కామ్రేడ్లకు కాంగ్రెసు కష్టాలు

Update: 2017-10-16 16:30 GMT

సిద్ధాంత భూమికతో ముందుకు వెళతామని ప్రవచించే బారత కమ్యూనిస్టు పార్టీల్లో ప్రధాన పార్టీ అయిన సీపీఎం ను వర్గ విభేదాలు కుంగదీస్తున్నాయి. అసలు సిద్దాంతానికే ఎసరు వస్తోంది. కాంగ్రెసు కల్చర్ కష్టాలు తెచ్చి పెడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసుతో కలిసి నడవాలా?లేదా తమ సొంత బలంతోనే పోరాటం సాగించాలా? ఎటూ తేల్చుకోలేని దురవస్థ పార్టీని వెన్నాడుతోంది. 1960 దశకంలో తీవ్రస్థాయిలో అంతర్గతంగా చోటు చేసుకున్న ముఠాతగాదాలు, భావ వైరుద్ధ్యాలను మరోసారి గుర్తుకు తెస్తోంది. ఈ గొడవలో ఎవరు గెలిచినా పార్టీ మాత్రం నష్టపోయే సూచనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అధినాయకత్వంలోని రెండు వర్గాలు బలాబలాలు తేల్చుకునే ప్రయత్నంలో , అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ప్రాబల్యం మరింత బలహీనపడే సూచనలు గోచరిస్తున్నాయి. గతంలో ఒకసారి ఉమ్మడి వామపక్ష పార్టీ చీలడానికి కాంగ్రెసు కారణమైంది. మితవాద కమ్యూనిస్టులను దువ్వడం ద్వారా పార్టీలో అంతర్గత విభేదాలను రాజేసి, రష్యా మద్దతును కూడగట్టి వామపక్ష ఉద్యమాన్ని కొంతమేరకు దెబ్బతీసిన ఘనత కాంగ్రెసు కు ఉంది. తాజాగా ప్రేమతో సీపీఎం ను లాలిస్తూ మరోసారి ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కాంగ్రెసు కారణమవుతోంది. ఆరో దశకం వరకూ కాంగ్రెసు పార్టీకి దేశంలో ఏకైక ప్రత్యామ్నాయంగా వామపక్ష ఉద్యమం బలమైన సవాలు విసురుతుండేది. ఒకవైపు విప్లవపోరాటాలకు మద్దతు నిస్తూ మరోవైపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బలపడేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ ప్రజాక్షేత్రంలో బలపడుతూ వచ్చింది. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపిన ఘనత కూడా వామపక్షానిదే. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పోరాటాలను చూస్తే ప్రజాస్వామ్యం పట్ల వారికి ఏమాత్రం నమ్మకం ఉన్నట్లు కనిపించదు. అయితే భారతదేశంలో విప్లవం ద్వారా రాజ్యాధికారం సాధ్యంకాని అంశమని గుర్తించిన కమ్యూనిస్టులు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పాల్గొనడం ప్రారంభించారు. తద్వారా రాజకీయంగా ప్రబలమైన శక్తిగా ఎదిగారు. ఇదొక తెలివైన ఎత్తుగడగానే చెప్పుకోవాలి. అనువుగాని చోట ఆచరణాత్మకమైన వ్యూహం మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రపంచ కమ్యూనిస్టు పంథాతో సంబంధం లేని ఒక స్వతంత్ర గుర్తింపును తెచ్చుకోగలిగారు.

ఏనాటి నుంచో....

సమస్యలపై పోరాటాలతో కార్మిక,కర్షక, విద్యార్థి, యువజన వర్గాల్లో మంచి పేరు కూడా వచ్చింది. కానీ ముఠా తగాదాలు, భావ వైరుద్ధ్యాలతో 1964 లో పార్టీ రెండు ముక్కలైంది. ఇందుకు దేశీయ కమ్యూనిస్టుల స్వయంక్రుతంతోపాటు రష్యా, చైనా కమ్యూనిస్టు భావజాలంలోని విభేదాలు ఒక కారణం. చిన్నన్న, పెద్దన్నలుగా కమ్యూనిస్టులు చీలిపోవడానికి దేశంలోని కాంగ్రెసు పార్టీ మరో కారణం. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్(సీపీఎస్యూ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లు అంతర్జాతీయ కమ్యూనిస్టులకు మార్గదర్శకత్వం వహించేవి. అక్కడ ఆ రెండు పార్టీలదే ప్రభుత్వం. దాంతో అధికార బలం, బలగంతో ప్రపంచంలోని మిగతా కమ్యూనిస్టుపార్టీలను కూడా శాసించే స్థాయి కలిగి ఉండేవారు. తీవ్రంగా ప్రబావితం చేసేవారు. నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెసు ప్రభుత్వం రష్యాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంది. కూటమిలో చేరకపోయినా బలమైన మిత్రపక్షంగా మారిపోయింది. దీంతో భారత కమ్యూనిస్టులు ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబించడానికి రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వం ఇష్టపడేది కాదు. మరోవైపు చైనా సరిహద్దు వివాదాలతో భారత్ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించేది. అందువల్ల భారత కమ్యూనిస్టులు భారత ప్రభుత్వంతో సాయుధ పోరాటం సాగించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ భావించేది. బారత్ లో నక్సల్బరీ ఉద్యమాలు, విప్లవపోరాటాలకు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతునిచ్చేది . నిజానికి చైనా, రష్యా కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఆయా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేది తప్పితే భారత్ లో కమ్యూనిస్టు ఉద్యమం ప్రాభవం కోణంలో కాదు. ఆయుధాలు అమ్ముకోవడానికి, అంతర్జాతీయంగా భారత ప్రభుత్వ రూపంలో బలమైన మిత్రుడు అవసరమని రష్యా కోరుకుంటే, భారత్ ను అస్థిర పరచడానికి ఇక్కడి కమ్యూనిస్టులను ఎంతవరకూ వాడుకోవచ్చనేది చైనా ఆలోచన. సిద్దాంత విభేదాలు అని ముసుగేసుకొని ఈ రెండు భావజాలాల మధ్య చీలిపోయి కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా(సీపీఐ) 1964 లో రెండు ముక్కలైంది. ఒకటి పూర్వ రూపంలో సీపీఐగా ఉండగా, మరొకటి సీపీఎం( కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్క్సిస్టు)గా రూపాంతరం చెందింది. సీపీఐ భారతప్రభుత్వానికి, రష్యా భావజాలానికి లోపాయి కారీ మద్దతు దారు.సీపీఎం చైనా కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి లోపాయికారీ మద్దతు దారు. చైనా 1962లో భారత్ పైనే దాడి చేసినా ఈ వర్గం మాత్రం చైనా చర్యలనే సమర్థించింది. 1971లో భారత, పాక్ యుద్దాల్లో చైనా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపినా సీపీఎం కు ఏమాత్రం తప్పు కనిపించలేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఇందిర ఎమర్జెన్సీ విధించినా అప్పటికే ప్రబుత్వంతో అంటకాగడం మొదలు పెట్టిన సీపీఐ కి దాంట్లో తప్పు కనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే స్వయంకృతమైన తప్పిదాలతో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటం అప్పుడే మొదలైందనవచ్చు. కార్మిక,కర్షక వర్గాలకు మద్దతు గా నిలుస్తూ ఉద్యమాలు చేస్తారన్న అంశం మినహాయిస్తే దేశ ప్రయోజనాల విషయంలో స్వతంత్ర వైఖరి అనుసరిస్తారనే విశ్వాసం ప్రజల్లో కోల్పోయారు. అందుకే రష్యా, చైనాల్లో వర్షం వస్తే ఇండియాలో గొడుగు పడతారనే అపప్రధను మూటగట్టుకున్నారు.

చారిత్రక తప్పిదాలు.....

మారుతున్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకోకుండా అవకాశాలను పోగొట్టుకోవడం వామపక్షాలకు అలవాటుగా మారింది. పిడివాదంతో చేజేతులారా పార్టీ ని బలహీనపరుచుకుంటుంటారు. కంప్యూటరీకరణ మొదలైన తొలిదశలో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, మారుతున్న మధ్యతరగతి మనస్తత్వాన్ని గ్రహించకపోవడం ప్రధానలోపంగా పరిణమించింది. విద్యార్థి లోకంలో కెరియరిజం పెరిగింది. విద్యార్థి జీవితాన్ని కెరియర్ కు పునాదిగా మార్చుకోవాలనే తపన బలపడింది. అయినా ఇంకా స్ట్రగుల్ చేయాలనే బావనతోనే వామపక్షాలు నడవడంతో కొత్తగా పార్టీకి బలం చేకూరడం లేదు. ఒకనాడు దేశవ్యాప్తంగా విద్యార్థి, యువతరాన్ని కుదిపేసిన వామపక్ష భావజాలం ఈ రోజున అడుగంటి పోయింది. కొత్తగా యువకులెవరూ ఆయా పార్టీల్లో చేరేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు కేంద్రంలో రాజకీయాధికారాన్ని చేపట్టేందుకు 1996లో అవకాశం వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో సీనియర్ నేత జ్యోతిబసును ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని కోరినా సీపీఎం తిరస్కరించింది. దేశవ్యాప్తంగా విస్తరించే ఒక అవకాశాన్ని, దేశానికి వామపక్ష పాలనను అందించే అపురూప ఘట్టాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత కాలంలో ఇదొక చారిత్రక తప్పిదమని విచారించారు. ఇలాంటి చారిత్రక తప్పిదాలు వామపక్షాల చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి.

ముదురుతున్న ముసలం....

చీలికలు పీలికలు, సిద్ధాంతరాద్ధాంతాలు, ప్రభుత్వాల ఏర్పాటు, కూల్చివేతలు, మద్దతులు, ఉపసంహరణలు .. ఇలా ..అనేక విధాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో కాంగ్రెసు ఒక భాగమై పోయింది. సీపీఐ, సీపీఎంలుగా వామపక్ష ఉద్యమం విడిపోవడం, ఎమర్జెన్సీ, ఇండో పాక్ , ఇండో చైనా యుద్ధాల వరకూ అన్నిటా భిన్న కోణాల్లో కాంగ్రెసుతో ఏకీభవించి, విభేదించిన సంస్కృతి వామపక్షాలకు ఉంది. 2004లో యుపీఏ ప్రభుత్వం ఏర్పాటులో సీపీఎం కీలక పాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో 5.6 శాతం ఓటు షేరుతో 43 లోక్ సభ స్థానాలు సాధించింది. కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏకి మద్దతు ఇవ్వడంతో కేంద్ర సర్కారు ఏర్పాటైంది. అమెరికాతో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ల ఒప్పందం కుదుర్చుకొంటోందని ఆగ్రహించి 2008లో మద్దతు ఉపసంహరించింది. దీనివల్ల కాంగ్రెసు కు నష్టం ఏమీ జరగలేదు. కానీ సీపీఎంకు చావు దెబ్బతగిలింది. 2009 ఎన్నికల్లో సీట్లు, ఓట్లు చేజారిపోయాయి. పశ్చిమబంగలో సీపీఎం స్థానాన్ని తృణమూల్ ఆక్రమించింది. కాంగ్రెసుకు అండగా నిలిచింది. 2011లో 34 సంవత్సరాల వామపక్ష పాలనకు పశ్చిమబంగలో చరమగీతం పాడేసింది. భారత దేశానికి అంతర్జాతీయంగా మద్దతు నిస్తున్న అమెరికా విషయంలో అంతటి పట్టుదల కు పోవడం, భారత్ తో శత్రుత్వం కనబరిచే చైనా పట్ల సానుకూల ధోరణి సీపీఎం లోపభూయిష్ట విధానాలుగానే చెప్పుకోవాలి. 2014కి వచ్చేనాటికి బలం మరింత క్షీణించి ప్రజాదరణ కోల్పోయి కేవలం 9 లోక్ సభ స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెసు ప్రాతిపదికగా వర్గ రాజకీయం మొదలైంది. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కాంగ్రెసుతో కలిసి బీజేపీపై పోరాటం చేయాలని కోరుతుంటే, మాజీ ప్రధాన కార్యదర్శి కేరళకు చెందిన ప్రకాశ్ కారత్ ససేమిరా అంటున్నారు. ఇరువురి తరఫునా అవును , కాదు అనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఇది పార్టీలోనే పెద్ద చిచ్చుగా మారింది. 34 ఏళ్లపాటు పాలించిన పశ్చిమబంగలో 2016 ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేసిన సీపీఎం మూడోస్థానానికి పడిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలపడింది. కాంగ్రెసు కబంధ హస్తాల్లో చిక్కితే అంతేసంగతులు . ఇంకెంత దిగజారాలి? అని కారత్ పక్షం ప్రశ్నిస్తోంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ కి , కాంగ్రెసు నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రధాన ప్రత్యర్థి. అందుకే అంతటి వ్యతిరేకత. పశ్చిమబంగలో అస్తిత్వం నిలుపుకోవాలంటే కాంగ్రెసును సపోర్టు చేయాలనే అక్కడి క్యాడర్ కోరుతోంది. ఒకవేళ అక్కడ కలిస్తే కేరళలో కాంగ్రెసును విమర్శించడం కష్టం. ప్రతిపక్ష స్థానాన్ని నైతికంగా బీజేపీ చేజిక్కించుకుంటుందేమోనన్న భయం కేరళ కమ్యూనిస్టు పార్టీలో నెలకొంది. ఇప్పటికే బీజేపీ కేరళలో జనరక్ష యాత్ర పేరిట హల్ చల్ చేస్తోంది. వీటన్నిటినీ బట్టి చూస్తే స్థానికంగా ఉండే అవసరాలు, అవకాశాలు తప్ప జాతీయ దృక్పథం, సిద్ధాంతం అనేది మార్క్సిస్టు పార్టీలో లోపించినట్లు స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్తులో మరింత ముదురుపాకాన పడటం ఖాయంగా కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News