కారు-సైకిల్ దోస్తీ.. లెక్క కూడా ఇదే!!

Update: 2017-10-28 01:30 GMT

తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతాయో ఎవ‌రికీ అర్థ‌మవ్వ‌డం లేదు! ఇప్ప‌టికే టీటీడీపీలో రేవంత్ రెడ్డి రేపిన దుమారానికి ఎప్పుడు ముగింపు ప‌డుతుందోన‌ని అంతా ఎదురుచూస్తున్నారు. రేవంత్ టీడీపీని వీడ‌డం ఒక్కే మిగిలి ఉంది. రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అక్క‌డ టీఆర్ఎస్‌తో పొత్తుకు అడ్డుచెప్పే టీడీపీ నాయ‌కులు లేన‌ట్టే. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌-టీటీడీపీ మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం జ‌రిగింద‌నే ప్ర‌చారం తెలంగాణ‌లో ఊపందుకుంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అస్థిత్వాన్ని కోల్పోతున్న టీడీపీ ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. కొంద‌రు నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌-టీడీ పీ పోటీచేసే అవకాశాలులేక‌పోలేదు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌ను స‌హ‌జంగా 5 శాతం ఓట్లే అటూ ఇటూగా నిర్ణ‌యిస్తాయి. తెలంగాణ‌లో టీడీపీ ఎంత దీన‌స్థితిలో ఉన్నా ఆ పార్టీకి ఎలాగూ 5-7 శాతం వ‌స్తాయ‌ని కేసీఆర్ లెక్క‌ల్లో తేలింది. దీంతో ఇది ఎక్క‌డ త‌న‌కు దెబ్బ‌కొడుతుందో అన్న డౌట్‌తో ఉన్న కేసీఆర్ టీడీపీ నాయ‌కుల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్నా ధైర్యంతో అయితే లేరు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ఇటీవ‌ల టీడీపీతో పొత్తు ప్ర‌తిపాద‌న తెచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీటీడీపీలో పెద్ద గంద‌ర‌గోళ‌మే జ‌రిగింది. ఇక పొత్తు కుదిరితే టీడీపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో కేసీఆర్ ఇప్ప‌టికే నిర్ణ‌యించేశార‌ట‌.

రేవంత్ రెడ్డి వెళ్లిపోవడానికి.....

టీడీపీకి - టీఆర్ఎస్‌కి మ‌ధ్య ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి ఉన్న విష‌యం తెలిసిందే! కొంత కాలం నుంచి టీటీడీపీ నేత‌ల వ్య‌వ‌హార శైలితో విసిగివేశారిపోయిన ఆయ‌న‌.. ఇప్పుడు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆయ‌న పార్టీ మార‌డాని కార‌ణం.. టీ టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించడమే అని కొందరు చర్చించుకుంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఇప్పటికీ ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును ఉపయోగించుకోవడా నికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన చేసినట్టు సమాచారం. నిజానికి టీ టీడీపీలోని నాయకులను పూర్తిగా తన పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వాలని భావించిన కేసీఆర్… అలా చేయడం వల్ల టీ టీడీపీ ఓటు బ్యాంకు తమకు ఉపయోగపడే అవకాశం లేదని అనుకున్నారట. అందుకు ' వెల్‌కం' వ్యూహాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. టీటీడీపీ నాయకులందరినీ టీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ లోని కొందరిని టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అరువు తెచ్చుకున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదను మోయాల్సి వస్తుందని కేసీఆర్ భావించారట. అదే పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నాయకులు సైతం ఏమీ అభ్యంతరం చెప్పలేరన్నది కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది.

టీడీపీకి ఇచ్చే సీట్ల లెక్క ఇదే...

ఈ క్రమంలోనే ఆయన టీ టీడీపీకి 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. కేసీఆర్, టీటీడీపీతో పొత్తు పెట్టుకోవాలని దాదాపు డెసిష‌న్‌కు వ‌చ్చిన‌ట్టే టీపాలిటిక్స్ అండ్ టీఆర్ఎస్ వ‌ర్గాల టాక్‌. పొత్తు ఫిక్స్ అయితే కేసీఆర్ టీడీపీకి ఖ‌మ్మం ఎంపీ సీటు ఖాయంగా ఇవ్వ‌నున్నారు. ఇక్క‌డ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు టీడీపీ త‌ర‌పున బ‌రిలో ఉండొచ్చు. ఇక మ‌రో ఎంపీ సీటు కోసం టీడీపీ ప‌ట్టుబ‌డితే మ‌ల్కాజ్‌గిరి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎమ్మెల్యే సీట్ల విష‌యానికి వ‌స్తే స‌త్తుప‌ల్లి(సండ్ర పార్టీ మార‌క‌పోతే), తుంగ‌తుర్తి, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొన్ని సీట్లు, భువ‌న‌గిరి, న‌ర్సంపేట, సూర్యాపేట‌తో పాటు మ‌రికొన్ని సీట్లు ఇస్తార‌ని తెలుస్తోంది. అటు టీడీపీ ఓటు బ్యాంకు.. ఇటు టీఆర్ఎస్ ఓటు బ్యాంకు త‌మ‌కే వ‌స్తే.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కారు దూసుకుపోవ‌డం ఖాయ‌నేది కేసీఆర్ వ్యూహం!!

నాడు ఆంధ్రా పార్టీ ముద్ర‌....నేడు అదే పార్టీతో పొత్తా..!

కేసీఆర్ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీని ఆంధ్రా పార్టీ అని ముద్ర‌వేశారు. ప‌దేప‌దే విమ‌ర్శ‌ల్లో టీడీపీకి ఆంధ్రా పార్టీ ముద్ర‌వేయ‌డంతో పాటు చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గమైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని కూడా టార్గెట్‌గా చేసుకుని ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆ త‌ర్వాత కేసీఆర్ త‌న అధికారం కాపాడుకునేందుకు ఆ మాట‌ల‌న్ని గాలికి వ‌దిలేస్తున్నారు. నాడు క‌మ్మ వ‌ర్గాన్ని విమ‌ర్శించిన కేసీఆర్ నేడు రెడ్ల‌ను ఎదుర్కొనేందుకు వారితోనే క‌లుస్తున్నారు. ఆ వ‌ర్గ ఎమ్మెల్యేలంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకున్నారు. తాను సీఎం అయిన వెంట‌నే రామోజీ ఫిల్మ్‌సిటీని ల‌క్ష అర‌కుల‌తో దున్నిస్తాన‌న్న కేసీఆర్ ఇప్పుడు అదే రామోజీకి క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీపై కూడా తాను చేసిన విమ‌ర్శ‌ల‌ను గాలికి వ‌దిలేసి చివ‌ర‌కు అదే పార్టీతో పొత్తుకు రెడీ అవుతున్నారు. మ‌రి వీటిన్నింటిని రేపు ఓట‌ర్లు మైండ్‌లో పెట్టుకుంటే కేసీఆర్ ప‌రిస్థితి ఎలా ? ఉంటుందో ?

Similar News