కేసీఆర్ ఉచ్చు...చీలికల చిచ్చు..!

Update: 2017-12-05 15:30 GMT

ఎన్నో నెలల కసరత్తుతో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యతో ముడిపెట్టి టీజాక్ నిర్వహించిన కొలువుల కొట్లాట బహిరంగ సభ ఆశించిన మద్దతును కూడగట్ట లేకపోయింది. తెలంగాణ ఏర్పాటుకు అతి ప్రధానమైన డిమాండు నీళ్లు, నిధులతోపాటు నియామకాలు కూడా. ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉద్దేశంతో యువత రూపంలో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి ఉద్దేశించిన సమావేశం ఇది. కేసీఆర్ సర్కారు తీవ్ర నిర్బంధానికి తోడు సంయుక్త కార్యాచరణ సమితి (టీజాక్ ) లోని భావవైరుద్ధ్యాలు, చీలికలు, రాజకీయ పార్టీల మన:పూర్వక మద్దతు లోపించడంతో కొలువుల కొట్లాటను ప్రభావవంతంగా నిర్వహించలేకపోయారు. ఒక రకంగా తెలంగాణ సమాజంలో నిరుత్సాహాన్ని నింపిన ఘట్టం ఇది . అదే సమయంలో దీనిని విఫలం చేసేందుకు కేసీఆర్ సర్కారు వేసిన ఎత్తుగడలు పాక్షికంగా ఫలించినట్లే కనిపించాయి.

కార్యకర్తల్లేని కదంబం....

తెలంగాణ సాధనలో టీజాక్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. రాజకీయ పార్టీలతోపాటు , స్వచ్ఛందసంస్థలు, పౌరసంఘాలు, ఎన్జీఓలు జాక్ పిలుపునిస్తే చాలు స్పందించి సహకరించేవారు. ఒక రాజకీయ లక్ష్య సాధన దిశలో సకల శక్తుల సమాహారంగా టీజాక్ పనిచేసింది. కానీ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆ ఉత్సాహం, ఊపు కనుమరుగయ్యాయి. టీ జాక్ కూడా నాయకుల సమూహంగా మిగిలిందే తప్ప పనిచేసే క్రియాశీల కార్యకర్తలను సమీకరించే పనిని చేపట్టలేదు. గతంలో సైతం ఈలోపం ఉంది. కానీ మిగిలిన అన్ని పార్టీలు, పౌరసమాజం ఈ బాధ్యతను స్వీకరించడంతో జాక్ లోపాలు బయటపడలేదు. రాష్ట్రసాధన తర్వాత సొంతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రజల్ని సమీకరించే కార్యకర్తలు లేని విషయం బయటపడుతోంది. అందువల్ల రాష్ట్రస్థాయిలోనూ, జిల్లాల స్థాయిలోనూ నాయకుల సమావేశాలు, బహిరంగ ప్రకటనలే తప్ప జనశ్రేణులను సంయుక్త కార్యాచరణ సమితి కదిలించలేకపోతోంది. కేసీఆర్ సర్కారును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ సొంత కార్యాచరణకు ఇచ్చిన ప్రాధాన్యం జాక్ కార్యక్రమాలకు ఇవ్వడం లేదు.

ప్రొఫెసర్ ఆలోచన ఫలించలేదా?

కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి యువశక్తిని సాధనంగా చేసుకోవాలనుకున్న కోదండరామ్ ఆలోచన క్షేత్రస్థాయిలో ప్రతిఫలించలేదు. న్యాయస్థానంలో వ్యాజ్యం వేసి అనుమతులు సాధించి రాజధాని నగరంలో సభను పెట్టారు. వేలాది మంది విద్యార్థులకు నిలయమైన విశ్వవిద్యాలయాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. లక్షల సంఖ్యలోనే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సభాప్రాంగణంలో నిర్దేశిత సమయానికి స్వల్ప సంఖ్యలోనే యువకులు కనిపించారు. సభ ప్రారంభమైన తర్వాత మాత్రమే ఓ మోస్తరుగా విద్యార్థి, యువకులు తరలివచ్చారు. వేదిక మాత్రం వివిధ సంఘాల నేతలతో కళకళలాడింది. లక్షమందికి పైగా హాజరైనా ఆశ్రయమిచ్చే సభా ప్రాంగణం పదోవంతు కూడా నిండక వెలవెల పోయింది. ఇకముందు ఏదేని పిలుపునిచ్చే ముందు టీజాక్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని ఈ సభ చాటిచెప్పింది. నిజానికి తన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్థులను నిర్వీర్యులను చేస్తూ ఏకచ్చత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ సర్కారును సరైన మార్గంలో పెట్టడానికి ఇటువంటి వేదికలు ఎంతైనా అవసరం. కానీ సరైన కార్యాచరణ, సమన్వయం, సంఘటిత శక్తిని ప్రదర్శించ లేకపోతే ప్రభుత్వం ముందు పలచనై పోయే ప్రమాదం ఉంది.

మాట వరస మద్దతే...

జనసమీకరణ విషయంలో తమ బలహీనతలను చివరిక్షణంలో గుర్తించిన టీజాక్, సభ విజయవంతానికి రాజకీయ పక్షాల మద్దతును అభ్యర్థించింది. కాంగ్రెసు, వామపక్షాలు, బీజేపీ, టీడీపీ వంటి పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. కానీ వారెవరూ సభకు సహకరించలేదు. ఒకరిద్దరు నాయకులు వేదికను ఎక్కేందుకు , ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఉత్సాహపడ్డారు. సభ ఉద్దేశాన్ని వివరించి, పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రయత్నించిన దాఖలాలు కనిపించలేదు. సీపీఎం అగ్రనాయకత్వం సభకు పూర్తిగా దూరంగా ఉంది. టీమాస్ అంటూ తమ పార్టీకి అనుబంధంగా ఒక సొంత వేదికను నిర్మించుకుంటున్న దృష్ట్యా టీజాక్ సభ ప్రాధాన్యాన్ని సాధ్యమైనంతవరకూ తగ్గించి చూడాలనేది ఆ పార్టీ ఉద్దేశం. అందువల్ల మద్దతు చెప్పినా మాట వరసకే పరిమితమైంది. మిగిలిన కొన్ని పార్టీల నుంచి కూడా ద్వితీయ శ్రేణి నాయకులే వచ్చారు. టీ జాక్ కు కార్యకర్తలు లేరు. పార్టీలకు కార్యకర్తలున్నా నాయకులే తరలివచ్చారు. కార్యకర్తలను విస్మరించారు. అదే సమయంలో ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక ప్లాన్, రిజర్వేషన్ అంటూ కొన్ని వర్గాలను సభకు దూరం చేసేందుకు ప్రయత్నించింది. టీ జాక్ కార్యాచరణపై కూడా రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదు. అందుకే ఐక్య సంఘటన దిశలో నడవాల్సిన సమయంలోనూ అనుమానాలు, సందేహాలతో పరస్పరం సహకరించుకునే ధోరణి లోపించింది. కోదండ రామ్ పార్టీ పెడతారా? ఆయన ఏ లైన్ తీసుకుంటారు? ఏ పార్టీ ఎటువంటి వైఖరితో ముందడుగు వేస్తుంది? వంటి అంశాలపై తెలంగాణలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అందువల్ల రాజకీయపార్టీలు ఒకటే మాట..ఒకటే బాటగా కలిసి నడిచేందుకు సందేహిస్తున్నాయి.

సర్కారీ సంబరాలు...

భారీ ప్రచారంతో , ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తుందనుకున్న కొలువుల కొట్లాట సభ తేలిపోవడంతో టీఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. కోదండరామ్ కు ఉన్న క్రెడిబిలిటీ , విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల్లో నెలకొంటున్న అసంతృప్తి, ఆగ్రహం దృష్ట్యా కొలువుల కొట్లాట సభను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. సాధ్యమైనంతవరకూ ఈ సభ జరగకుండా చూసేందుకు అనేకరకాల ఆటంకాలు సృష్టించింది. చివరికి న్యాయస్థానం జోక్యంతోనే సభకు అనుమతి లభించింది. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువకులు తరలిరాకుండా చూడాలని అన్యాపదేశంగా పోలీసులకు సూచనలు అందాయి. హైదరాబాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి రావడానికి మాత్రం పెద్దగా ఆటంకాలు కల్పించలేదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఉలిక్కి పడింది. సభ భారీగా విజయవంతమైతే విపక్షాలు ఏకమయ్యేందుకు, ఈ తరహా సభలు మరిన్ని జరిపేందుకు ప్రయత్నిస్తాయని ప్రభుత్వం ఆందోళనకు గురైంది. కానీ ఆదిలోనే హంసపాదులా జాక్ బలహీనతలు, విపక్షాల అనైక్యత తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఆవేశంతో రగిలిపోయే యువతరాన్నే కదిలించలేకపోతే అనేక ప్రలోభాలతో ముడిపడిన ఓటర్లను ఆకట్టుకోవడం ఈ విపక్షాల వల్ల సాధ్యమవుతుందా? అంటూ టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించుకొంటున్నారు. టీజాక్, ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుని తమ కార్యాచరణను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలకు గడువు ఉంది. టీఆర్ఎస్ కు చెక్ చెప్పాలన్నా, బలమైన పోటీని ఇవ్వాలన్నా ఇప్పట్నుంచే సిద్ధం కావాలి. అందుకు సమగ్ర వ్యూహం, సరైన కార్యాచరణ తో కలిసి కదిలితేనే ప్రయోజనం. టీఆర్ఎస్ విధానాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే కొంత అసంతృప్తి నెలకొంటున్న మాట వాస్తవం. అయితే అది ఇంకా తీవ్ర వ్యతిరేకత స్థాయికి చేరలేదు. పైపెచ్చు విపక్షాలు కేసీఆర్ కంటే మంచి చేయగలవన్న భరోసా తో కూడిన ప్రత్యామ్నాయం ప్రజల ముందు కనిపించడం లేదు. అందువల్ల ఏకోన్ముఖంగా ప్రస్థానిస్తూ ఐక్యతను చాటుకుంటే తప్ప ప్రజల విశ్వాసం చూరగొనడం విపక్షాలకు సాధ్యం కాదు.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News