కశ్మీర్ పై కంటితుడుపు చర్యలేనా?

Update: 2017-10-25 17:30 GMT

‘కాశ్మీర్ సమస్యను బుల్లెట్లతోనో, బలప్రయోగం ద్వారానో పరిష్కరించలేం. అక్కడి ప్రజలకు చేరువ కాగలడం ద్వారానే ఆ పని చేయగలం.’ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో పేర్కొన్న విషయమిది. కాస్త ఆలస్యంగా అయినా ప్రధాని మోడీ వాస్తవాన్ని గ్రహించడం హర్షణీయం. కాశ్మీర్ పై ఒకింత కఠినంగా ఉండాలన్నది మొదటి నుంచి బీజేపీ విధానం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ అభిప్రాంయ బలపడ సాగింది. అసలు 370 అధికరణనే రద్దు చేయాలన్న పార్టీ అది. చర్చలతో తప్ప బలగాలతో పరస్థితిని చక్క దిద్ద లేమని గత రెండేళ్లలో బీజేపీ ప్రభుత్వానికి అనుభవ పూర్వంగా అర్ధమైంది. అజిత్ ధోవల్ వంటి జాతీయ భద్రతా సలహాదారుడు, ఎన్.ఎన్. వోహ్రా వంటి గవర్నర్ ద్వారా పరస్థితిని చక్క దిద్దాలని మోడీ ప్రభుత్వం మొదట్లో భావించింది. ఆచరణలో ఇది అసాధ్యమని అర్థమయ్యాక ఇప్పుడు చర్చల మార్గాన్ని ఎంచుకుంది. చర్చలకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ప్రతినిధిగా నిఘా విభాగం (ఇంటలిజెన్స్ బ్యూరో) మాజీ అధిపతి దీనేశ్వర్ శర్మను నియమించింది.

రక్తసిక్తంగా మారుతున్న కశ్మీర్.....

కేంద్రం నిర్ణయానికి బలమైన కారణాలే ఉన్నాయి. బలగాల ద్వారా సమస్యను పరిష్కరించలేమని అర్ధమైంది. కనీసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కార యత్నాన్ని కూడా చేయలేదన్న విమర్శలు ఇటు స్వదేశంలో.. అటు విదేశంలో రాకుండా ముందుజాగ్రత్తగా చర్చల మార్గాన్ని ఎంచుకుంది. అన్నింటికీ మించి గత ఏడాదిగా సరిహద్దు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణించింది. 2016తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ వరకూ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు బాగా పెరిగాయి. 2016లో 191 తీవ్రవాద ఘటనలు జరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే వాటి సంఖ్య 191కి చేరుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. గత ఏడాది పౌరులపై 15 సార్లు దాడులు జరగ్గా, ఈ సంవత్సరం 39 సార్లు జరిగాయి. గత సంవత్సరం 13 మంది పౌరులు చనిపోగా ఈ ఏడాది 68 మంది హతులయ్యారు. భద్రతాదళాల చేతిలో 2016లో 62 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ దఫా హతుల సంఖ్య 68కి పెరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనం. గత ఏడాది భద్రతాదళాల చేతిలో 114 మంది తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, ఈ సంవత్సరం 175 మంది మృతి చెందారు. స్థూలంగా చూస్తే గత ఏడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతమాత్రం మెరుగుపడక పోగా మరింత క్షీణించడం సర్కారును, పౌరులను కలిచి వేసింది. ఈ పరిస్థితిని చక్క దిద్దేందుకు చర్చలే శరణ్యమన్న ఉద్దేశ్యంతో దినేశ్వర్ శర్మ నియామకం ద్వారా కేంద్రం తొలి అడుగు వేసింది. శర్మ ఆషామాషీ అధికారి కాదు. 1979 కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయనకు కాశ్మీర్ సమస్యపై సంపూర్ణ అవగాహన ఉంది. 1992లో నిఘా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఆయన కాశ్మీర్ లో అడుగుపెట్టారు. 1994వరకూ అదే హోదాలో ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చినప్పటికీ అక్కడి నుంచే కాశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

ఎన్ని కమిటీలు...? ఎన్ని సిఫార్సులు....?

శర్మ నియామకం స్వాగతించ దగ్గ పరిణామం. ఆయన నియామకంతో రాత్రికి రాత్రే సమస్య పరిష్కారం కాదు. పెద్ద పెద్ద అంచనాలు కూడా పెట్టుకోవడం మంచిది కాదు. అయితే ఒక ముందడుగు పడినందుకు అందరూ సంతోషించాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు శర్మ నియామకంతోనే అయిపోయినట్లు భావించడం తొందరపాటు. ఎందుకంటే కాశ్మీర్ పై కమిటీల నియామకం కొత్తేమీ కాదు. వాటి సిఫార్సులను బుట్ట దాకలు చేయడం కూడా కేంద్ర పెద్దలకు తెలిసిన విద్యే. గతంలో కేసీ పంత్, వోహ్రా కమిటీ, త్రిసభ్య కమిటీలను నియమించడం, వాటి సిఫార్సులను అటకెక్కించడం అందరికీ తెలిసిందే. 2002లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కేసీ పంత్ కమిటీని నియమించింది. స్వాతంత్ర్య సమర యోధుడైన గోవింద్ వల్లభ్ పంత్ కుమారుడు కేసీ పంత్. వేర్పాటు వాద నాయకుడు షబీర్ షా వంటి నాయకులతో చర్చలు జరపడం మినహా పంత్ కమిటీ పెద్దగా చేసిందేమీ లేదు. పాకిస్థాన్ ను కూడా చర్చల్లో భాగస్వామిని చేయాలంటూ హరియత్ పట్టుబట్టి చర్చల ప్రక్రియను నీరుగార్చింది. కాశ్మీర్ లో హరియత్ ది కీలకపాత్ర. అనంతరం ఎన్ఎన్ వోహ్రా ఆధ్వర్యాన మరో కమిటీ వేశారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర గవర్నర్. 2010లో నాటి యూపీఏ ప్రభుత్వ ప్రధాని మన్మోహన్ సింగ్ ముగ్గురుసభ్యులతో త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గోంకర్, రాధాకుమార్, ఎం.ఎం. అన్సారీ ఇందులో సభ్యులు. 2003లో మితవాద హరియత్ నాయకులను నాటి హోంమంత్రి ఎల్ కే అద్వానీతో చర్చలకు రప్పించడంలో విజయవంతమయ్యారు. కాని ఆ చర్చలు ఫలించలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన వోహ్రాకు విశేష అనుభవం ఉంది. రామ్ జెట్మలాని, నారిమన్, అశోక్ భాన్ వంటి న్యాయనిపుణులు, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్, రిటైర్డ్ ఐఎఫ్ ఎస్ అధికారి వికె గ్రోవర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ పడ్గోంకర్, జావెద్ లాయక్, ఎంజె అక్బర్ తదితరులతో కూడిన కమిటీ ఏమీ చేయలేకపోయింది. బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గత ఏడాదిగా కాశ్మీర్ వ్యవహారాలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కమిటీలు వేసినంత మాత్రాన పని అయిపోదు. అర్థవంతమైన చర్చలు, పరిష్కార మార్గాలతో అవి ముందుకు రావాలి. ప్రభుత్వం, వేర్పాటు వాద నాయకులు మొండిపట్టుకు పోకుండా వాస్తవిక థృక్ఫధంతో ముందుకు వచ్చినప్పుడే పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News