ బ్రేకులు వేస్తుంటాయి. సర్కారీ రథాన్ని పట్టి కుదిపేస్తుంటాయి. తెలంగాణలో మాత్రం రివర్స్ గేర్. తమపైకి దూసుకువస్తున్న ప్రభుత్వ అజెండాను చూసి ప్రతిపక్షం బెంబేలెత్తుతోంది. భిన్నమైన వ్యూహంతో సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు విపక్షాలను అసహనానికి గురి చేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకునే కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి ఎక్కువ రోజులపాటు శాసనసభ నిర్వహించడమంటే సాధారణంగా ఇష్టముండదు. ఎందుకంటే ప్రజాసమస్యలు ఇక్కడ చర్చకు వస్తాయి. ప్రభుత్వ పథకాల్లోని లోపాలనూ విపక్షాలు ఎత్తి చూపుతాయి. విధానాలపై ధ్వజమెత్తుతాయి. హామీలపై నిలదీస్తాయి. ప్రభుత్వానికి ఇదంతా పెద్ద తలపోటు. అందుకే సాధ్యమైనంత తక్కువ రోజులపాటు సభను సమావేశపరిచి తంతు ముగించేయాలని చూస్తుంటాయి ప్రభుత్వాలు. ఎక్కవ రోజులు సభను నడపాలి. ప్రజాసమస్యలు చర్చించాలి.అంటూ ప్రతిపక్షాలు డిమాండు చేస్తుంటాయి. కానీ తెలంగాణలో బాబోయ్ శాసనసభ అన్ని రోజులపాటు అవసరమా? అని ప్రధానప్రతిపక్షం అంతర్మథనానికి గురవుతోంది. అలాగని బయటకు చెప్పలేక బాధపడుతోంది.

ఎందాకైనా రెడీ...1..2..3...50

సాధారణంగా శాసనసభ వర్షాకాల,శీతాకాల సమావేశాలు పది,పదిహేను రోజుల్లో ముగుస్తుంటాయి. పెద్దగా బిల్లులు, బిజినెస్ ఉండదు. బడ్జెట్ సమావేశాల్లో మాత్రం శాఖలవారీ డిమాండ్లు, ద్రవ్యవినిమయ బిల్లు, ఆర్థిక సర్వే, రాష్ట్ర ఆదాయవ్యయాలు అన్నింటినీ చర్చించాల్సి ఉంటుంది. 30 నుంచి 40 సిట్టింగుల వరకూ తీసుకుంటారు. అటువంటిది తెలంగాణ శీతాకాల సమావేశాలనే 50 సిట్టింగుల వరకూ నడుపుదామని కేసీఆర్ ప్రతిపాదించారు. సీఎం ఉద్దేశం అర్థమైన ప్రతిపక్షనాయకుడు జానారెడ్డికి మింగా కక్కాలేని పరిస్థితి. వద్దంటే ప్రతిపక్షం పారిపోతోందన్న విమర్శ ఎదురవుతుంది. వివిధాంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షం వద్ద సరైన సరుకు లేదంటారు . కావాలంటే ప్రభుత్వ అజెండాను యథేచ్ఛగా అమలు చేసుకుంటుంది.అన్ని రోజుల సభ కు ఓకే చెబితే ప్రభుత్వ పక్షానిదే పైచేయి అవుతుంది. సభ్యుల సంఖ్యాపరంగా ఎక్కువ సమయం అధికార పక్షానికే దక్కుతుంది. మంత్రులు చెప్పే వివరణలు, చేసే ప్రకటనలు దీనికి అదనం. ఇక ముఖ్యమంత్రి వినియోగించుకునే సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. వివిధ పార్టీల నుంచి కలిపేసుకున్న ప్రతిపక్ష సభ్యులతో కలిపి మూడింట రెండువంతులకు పైగా మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ సభాపక్ష హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. అసలు 50 రోజులపాటు శాసనసభ సమావేశాల ప్రతిపాదన వెనుక కేసీఆర్ వ్యూహం విస్పష్టం. ఈ విడత చట్టపరమైన బిజినెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై తమ శాసనసభ్యుల ద్వారా విస్తృత ప్రచారానికి శాసనసభ చక్కగా ఉపయోగపడుతుందనే భావనలో అధికారపక్షం ఉంది.

నాయకత్వానికి నగిషీ...

వివిధనియోజకవర్గాల్లో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనను వివిధ రూపాల్లో చర్చకు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. సభలో శాసనసభ్యులందరికీ అవకాశం ఇవ్వడం ద్వారా వారి పనితీరును, ప్రజల్లో కి చొచ్చుకు వెళ్లగల వారి సామర్థ్యాన్ని బేరీజు వేసుకునేందుకు కూడా వీలు చిక్కుతుంది. బడ్జెట్ సమావేశాల్లో సభా పక్ష నాయకులు, ఎంపికచేసుకున్న వక్తలకు తప్ప అందరికీ అవకాశం దొరకదు. ఇప్పుడైతే ఒక్కొక్కరినీ పరీక్షించవచ్చు. వాక్చాతుర్యం, సర్కారీ సంక్షేమ పథకాలను వివరించి, విశ్లేషించే తీరు ఆధారంగా ఆయా ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రతిభను కూడా ప్రభుత్వం అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి శాసనసభ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాల తీరుతెన్నులపై సానుకూల కోణంలో హోరెత్తబోతోంది. సంఖ్యాపరంగా అత్యంత బలహీనంగా మారిన విపక్షాల వాయిస్ చాలా పేలవంగా మారిపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ విభిన్న పక్షాల వేదికగా చెప్పాలి. 2014 ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలో ఎనిమిది పక్షాలకు ప్రాతినిధ్యం లభించింది. టీఆర్ఎస్, కాంగ్రెసు, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, వై.సి.పి. , సీపీఐ, సీపీఎం ల సభ్యులు వివిధ నియోజకవర్గాలనుంచి ఎన్నికయ్యారు. పక్కాగా చర్చలతో భిన్నవాదనలతో ప్రజాస్వామ్యానికి పరిపుష్టి చేకూరుతుందని తొలిదశలో భావించారు. అధికారపక్షం ఏరకమైన తప్పులు చేయకుండా కట్టడి చేయడానికి, అత్యంత జాగరూకతతో పాలన చేయడానికి రాజకీయ సమీకరణలు తోడ్పడతాయనుకున్నారు. కానీ జరిగింది వేరు. మూడో అతిపెద్ద పక్షమైన తెలుగుదేశం తనకున్న 15 మంది సభ్యుల్లో 12 మందిని టీఆర్ఎస్ కు కోల్పోయింది. స్వీయతప్పిదాలతో అస్తిత్వం నామమాత్రంగా మారిపోయింది. వై.సి.పి. మొత్తంగా టీఆర్ఎస్ పరమై పోయింది. ఎంఐఎం మిత్రపక్షంగా మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు సభ్యులకూ టీఆర్ఎస్ గాలం వేయగలిగింది. అధికారంలో లేకపోయినా కాంగ్రెసు నాయకుల సీఎం పదవీ కాంక్షలు, వర్గ విభేదాలతో ఆ పార్టీ ఇంకా సతమతమవుతోంది. దీంతో అధికార పార్టీని ఇరుకున పెడుతూ బలమైన వాదన వినిపించాల్సిన విపక్షాలు నీరుగారిపోయాయి. కేవలం 63 మందితో ఎన్నికైన అధికారపక్షం బలం తాజాగా 80 పైచిలుకుకు చేరిపోయింది. అసెంబ్లీ వేదికగా విపక్షాలను మరింత బలహీనపరిచే ఎత్తుగడలతో అధికారపక్షం వ్యూహరచన చేస్తోంది.

ప్రశ్నలే..ప్రశంసలు

వివిధ అంశాలపై స్వల్ప వ్యవధి చర్చలతోపాటు ప్రశ్నోత్తరాలనూ సానుకూలం చేసుకునే దిశలో అధికార పక్షం పథక రచన చేస్తోంది. తమ నియోజకవర్గాల్లో సాగుతున్నవివిధ పథకాలపై ప్రశ్నలు గుప్పిస్తే ప్రభుత్వం తరఫున మంత్రులు వివరాలు అందిస్తారు. తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న వివరాలను ప్రజల్లోకి పంపాలనేది టీఆర్ఎస్ వ్యూహం. ఇది పక్కాగా అమలు చేయబోతున్నారు. స్వల్పవ్యవధి చర్చల్లో పాల్గొనడం ద్వారా తమ బాణిని, వాణిని కూడా సభ్యులు పదును పెట్టుకునే అవకాశం కూడా దక్కుతుంది. రానున్నది ఎన్నికల కాలమే. అందువల్ల శాసనసభ్యుల పరిణతిని, విషయపరిజ్ణానాన్ని కూడా టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మదింపు చేసుకోవాలనే యోచనలో ఉంది. భవిష్యత్తులో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించడం, ఇతరత్రా ఉన్నతపదవులకూ శాసనసభలో మంచి నైపుణ్యం కనబరిచినవారినే ఎంపిక చేయవచ్చనేది పార్టీలో అంతర్గతంగా సాగుతున్న చర్చ. నిజానికి తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలకంటే ప్రజాసంఘాలు, పౌరసంఘాలు, సామాజిక వేత్తల ప్రతిఘటనే తీవ్రంగా ఉంది. ప్రజాక్షేత్రంలోనూ, ప్రతివిమర్శల విషయంలోనూ టీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులు దీటుగా వ్యవహరించలేకపోతున్నారు. అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి అగ్రనాయకులే ఈ బాధ్యతను తలకెత్తుకోవాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయిలో రాజకీయపక్షాలను తిప్పికొట్టడం కేసీఆర్ కు పెద్ద పనేం కాదు. కానీ నియోజకవర్గాలు, జిల్లాల వారీ అసంతృప్తిని రగులుస్తున్న ప్రజాసంఘాలు, పౌర వేదికలు, టీమాస్, జేఏసీ వంటి సంఘాల విమర్శలను ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వమే ప్రతిఘటించాల్సి ఉంటుంది. ఇప్పటికీ శాసనసభ్యుల్లో 60 శాతం మందికి ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేదని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు సభ జరపడం ద్వారా మొత్తం సంక్షేమ పథకాల గురించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాల గురించి నూరిపోయడం కూడా ఒక భాగంగా విమర్శకులు భావిస్తున్నారు.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News