కాపుల కథ కంచికి..... ఈ భేటీతో తేలిపోయిందా...?

Update: 2018-01-13 14:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమావేశం ముగిసింది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఏపీ చిట్టామొత్తం ఏకరవు పెట్టారు. పోలవరం నిర్మాణం మొదలు ప్రత్యేక ప్యాకేజీ వరకూ స్పృశించని అంశం లేదు. ప్రధాని కరుణించారో, కాదని వాయిదా వేశారో తెలియదు. సానుకూలంగా స్పందించారనే సగటు సమాధానం వినవచ్చింది. అసలు ఈ మీటింగులో సాధించిందేమిటి? బీజేపీ, టీడీపీ రాష్ట్రనేతల మధ్య ఏర్పడుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడిందా? రాజకీయంగా ఏరకమైన అవగాహనకు వచ్చారు? మూడో వ్యక్తి చొరబడకుండా ముఖాముఖి జరిపిన సమావేశంలో కీలకాంశాలేమిటి? వంటివన్నీ ప్రశ్నలే. ఇద్దరూ సీజన్డ్ పొలిటిషియన్లే కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఎత్తుగడలు, మాటా మంతి జరిగి ఉంటాయనేది ఒక నమ్మకం.

ఒకరికొకరు...

ఒక రకంగా చెప్పాలంటే అటు చంద్రబాబు నాయుడు, ఇటు మోడీ కూడా రాజకీయంగా ఎదురీదుతున్నారు. అప్రతిహతమైన విజయాలను సాధించి బీజేపీ చరిత్రలో లేనన్ని రాష్ట్రాలను కమలదళం పరం చేసినా మోడీ అభద్రతాభావాన్నే ఎదుర్కొంటున్నారు. సాధించిన విజయాలు బలుపా?లేక యాధృచ్ఛికంగా పరిస్థితులు కలిసి వచ్చిన వాపునా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో 2014 విజయాలను బీజేపీ పునరావృతం చేయగలుగుతుందన్న ధీమాను వ్యక్తం చేయలేకపోతున్నాయి పార్టీ శ్రేణులు. సేమ్ చంద్రబాబు ది కూడా అదే పరిస్థితి. ఇచ్చిన హామీలు నెరవేర లేదు. చెప్పిన పనులు సగం కూడా పూర్తి కాలేదు. కేంద్రం డబ్బులు ఇచ్చినా పనులు పూర్తి చేస్తామన్న నమ్మకం కలగడం లేదు. అందుకే బయట దేశాలు, సంస్థల నుంచి తెచ్చుకునే రుణాలు ( ఈఏపీ ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు) 16 వేల కోట్ల రూపాయలను మేం అయిదేళ్లలో పూర్తిగా ఉపయోగించుకోలేం. పాత బకాయిలు చెల్లించుకునేందుకు వాటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా విమర్శలు చేసుకోకుండా ఒకరికొకరు తోడునీడగా ఉండాలనే రాజకీయ అవగాహన మాత్రం ఖచ్చితంగా కుదిరిందని బీజేపీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. వివాదాస్పదంగా మారిన అంశాలను పక్కనపెట్టి ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే కేంద్రప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పటికే పటేదార్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేదని ప్రధాని గుజరాత్ లో తేల్చి చెప్పేశారు. కాపుల విషయంలో పట్టుబడితే కేంద్రానికి జాట్లు,పటేదార్లు, గుజ్జర్లు, ముస్లిం మైనారిటీలు ఇలా అనేక రకాలుగా రిజర్వేషన్ తలనొప్పులు తప్పవు. అందుకే ప్రధాని ముఖాముఖిలో ఈ విషయాన్ని దాటవేసినట్లుగా చెప్పుకోవాలి. అదేమంత పెద్ద అంశం కాదన్నట్లుగా చంద్రబాబు నాయుడు విలేఖరుల సమావేశంలో కూడా ప్రస్తావనకు తేలేదు.

కేసీఆర్ కే తరువాయి పిలుపు...

చంద్రబాబు నాయుడుతో సమావేశం లో కొంత రాజకీయ స్పష్టత వచ్చింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రితో కూడా భేటీకి ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. కొన్ని వివాదాస్పదమైన అంశాలు కేసీఆర్ అజెండాలో ఉన్నాయి. ప్రత్యేకించి ముస్లిం రిజర్వేషన్ల తీర్మానం కేంద్రం వద్ద పెండింగులో ఉంది. మాదిగలకు ప్రయోజనం కల్పించే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశమూ దీర్ఘకాలంగా కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. వీటిని ఏమాత్రం టచ్ చేసేందుకు కేంద్రం సుముఖంగా లేదు. అయితే తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే కొన్ని అంశాల్లో మాత్రం సానుకూలంగా ఉంది. హైకోర్టు విభజన, పునర్విభజన చట్టంలో పేర్కొన్న తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, అసెంబ్లీ సీట్ల పెంపుదల వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది. హైకోర్టు విభజన పై ఈమధ్యనే టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభను స్తంభింప చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ తర్వాత వీటిపై ఒక ప్రకటన వచ్చేలా చూసుకుంటే అటు టీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ప్రయోజనదాయకంగా ఉంటుందనే యోచన చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతోకొంత ఆర్థిక ప్రయోజనాలు, పథకాలపై హామీలను రాబట్టగలిగారు. కేసీఆర్ కూడా బడ్జెట్ కు ముందుగా కలిస్తే కొంత ప్రయోజనం ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు. నిధులు విషయంలో తెలంగాణకు పెద్దగా కొరత లేదు. అదనపు రుణాలు తెచ్చుకునేందుకు అనుమతులు, రాష్ట్రం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు పర్మిషన్లు రావాల్సి ఉంది. వీటిపై ప్రధాని నుంచి స్పష్టమైన హామీ రాబట్టవచ్చంటున్నారు. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జులు ఈ విషయంలో ఇప్పటికే సంప్రతింపులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పీఎంతో భేటీకి ఒకే. కానీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రచారంలోకి తేకుండా పక్కనపెట్టాలని షరతు విధిస్తున్నట్లుగా సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News