కార్పొరేట్ సీఎం నుంచి ఆశించడం అత్యాశేనా?

Update: 2017-10-21 14:30 GMT

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన మాట వాస్తవం. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. నిజానికి ఈ హామీలు అమలైతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరో రకంగా ఉండేది. ప్రత్యేక హోదా వంటి అంశాలను పక్కనపెట్టినా చిన్నపాటి హామీలను అమలు చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రాన్ని రాష్ట్రం గట్టిగా నిలదీయలేక పోతోంది. ఇవేమీ నెరవేర్చలేనంత పెద్ద హామీలు కావు. పెద్దగా ఆర్థిక వనరులుకూడా అవసరం ఉండదు. రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తీసుకు రాలేకపోతుందన్న విమర్శలు ఉన్నాయి. మరో పక్క విద్యారంగం, పారిశ్రామిక రంగం పరిస్థితి అద్వాన్నంగా ఉంది. అవినీతి జడలు విప్పుతోంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం తమదే ఆదర్శ ప్రభుత్వం ఢంకా భజాయించి చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కీలక హామీలు అమలు ఏదీ...?

విశాఖ రైల్వే జోన్ అంశం ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మౌనాన్ని ఆశ్రయించారు, దీనిపై కేంద్రాన్ని నిలదీయడం కాదు కదా... ప్రస్తావించే సాహసాన్ని కూడా చేయలేకపోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిభాబు ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలకే పరిమితమవుతున్నారు. విభజన చట్టంలోని మరో కీలకాంశం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం. దీని నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. రాయలసీమ ముఖచిత్రమే మారిపోతుంది. రాయలసీమ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి బీరాలు పలకడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నిర్దిష్టంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం వద్ద సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ పట్టుబట్టి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టును సాధించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. వైఎస్ అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగి,.. వైఎస్ అనంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు గాని, తనకు తాను కార్యదక్షుడిగా ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని మన్నవరం ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లలేక పోయారు. మంజూరైన... నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టును కొనసాగించడంలో విఫలమైన ముఖ్యమంత్రి కొత్త ప్రాజెక్టు గురించి బీరాలు పలకడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో విశాఖలో పెద్దయెత్తున భాగస్వామ్య సదస్సు నిర్వహించి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని ఆర్భాటంగా ప్రకటించారు. వాటిల్లో ఒక్కటి కూడా కార్యకలాపాలు ప్రారంభించిన దాఖలాలు లేవు. తాజాగా రాష్ట్రంలో 813 పరిశ్రమలకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని, 89 పరిశ్రమలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, 485 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైందని, 54 పరిశ్రమల్లో యంత్రాలను సిద్ధం చేశారని ఈ నెల 17న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలు ఎంతవరకూ వాస్తవమో వారికే తెలుసు. వీటినిచూస్తుంటే గతంలో జన్మభూమి గణాంకాలు గుర్తుకు రాక మానదు. భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా 2.84 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 4.34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఇదే సమావేశంలో అధికారులు వెల్లడించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యధారాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రికి ఇష్టమైన మాటలు చెప్పి అధికారులు మ..మ అనిపిస్తున్నారు. నిజంగా ఇన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఎన్నికల ప్రచార సమయంలో జాబు రావాలంటే బాబు రావాలంటూ టీడీపీ వర్గాలు హోరెత్తించాయి. అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా నాలుగేళ్లు కావస్తున్నా కనీసం నాలుగు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నది చేదు నిజం.

ఎందుకింత భూసేకరణ?

అవినీతిపై పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదైనా సమస్య, అవినీతిపైనా పరిష్కార వేదిక 1100 నెంబరుకు ఫోన్ చేసి చెబితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. అనుకున్న పని.. అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ ను వినియోగిస్తున్నామని మరో పక్క ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉందని టీడీపీ కార్యకర్తలే అంగీకరించ లేరు. పైసా లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరిగే పరిస్థితి ఉందని ఏ పౌరుడూ చెప్పలేడు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు కమిషన్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎసీబీ దాడులు కూడా అవినీతి అధికారులను ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో భూ దోపిడీ జరుగుతుంది. నాలుగువేల ఎకరాలు సరిపోయే మచిలీపట్నం పోర్టుకు ఏకంగా 33 వేల ఎకరాలను సేకరించారు. ఇంత భూమి అవసరమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అసలు మచిలీపట్నం పోర్టులో ఈ స్థాయిలో కార్యకలాపాలు సాగుతాయన్నదికూడా ప్రశ్నార్థకమే. వందల కిలోమీటర్ల దూరంలోనే అటు విశాఖ, ఇటు కృష్ణపట్నం లో పెద్ద ఓడరేవులు ఉన్నప్పుడు మధ్యలో ఉన్న మచిలీపట్నానికి అంత భూమి అవసరమా? అన్న అనుమానాలు కలగకమానవు. పోర్టు పేరుతో రియల్ ఎస్టేట్ చేయడమే అసలు లక్ష్యమన్న విమర్శలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇదే తరహాలో ఉంది. పక్కనే అన్ని హంగులతో విశాఖ విమానాశ్రయం ఉన్నప్పటికీ సమీపంలోనే మరో విమానాశ్రయం అవసరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు భోగాపురం ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు ఉంటాయా అన్నది కూడా అనుమానమే. దీనికోసం కూడా వేల ఎకరాలు సేకరించారు. దీనికన్నా విశాఖ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేయడం ఉత్తమమన్న నిపుణుల అభిప్రాయాలను, సూచనలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం విచారకరం.

విద్యారంగంలోనూ.....

మరో పక్క ఏపీ విద్యారంగం పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది. శ్రీ చైతన్య, నారాయణలకే మొత్తం విద్యారంగాన్ని గుత్తకు ఇచ్చినట్లు కనపడుతోంది. చదువుల పేరుతో విద్యార్థులను, ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇవి వేధిస్తున్నా ఇదేమి అని అడిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి, నారయాణ విద్యాసంస్థల అధిపతి వియ్యంకులు అయినందున నారాయణ విద్యాసంస్థల వ్యవహారాలను నియంత్రించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్న అభిప్రాయాన్ని తోసి పుచ్చలేం. ప్రతిష్టాత్మక మైన నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తోంది. దీంతో కలవరం చెందిన ముఖ్యమంత్రి కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారంటే.... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది. అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్ వంటి కార్పొరేట్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలను ప్రారంభించారు. వీటి విషయంలో ముఖ్యమంత్రి అపరమిత చొరవ చూపారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసే ఈ విద్యా సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించారు. దీని బదులు ప్రభుత్వ రంగంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థను ముఖ్యమంత్రి ప్రారంభించి ఉంటే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేది. కార్పొరేట్ ముఖ్యమంత్రి నుంచి ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో...!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News