కాంగ్రెస్ భస్మాసురులు...!

Update: 2017-12-09 16:30 GMT

ఆనువంశిక రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెసు పార్టీలో పురాణకాలం నాటి భస్మాసురులకూ కొదవ లేదు. పార్టీ కొంత పుంజుకొంటోంది. బలమైన పోటీ ఇస్తోందని ఎప్పుడైనా అనిపిస్తే చాలు పార్టీ నెత్తిన చేయి పెట్టేస్తారు. భగ్గుమని మంటలు పుట్టిస్తారు. ప్రత్యర్థికి అస్త్రాలు అందించి స్వయం వినాశనానికి పాల్పడతారు. 22 ఏళ్ల తర్వాత రాజకీయ సమరంలో సమాన స్థాయి ప్రత్యర్థిగా , బీజేపీకి దీటుగా పోటీనిస్తోంది కాంగ్రెసు. గెలుపోటములు ప్రజాధీనాలు. కనీసం ప్రతి నియోజకవర్గంలోనూ సవాల్ విసిరే స్థాయికి చేరుకోవడం గుజరాత్ కాంగ్రెసులో కొత్త ఉత్సాహం నింపుతోంది. దానిపై నీళ్లు చల్లే పనికి సొంతపార్టీ నాయకులే పూనుకున్నారు. దాంతో గుజరాత్ లో మళ్లీ పొలిటికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టింది బీజేపీ. శల్యసారథుల కారణంగా కాంగ్రెసు చివరిక్షణంలోనూ ఎదురీదుతోంది. కట్టు తప్పిన క్రమశిక్షణ, అపరిమిత స్వేచ్ఛ, బాధ్యత లేని నాయకత్వం వెరసి కాంగ్రెసు పార్టీ కడగండ్ల పాలవుతోంది.

పతాక సన్నివేశంలో పరాచికాలు...

కాంగ్రెసు పార్టీకి అనేక సందర్బాల్లో తమ వాచాలతతో నాయకులు ఇక్కట్లు తెచ్చిపెడుతుంటారు . రాజకీయంగా పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తారు. ఇటువంటి వారిలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, శశిథరూర్, కపిల్ సిబల్, మణిశంకర్ అయ్యర్ వంటి వారిని ముందుగా పేర్కొనాలి. దేశ గౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచే అంశాల్లో ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈరకమైన సెంటిమెంటును వాడుకోవడంలో బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుంది. జమ్ముకశ్మీర్ సమస్య, పాకిస్థాన్ తో ఘర్షణలు, సర్జికల్ స్ట్రైక్స్ , మతము వంటివి ప్రజల మనోభావాలతో ముడిపడినవి. వాటి విషయంలో దేశంలోని మెజార్టీ ప్రజలు ఒకే విధంగా స్పందిస్తారు. ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ జమ్ముకశ్మీర్ దేశంలో అంతర్భాగం, పాకిస్థాన్ ప్రోత్సాహిత తీవ్రవాద శిబిరాలపై దాడులు చేయాలనే విషయంలో రెండో అభిప్రాయానికి తావుండదు. ఇటువంటి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొలిటికల్ మైలేజీ పొందుతోంది. తాము వ్యతిరేక వ్యాఖ్య చేస్తే పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. వికటిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకూ మౌనం వహించడమే కాంగ్రెసు కు శ్రేయోదాయకం. కానీ భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేయడం, జమ్ము కశ్మీర్ విషయంలో వేర్పాటు వాదులకు అనుకూలంగా చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసుకు రాజకీయ నష్టం చేకూర్చాయి. వాటన్నిటినీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలో బీజేపీ చక్కగా వాడుకొని ఓట్లు తెచ్చుకోగలిగింది. తాజాగా మణిశంకర్ అయ్యర్ ప్రధానిని నీచుడు అనడం బడుగు, అట్టడుగు వర్గాలను కించపరచడమే నంటూ గుజరాత్ ఎన్నికలో ప్రధాని ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీశారు. దాంతోపాటు ఎప్పుడో పాకిస్తాన్ టీవీకీ మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ను వివాదాస్పదం చేస్తూ తనను చంపేందుకు సుపారీ ఇస్తున్నారా? అంటూ కాంగ్రెసుపై ధ్వజమెత్తారు . మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం పాక్, భారత సంబంధాలు మెరుగుపడవనే ఉద్దేశంతో మణిశంకర్ వ్యాఖ్యానిస్తే తనను అడ్డుతొలగించాలని పాకిస్తానీయులను కోరారంటూ సొంత వ్యాఖ్యానంతో గుజరాతీయులను ఆకట్టుకునే పనిలో పడ్డారు మోడీ. ఎన్నికల క్లైమాక్స్ లో ఎదురీదుతున్న బీజేపీకి ఇదో బలమైన ఆయుధంగా దొరికింది.

సిబల్ చిక్కులు...

కాంగ్రెసు సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. న్యాయవాది అయిన సిబల్ రామజన్మభూమి సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేయండంటూ పార్టీ విధానానికి భిన్నంగా న్యాయస్థానంలో వాదించడం బీజేపీకి కలిసొచ్చింది. రామమందిర నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం కానీ కాంగ్రెసు నాయకులే దీనిని అడ్డుకొంటూ జాప్యం చేస్తున్నారని గుజరాత్ లో మతపరమైన సమీకరణ చేసేందుకు ఒక అవకాశం చిక్కింది. పైపెచ్చు సిబల్ ఈమధ్య కాలంలో గుజరాత్ తెర వెనక రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పటేళ్ల రిజర్వేషన్ల విషయంలో లోపాయికారీ, అనధికార ఒప్పందంలో భాగంగా కాంగ్రెసు తరఫున సిబల్, పటేళ్ల తరఫున హార్దిక్ పటేల్ ఒక అవగాహనకు వచ్చారు. ఆ తర్వాతనే కాంగ్రెసుకు హార్దిక్ మద్దతు ప్రకటించారు. సిబల్ ఈ రకంగా గుజరాతీ ప్రజలకు కూడా పరిచయం అయిపోయారు. మతపరమైన సిబల్ వైఖరిని కాంగ్రెసుకు అంటకట్టి రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇక్కడ బీజేపీ ప్రయత్నిస్తోంది.

అహ్మద్ పటేల్ ...అత్యుత్సాహం...

సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెసుకు మద్దతిచ్చే కొన్ని ముస్లిం సంఘాలు పోస్టర్లు వేయడం గుజరాత్లో సంచలనాత్మకంగా మారింది. అసలే మతపరమైన సమీకరణ బలంగా కనిపించే రాష్ట్రంలో అహ్మద్ పటేల్ పోస్టర్లతో కాంగ్రెసు అగ్రనాయకత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక బలమైన భావజాలంతో తమ విధానాలకు, సిద్దాంతాలకు ప్రతీకగా గుజరాత్ ప్రజల మైండ్ సెట్ ను మార్చుకుంటూ వచ్చాయి సంఘ్ పరివార్ శక్తులు. తాజాగా నిరుద్యోగం, పారిశ్రామిక, వ్యాపార సంక్షోభం తో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైంది. వ్యవసాయరంగంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బీజేపీకి గట్టి మద్దతు దారులుగా ఉన్న పటేళ్లు పోరాట బాట పట్టారు. ఇవన్నీ కలిసి మతం ముసుగు నుంచి బయటపడి తమ సొంత సమస్యల పై ప్రజలు స్పందించేలా గుజరాత్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లుగా కాంగ్రెసులో ని ఒక వర్గం అత్యుత్సాహం చూపడంతో మళ్లీ మతం జడలు విప్పుతోంది. మళ్లీ పోలరైజేషన్ కు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సమస్యలన్నీ పక్కకు పోయి హిందువుని సీఎం చేయాలంటే బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసుకునే రాజకీయ వ్యూహం అమలవుతోంది. కాంగ్రెసు అప్రమత్తతను కోల్పోయింది. అహ్మద్ పటేల్ సైతం తన అనుచరులను హెచ్చరించి సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో కాంగ్రెసు నెత్తిన అహ్మద్ పటేల్ భస్మాసుర హస్తం కూడా పెట్టేసినట్లవుతోంది. మొత్తమ్మీద రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే అన్న సూక్తిని నిజం చేస్తోంది కాంగ్రెసు నాయకుల ధోరణి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News