కేసీఆర్ మాత్రమే ఛాంపియన్...!

Update: 2017-12-13 15:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్ట పూర్వకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అన్నిటా పోటీ పడే చంద్రబాబుపై పై చేయి నిరూపించుకునేందుకు కేసీఆర్ కు ఒక అపూర్వమైన అవకాశం కలిసొచ్చింది. దీనిని ముందుగా ఊహించని ఏపీ ప్రభుత్వం లో నిరాశ ఆవరించింది. తెలుగు చాంపియన్ గా ప్రచారంలో, ప్రకటనల్లో దూసుకుపోతున్న కేసీఆర్ ను చూసి నిస్పృహకు గురవుతోంది. ఏదేని ఉత్సవాలు, అంతర్జాతీయ సమావేశాల నిర్వహణకు చంద్రబాబు పెట్టింది పేరు. యంత్రాంగాన్ని అదిరించి బెదిరించి సకాలంలో పనులు పూర్తి చేయించి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటుంటారు. కానీ ఇప్పుడావకాశం ఎక్కడిది? ఇదే తాజాగా వేధిస్తున్న ప్రశ్న. ప్రపంచ తెలుగు సభలకు సహాయ నిరాకరణ తో తన మౌన ఘోషను, ఆవేదనను వ్యక్తం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

పోటాపోటీ...

రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ప్రతి విషయంలోనూ పోటీ వాతావరణం ఏర్పడింది. తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా వ్యక్తిగత ప్రతిష్ఠకు పోతూ నాయకులిద్దరూ పైచేయి సాధించేందుకే ప్రయత్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధనకు సహకరించిన ఉద్యోగులకు వేతన సవరణలో 42 శాతం పెంపుదల చూపితే బడ్జెట్ లోటుతో రుణ సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 43 శాతం అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఉద్యోగులు కూడా ఆశించనంత లాభం చేకూర్చారు. కేవలం కేసీఆర్ కంటే తాను గొప్పోడిని అని చెప్పుకోవడానికే నేల విడిచి సాము చేయడం లాంటి నిర్ణయమే ఇది. అలాగే పుష్కరాలు అనగానే పోటీలు పడి వేల కోట్లు కుమ్మరించారు. ఆర్టీసీ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇద్దరూ పోటీలు పడి వేతన ఒప్పందాల పెంపుదల ప్రకటించారు. కేసీఆర్ కొడుకు పంచాయతీరాజ్, ఐటీ శాఖలు తీసుకున్నారని తెలిసి అవే శాఖలతో చంద్రబాబు నారాలోకేశ్ కు మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయితే అర్బనీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో తర్వాత కేటీఆర్ మునిసిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించారు. రుణాల రద్దు, సంక్షేమ పథకాల అమలు అన్నిటా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చేస్తున్న హడావిడి, పోలిక అంతా ఇంతా కాదు. పుష్కరాల వంటి విషయాల్లో సంప్రదాయాలు మత ఆచారాల పట్ల మక్కువ చూపే కేసీఆర్ ను మించి ఆర్భాటం చేయడంలో చంద్రబాబు పై చేయి సాధించారు. ఏ విషయంలోనూ పొరుగు రాష్ట్రం ఆధిక్యం కనబరచడం సహించలేమన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ మొదటి స్థానం సాధించిందన్న ప్రకటన వెలువడగానే ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదంటూ ఖండన లాంటి వివరణ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చి పడింది. పత్రికల్లో పెద్ద ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణలో 12 వ తరగతి వరకూ తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాల్సిందేనని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే చంద్రబాబు కూడా దీనిపై నిర్ణయం ప్రకటించారు. ప్రపంచ తెలుగు భాషోత్సవాలకు కేసీఆర్ సిద్ధం కావడంతో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనే దానిపై అయోమయంలో పడింది.

భాషపై మక్కువ తోటే...

తెలుగు భాషపై విపరీతమైన మక్కువ కలిగిన కేసీఆర్ భాషా వేత్త కూడా. ప్రపంచ తెలుగు సభలను తెలంగాణ సభలుగా జరపాలన్న కొంతమంది ప్రాంతీయవాదుల భావనను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఒకవేళ అదేవిధంగా జరిపితే తాను తెలంగాణకు మాత్రమే నాయకునిగా మిగిలిపోతానన్న వాస్తవాన్ని ఆయన గ్రహించారు. తెలుగు భాషకే ఛాంపియన్ గా ఉండాలంటే భాషోత్సవాలను ప్రాంతాలకు అతీతంగా జరపాలని నిర్ణయించారు. తెలుగు భాషకు పునాదులు వేసిన తెలంగాణ కవులు, రచయితలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు సాహిత్యానికి సమాదరణ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. ఇందులో రాజకీయ కోణం కూడా ముడి పడి ఉంది. తెలుగు కు సంబంధించి ఎక్కువ మంది పత్రికా రచయితలు, సాహిత్యవేత్తలు, భాషా పరిశోధకులు ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు, ఖమ్మం, నిజామాబాదుల్లో 15 శాతం వరకూ ఆంధ్రప్రాంతం మూలాలు కలిగిన స్థిరనివాసులున్నారు. వీరింకా పూర్వ భాషా మూలాలను మరిచిపోలేదు. మొత్తం తెలుగు భాష అంతా ఒకటే అన్న రీతిలో ఈ ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్ర వ్యత్యాసం చూపకుండా ప్రపంచ తెలుగు భాషోత్సవాలు అనడంతోనే అందరినీ కలుపుకుపోయే ధోరణి కనిపిస్తుంది. తద్వారా కేసీఆర్ తానే తెలుగుకు చాంపియన్ గా క్లెయిం చేసుకోగలుగుతారు. ఈ వ్యూహం భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఫలితాలను అందిస్తుంది.

ఏపీ తీరు ఏం బాలేదు...

తెలంగాణలో ఒకవైపు పాఠశాలల స్థాయి నుంచి భాషకు సంబంధించి పోటీలు నిర్వహిస్తూ వాతావరణాన్ని తెలుగు మయం చేస్తూ భాషా స్పృహను కొత్తతరంలో రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకుని ఉండాల్సింది. పిల్లల్లో తెలుగు భాషలో కథలు, కవితల పోటీలు, ఉపన్యాసాల పోటీల వంటివి నిర్వహించి తెలంగాణ ప్రభుత్వానికి సప్లిమెంటరీ సహకారం అందించవచ్చు. దీనివల్ల భాషకు మేలు జరుగుతుందే తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ ప్రపంచ తెలుగు భాషోత్సవాలతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు సభల్లో ప్రభుత్వం తరఫున ఎవరైనా పాల్గొంటారో లేదో కూడా తెలియదు. నిజానికి తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ తెలంగాణ భాషోత్సవాలకు చొరవ చూపింది. పెద్దన్నగా తనవంతు సహకారం అందించాలి. ఆ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువమంది పాల్గొనేలా ప్రచారం చేయాలి. ప్రోత్సహించాలి. ఏపీలో నేటి బాలలు తెలుగు గొప్పదనాన్ని స్మరించుకునే అవకాశం ఏర్పడిందని సంతోషించాలి. హైదరాబాదులోనే తెలుగు మీడియా ఎక్కువగా కేంద్రీకరించి ఉండటంవల్ల యాజమాన్యాలు టీఆర్ఎస్ సర్కారు పట్ల భయమో,భక్తో కానీ తెలుగుభాషోత్సవాలకు పెద్దపీటే వేస్తున్నాయి. ఏపీకి ఇష్టం లేకపోయినా తెలుగు భాష విషయంలో తెలంగాణ చాంపియన్ గా నిలుస్తోంది. ప్రచార యావలో కొట్టుకుపోయే ఏపీ ప్రభుత్వమే ఈ ఈవెంట్ ను మిస్పయిపోతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News