కాంగ్రెస్ ఫెయిల్యూర్ కు కారణాలివే?

Update: 2017-12-18 08:30 GMT

గుజరాత్ లో ఓడిపోయినా కాంగ్రెస్ బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిందనే చెప్పాలి. చివరి క్షణం వరకూ కమలనాధులను టెన్షన్ పెట్టింది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ నూ హస్తం పార్టీ చేజార్చుకుంది. అయితే గుజరాత్ లో ఓడిపోయినా రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుందనే చెప్పాలి. ఇంతకీ గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలేంటి.? కర్ణుడి చావుకి కారణాలు అనేకం. గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితి చూసిన తర్వాత ఈ మహాభారత సామెత గుర్తుకు రాకమానదు. గాంధీ పుట్టిన ఈ రాష్ట్రంలో గాంధీల కుటుంబం పార్టీ కాంగ్రెస్ వెనకబాటు కారణాలు విశ్లేషిస్తే ఎన్నో కనపడతాయి. ప్రభుత్వ వ్యతిరేకతపైనే పూర్తిగా ఆధారపడటం, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లేమి, సామాజిక సమీకరణాలపై అతిగా ఆధారపడటం, జాతీయ స్థాయి నాయకత్వంపైనే ఆధారపడం ఇవీ స్థూలంగా కారణాలుగా చెప్పొచ్చు.

ప్రభుత్వ వ్యతిరేకతపైనే...

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన బీజపీని ఓడించడానికి కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే వందేళ్లు చరిత్రగలిగన పార్టీ ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం., సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసిన మోడీ మారుమూల పల్లెల్లో కూడా గట్టి పునాదులు వేశారు. సుశిక్షితులైన సైనికుల్లాంటి కార్యకర్తలను తయారు చేశారు. ఇంతగా వాడవాడలా పాతుకుపోయిన పార్టీని కేవలం ప్రభుత్వ వ్యతిరేకతతోనే దెబ్బతీయాలనుకోవడం పొరపాటు. బీజేపీ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టంగా కాంగ్రెస్ లేదు. ప్రస్తుత రాజకీయాల్లో అనేక ప్రభుత్వాలు ఐదేళ్లుగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. అలాంటిది 22 ఏళ్లుగా ఏకథాటిగా ఏలుతున్న ప్రభుత్వంపై ఎంతో కొంత అసంతృప్తి ఉండటం సహజం. కాని ఆ ఒక్క కారణంగానే దాన్ని ఓడించలేమన్న వాస్తవాన్ని హస్తం పార్టీ గ్రహించలేకపోయింది. నాయకత్వ లేమి కాంగ్రెస్ పార్టీని కుంగదీసింది. రాష్ట్ర స్థాయిలో సమర్ధ నాయకులు లేరు. కార్యకర్తలను, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను సమన్వయ పరిచి ముందుకు నడిపించే నాయకుడు రాష్ట్రంలో కరువయ్యారు. పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి, సీఎల్పీ నాయకుడు శక్తిసింగ్ గోహిల్ వంటి నాయకులు పేరుకు రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నప్పటికీ వారి ప్రభావం నియోజకవర్గాలకే పరిమితం. పీసీీసీ చీఫ్ సోలంకి పోటీకి దూరంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసింది. గోహిల్ కూడా పట్టుమని పది నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన పాపాన పోలేదు. అహ్మద్ పటేల్, మధుసూధన్ మిస్త్రీ వంటి జాతీయ నాయకులకు క్షేత్రస్థాయిలో బలం శూన్యం. దీంతో అన్నింటికీ రాహుల్ గాంధీపైనే ఆధారపడాల్సి వచ్చింది. పార్టీ అధినేతగా ప్రచారం, నిధుల సమీకరణ వంటి అంశాలకే ఆయన పరిమితం కాగలరు తప్ప రోజూ గుజరాత్ లో కూర్చుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దలేరు. సమన్వయపర్చలేరు.

ఈ ముగ్గురి వల్ల ఉపయోగం?

సామాజిక సమీకరణలపై అతిగా ఆధారపడటం కాంగ్రెస్ కొంపముంచింది. వందేళ్లకు పైగా చరిత్రగల పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన కులనేతలపై ఆధారపడటం పొరపాటు. వారి శక్తిని అతిగా ఊహించుకుని నష్టపోయింది. పటేళ్ల నాయకుడు హార్థిక్ పటేల్, ఓ‌బీసీ నాయకుడు ఆల్ఫోస్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మెవాని మద్దతుతో మురిసిపోయి మోసపోయింది. ఈ ముగ్గురూ నలభై ఏళ్ల లోపు వారే. నిజానికి ఈ ముగ్గురూ సామాజిక వర్గం ఓట్లు వేస్తే 65 శాతం ఓట్లు రావాలి. హార్థిక్ కు చెందిన పాటీదార్లు 14 శాతం, ఆల్ఫోస్ ఠాకూర్ కు చెందిన ఓబీసీలు 42 శాతం, జిగ్నేశ్ మెవానీకి చెందిన దళితులు 9 శాతం మద్దతు కాంగ్రెస్ కు లభిస్తే దాదాపు 150 సీట్లు రావాలి. ఇది అసాధ్యమన్న సంగతి ఎవరైనా చెప్పగలరు. కాని ఈ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. పాటీదార్లలో కేవలం యువకులే హార్థిక్ పటేల్ వైపు నడిచారు. వృద్ధులు బీజేపీతోనే ఉండిపోయారు. నిరుద్యోగసమస్యపై గళమెత్తిన అల్ఫోస్ ఠాకూర్ కు మొదట్లో మంచి ఆదరణే లభించింది. కాని ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా రాథన్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంతో పరిస్థితి మారింది. అల్ఫోస్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. దీంతో ఉద్యమ తొలినాటి ఊపు తర్వాత కొరవడింది. ఇక ఉద్యమ నాయకుడిగా వెలుగులోకి వచ్చిన దళిత నేత జిగ్నేశ్ మెవానీదికూడా ఇదే పరిస్థితి. భావ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈయన న్యాయవాది, రచయిత, హక్కుల పోరాట యోధుడు. మెవాని కూడా వడ్గాం రిజర్వ్ డ్ స్థానం నుంచి పోటీకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. 2012లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. సహజంగానే దళితులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారు. అందువల్ల జిగ్నేశ్ తో పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు.

మోడీ వైపే నిలిచిన ప్రజలు....

మోడీ, రాహుల్ ముఖాముఖి పోరులో ఇద్దరినీ నిశితంగా గమనించిన ప్రజలు అంతిమంగా భూమి పుత్రుడైన మోడీ వైపే నిలిచినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ అనుభవం, సమర్థత, నిజాయితీ ముందు రాహుల్ నిలబడలేకపోయారు. రాహుల్ నిజాయితీ పరుడైనప్పటికీ మోడీకి సరితూగడన్నది ప్రజల నమ్మకం. కేంద్రంలో మోడీ ఉంటేనే రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలుగుతుందని విశ్వసించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ఒకింత ప్రభావం చూపినప్పటికీ అంతిమంగా బీజేపీ విజయాన్ని అడ్డుకోలేక పోయారన్నది వాస్తవం. అవి జాతి విశాత హితాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న అనివార్య నిర్ణయాలు అని గుజరాతీలు భావించినట్లు స్పష్టమవుతోంది. గాంధీ పుట్టిన రాష్ట్రంలో గాంధీల పార్టీ మరో ఐదేళ్లు వేచి ఉండే పరస్థితి కల్పించారు. ప్రస్తుతానికి ఇది సరైన నిర్ణయమన్నది వారి అభిప్రాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News