కర్ణాటకలో కమలనాధుల ద్విముఖ వ్యూహం

Update: 2018-02-26 18:29 GMT

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ గట్టి కసరత్తే చేస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని లబ్దిపొందాలని చూస్తోంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో కమలనాధులు పూర్తిగా కన్నడనాడుపై దృష్టి పెడుతున్నారు. ప్రచారంలో భాగంగా రెండు వ్యూహాలను అమలు చేయనున్నారు. సిద్ధరామయ్య సర్కార్ పై అవినీతి ఆరోపణలను సంధించడం, ఆయన అసమర్థ పాలనను ఎండగట్టడం వంటివి మొదటి వ్యూహం. ఎన్నికలకు ముందే రాష్ట్రానికి నిధులు, పథకాలు, ప్రాజెక్టులు మంజూరు చేసి ఓటర్లను ఆకట్టుకోవాలన్నది కమలనాధుల రెండో వ్యూహం. ఈ రెండు వ్యూహాలను ఇప్పటికే సమర్థంగా అమలు చేయడం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జి పి. మురళీధరరావు వంటి నాయకులు ఈ పనిలోనే ఉన్నారు. అగ్రనేతలు ఇటీవల రాష్ట్రంలో పర్యటించి హామీలు గుప్పించడం, పథకాలను ప్రారంభించడంతో పాటు సిద్ధరామయ్య సర్కార్ పై అవినీతి ఆరోపణలను సంధించారు. ఈ నెల 19న మైసూరు మహారాజా కళాశాల మైదానంలో జరిగిన పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ సిద్ధరామయ్య సర్కార్ కమీషన్ల సర్కార్ గా మారిందని ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బెంగళూరు సబలో పదిశాతం కమీషన్లు ప్రభుత్వం తీసుకుంటుందని తాను చెప్పానని, కాని ఈ మొత్తం ఇంకా ఎక్కువేనని ఇప్పుడు తనకు అర్థమైందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సన్నిహితురాలైన శోభ కరంద్లాజే కూడా సర్కార్ పై సరికొత్త ఆరోపణలను సంధించారు. బోర్ వెల్ ల తవ్వకాల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 1245 బోర్ వెల్ ల తవ్వకాల్లో ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడైన సాంఘిక సంక్షేమ మంత్రి ఆంజనేయప్ప అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇందుకు తన వద్ద అన్ని ఆధారాలున్నట్లు స్పష్టం చేశారు. 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల పరిశీలకుడు మురళీధరరావు విమర్శించారు. మురళీధరరావు తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన యువ నాయకుడు. ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గల అన్ని అవకాశాలపై పార్టీ దృష్టి పెడుతోంది.

ప్రారంభోత్సవాలు....శంకుస్థాపనలు....

మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు, పథకాలు మంజూరు చేయడం, నిధులు విడుదల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలన్నది కమలనాధుల వ్యూహం. అదే సమయంలో కేంద్రంలో తాము అధికారంలో ఉన్నందున, ఇక్కడ కూడా తమను గెలిపిస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెబుతున్నారు. ఈ నెల 19న రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మైసూర్ -ఉదయపూర్ మధ్య హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపారు. బెంగళూరు-మైసూరు మధ్య నిర్మించిన జంట రైలు మార్గం, విద్యదీరకరణ వ్యవస్థలను కూడా మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైసూరు నగర శివార్లలోని నాగనహళ్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మించనున్నట్లు తెలిపారు. శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వర మహా సమస్తాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని బాహుబలి వెలసిన వింద్యగిరికి కొత్తగా నిర్మించిన 630 మెట్ల దారిని, 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.

కర్ణాటకపై కనక వర్షం.....

మరోపక్క కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కర్ణాటకపై కనకవర్షం కురిపించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.1,44,922 కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు. షిమోగోలో రూ.873 కోట్ల విలువైన 138.5 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. షిమోగా, బీదర్, బీజాపూర్, హుబ్లీ జిల్లాల్లో రూ.3,700 కోట్ల విలువైన 500 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.19,638 కోట్ల విలువైన 2,795 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 1,676 కోట్ల విలువైన 230 కిలోమీటర్ల పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. పాతిక వేల కోట్ల విలువైన నాలుగు వేల కిలోమీటర్ల పనులకు సంబంధించి నివేదిక తయారీ దశలో ఉందని వెల్లడించారు.

నిధులు కుమ్మరిస్తూ....

ఒక పక్క తమకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష పాటిస్తుందని ఏపీ సర్కారు చెబుతున్నప్పటీకి ఎన్నికలు జరగనున్న కర్ణాటక విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014 నాటికి రాష్ట్రంలో 4193 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3720 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించడం గమనార్హం. అంతకు ముందున్న రహదారుల్లో ఇది 88 శాతానికి సమాచారం. కర్ణాటకలో 2014 ఎన్నికలకు ముందు సుమారు 6720 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది. కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చాక 6805 కిలోమీటర్లను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది ఇంతకు ముందున్న జాతీయ రహదారుల కంటే రెట్టింపు కావడం విశేషం. తరచి చూస్తే ఇలాంటి గణాంకాలకు కొదవే ఉండదు. గతంలో గెలుచుకున్న కర్ణాటకను మళ్లీ కైవసం చేసుకునేందుకు మరిన్ని పథకాలు, ప్రాజెక్టులు, గ్రాంట్లు మంజూరు చేయడానికి కమలనాధులు సిద్ధంగా ఉన్నారు. హస్తం పార్టీని అధికారం నుంచి దింపివేసేందుకు గల అన్ని అవకాశాలనూ కమలనాధులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News