కాశ్మీర్ లో కొత్త సమస్య ఇదే...!

Update: 2017-11-02 17:30 GMT

జమ్మూ కాశ్మీర్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది 370వ అధికరణం. రాజ్యాంగంలోని ఈ అధికరణం రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తోంది. రక్షణ, విదేశీ, కమ్యునికేషన్లు మినహా మిగిలిన అన్ని అంశాల్లో రాష్ట్రానికి అధికారాలు కల్పిస్తోంది ఈ అధికరణం. కేంద్రం పాత్ర పరిమితంగా ఉంటుంది. భారత్ లో కాశ్మీర్ విలీనం సందర్భంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 370వ అధికరణాన్ని తీసుకొచ్చారు. దీనిని రద్దు చేయాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది. తాజాగా రాష్ట్రానికి సంబంధించిన 35ఎ అధికరణం పై చర్చ జరుగుతోంది. దీనిపై దాఖలైన వ్యాజ్యాన్ని మూడు నెలల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది.

మూడు నెలల పాటు వాయిదా....

జమ్మూకాశ్మీర్ లో ఎవరు శాశ్వత నివాసితులో? ఎవరు కాదో? నిర్థారించే ప్రత్యేక అధికారం శాసనసభకు కల్పిస్తోంది ఈ అధికరణం. ఇది పౌరుల పట్ల వివక్ష చూపిస్తోందని ఒక స్వచ్ఛంద సంస్థ, తమ పిల్లలు అనేక హక్కులు కోల్పోతున్నారంటూ ఇద్దరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాలను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తోంది. కాశ్మీర్ పై చర్చలకు కేంద్రం ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమించిన నేపథ్యంలో విచారణను ఆరు నెలల పాటు వాయిదా వేయాని కేంద్ర తరుపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. అయితే విచారణను మూడునెలల పాటు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం లోని ధర్మాసనం నిర్ణయం వెలువరించింది.

రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా....

విలీనం సందర్భంగా నాటి ప్రధాని నెహ్రూ, కాశ్మీర్ నేత షేక్ అబ్దుల్లా మధ్య 1952 జులైలో ఢిల్లీలో జరిగిన చర్చల సందర్భంగా 35ఎ అధికరణం రూపు దాల్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం దఖలు పడింది. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 35ఎను రాజ్యాంగంలోచేర్చారు. ఈ మేరకు అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1954 మే 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికరణం ప్రకారం 1954 మే 14వ తేదీ కన్నా ముందు రాష్ట్రంలో జన్మించిన లేదా రాష్ట్రంలో పదేళ్ల పాటు నివసించిన వ్యక్తి మాత్రమే శాశ్వత నివాసి అవుతాడు. అతను మాత్రమే స్థిర చరాస్తులు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ సాయం పొందడానికి అర్హుడు. అయితే కశ్మీరీ మహిళ కాశ్మీరేతరుడిని పెళ్లి చేసుకుంటే ఆమె రాష్ట్రంలో స్థిరచరాస్థులు కలిగి ఉండరాదు. ఆమె పిల్లలకు కూడా ఎలాంటి హక్కులు, సౌకర్యాలు ఉండవు. పిల్లలకు శాశ్వత నివాసి హోదా కూడా ఉండదు. ఈ నిబంధనను 2002లో జమ్ముకాశ్మీర్ హైకోర్టు కొట్టివేసింది.

ఎవరి వాదనలు వారివే.....

35ఎ అధికరణం అనుకూలురు,వ్యతిరేకులు వాదనలను పరిశీలిస్తే లోతైన అవగాహన కలుగుతుంది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రపతి ఉత్తర్వులతో రాజ్యాంగంలో కొత్త అధికరణను ఎలా చేరుస్తారని 2015 జులైలో ఓ సంస్థ సుప్రీంకోర్టులోవ్యాజ్యం దాఖలు చేసింది. 368వ అధికరణం ప్రకారం పార్లమెంటులో విస్తృత చర్చ అనంతరమే కొత్త అధికరణం చేర్చాలి. సవరణలను చేయాలి. అలా కాకుండా ఏకపక్షంగా 35ఎ ని చేర్చారన్నది వారి అభియోగం. 35ఎ అధికరణం మహిళల పట్ల వివక్ష చూపుతుందని, ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విరుద్ధమంటూ చారువతి ఖన్నా అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కశ్మీర్ యువకుడిని కాశ్మీరేతర యువతి వివాహమాడితే ఆ యువకుడి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. అయితే కాశ్మీరీ యువతి అదే పని చేస్తే ఆమె హక్కులను కోల్పోతుంది. ఇది స్త్రీ, పురుషుల పట్ల వివక్ష చూపించడమే అవుతుందని చారువతి ఖన్నా వాదిస్తున్నారు. ముస్లిం మహిళలతో పాటు వాల్మీకీలు, పశ్చిమ పాకిస్థాని శరణార్థులు కూడా నేటికీ శాశ్వత నివాసులు కాలేకపోతున్నారు. ఈ వాదనలను సుప్రీంకోర్టుముందు సమర్థంగా వినిపిస్తున్నారు.

ప్రత్యేక హక్కులు....

35ఎ అధికరణను సమర్థిస్తున్న వారి వాదన మరో రకంగా ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కశ్మీర్ భారత్ లో విలీనం అయినందున ఇప్పుడు దానిని తొలగిస్తే కొత్త సమస్యలు ఏర్పడతాయని వారు వాదిస్తున్నారు. కశ్మీర్ రాజకీయ ముఖచిత్రం కూడా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 35ఎ అధికరణాన్నితొలగిస్తే ఇక్కడి వారితో కశ్మీరేతర మహిళలు, పురుషులు చేసుకుంటారని, తద్వారా ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన కాశ్మీర్ స్వరూప స్వభావాలు మారిపోతాయనిచెబుతున్నారు. వివాహ సంబంధాల ద్వారా రాష్ట్రంలో ఆస్తులు సమకూర్చుకోవడం, ఓటింగ్ హక్కులు పొందడం ద్వారా యావత్ రాష్ట్రం మారిపోతుందని, ఫలితంగా ప్రత్యేక ప్రతిపత్తికి అర్థం లేకుండా మారిపోతుందని వాదిస్తున్నారు. 35ఎ అధికరణనను సాకుగాచూపి 370వ అధికరణాన్ని కూడా భవిష్యత్తులో రద్దు చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హక్కులు ఒక్క కాశ్మీర్ కే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాలూ ఈ హక్కులు పొందుతున్నాయని గుర్తు చేస్తున్నారు. 371 (జీ) అధికరణం కింద ప్రత్యేక రక్షణలున్నాయి. గిరిజన భూములకు సంబంధించిన హక్కులనుకాపాడేందుకు 1/70 చట్టం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక రక్షణలున్నాయని, ఈ నేపథ్యంలో ఒక్క కాశ్మీర్ పై ఎందుకు దృష్టి పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

సున్నితమైన అంశమంటూ....

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా, సున్నిత అంశమని, సుదీర్ఘ చర్చ జరగాల్సి ఉందని మాత్రమే పేర్కొంటోంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ బీజేపీ శాఖ మాత్రం అసలు 370వ అధికరణనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. దశాబ్దాల కాశ్మీర్ సమస్యకు ఈ అధికరణ రద్దు ఒక్కటే పరిష్కారమార్గమని చెబుతోంది. దీంతో కాశ్మీరీల్లో కొత్త అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏదో ఒక పేరుతో ఈ అధికరణాలను రద్దుచేసే కుట్రలో భాగంగా కేంద్రం పావులు కదుపుతోందని కాశ్మీరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన సరిహద్దురాష్ట్రంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News