కర్ణాటక..కాంగ్రెస్...భలే సెంటిమెంట్....!

Update: 2018-02-12 17:30 GMT

కర్ణాటక.... కష్టకాలంలో కాంగ్రెస్ కు అండగా నిలిచిన దక్షిణాది రాష్ట్రం. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకూ రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన రాష్ట్రం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆదుకున్న రాష్ట్రం. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో సుప్త చేతనావస్థలో ఉంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దిక్కులేని దుస్థితి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రం కన్నడ నాడే కావడం విశేషం. గతంలోని సెంటిమెంట్ల మాదిరిగా ఈ దఫా కూడా హస్తం పార్టీకి రాష్ట్రం అండగా ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే మే వరకూ ఆగక తప్పదు మరి.

కష్టకాలంలో అండగా....

కాంగ్రెస్ కు కర్ణాటక ఎలా అండగా నిలిచిందో తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లక తప్పదు. 1977లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. స్వయంగా ప్రధాని ఇందిరాగాంధీ సొంత నియోజకవర్గమైన ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీ లో ఓడిపోయారు. అనామకుడైన రాజ్ నారాయణ్ చేతిలో పరాజయం పాలయ్యారు. రాజకీయంగా ఆమెకు అది అత్యంత క్లిష్టసమయం. అంతటి కష్టకాలంలో కర్ణాటక ఆమెకు ప్రాణం పోసింది. రాష్ట్రంలోని చిక్ మగుళూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఇందిరాగాంధీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆమెను ఎలాగైనా ఓడించాలని కేంద్రంలోని నాటి జనతా ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండజ్ ను రంగంలోకి దింపినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ఇందిర విజయానికి గట్టి కృషి చేశారు. ఈ గెలుపు ఆమెకు రాజకీయంగా పునర్జన్మ నిచ్చింది. 1980లో మళ్లీ ప్రధాని కావడానికి దోహదపడింది. 1999లో రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా కర్ణాటక ఆపన్న హస్తం చాటింది. అప్పుడూ కాంగ్రెస్ కష్టకాలంలోనే ఉంది. సోనియా పోటీ చేయడానికి సరైన నియోజకవర్గం కూడా లేని పరిస్థితి. నాి ఎన్నికల్లో పోటీకి సోనియా గాంధీ బళ్లారిని ఎంచుకున్నారు. అత్యంత రహస్యంగా, నాటకీయ పరిస్థితుల్లో నామినేషన్ వేశారు. సోనియాకు పోటీగా సుష్మా స్వరాజ్ ను బీజేపీ రంగంలోకి దింపింది. బళ్లారి ఎన్నిక 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణభూతమైంది. ఆ తర్వాత సోనియా రాయబరేలి నుంచి ఎన్నికయ్యారు.

నిట్ట నిలువునా చీలిన సమయంలో....

1977లో లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ద్వారా కాంగ్రెస్ కుదేలైంది. కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఏపీకి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా మరో వర్గానికి ఇందిరాగాంధీ సారథి అయ్యారు. ఎక్కువ మంది నాయకులు బ్రహ్మానందరెడ్డి వైపే ఉన్నారు. ఆ సమయంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ఇందిరవైపే మొగ్గుచూపారు. కాంగ్రెస్ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 1978 మార్చిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అర్స్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కు 149 స్థానాలు రాగా, జనతా పార్టీ59 స్థానాలకే పరిమితమైంది. బ్రహ్మానందరెడ్డి సారథ్యంలోని రెడ్డి కాంగ్రెస్ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ అసలైన పార్టీగా గుర్తింపు పొందింది. అప్పట్లో దళితనాయకుడైన అర్స్ దళితులు, ముస్లింలు, బీసీ ఓట్లను కూడగట్టి కాంగ్రెస్ ను గెలిపించారు. ఇప్పుడు కూడా కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కు కర్ణాటక అండగా నిలుస్తుందని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కుదేలైన పార్టీకి కర్ణాటక గెలుపు జీవం పోస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. అప్పట్లో అర్స్ మాదిరిగా ఇప్పుడు సిద్ధరామయ్య సారథ్యంలో పార్టీ విజయపథంలో పయనిస్తుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అర్స్ మాదిరిగా సిద్ధరామయ్య కూడా దళితులు, ముస్లింలు, బీసీల అండతో ముందుకు సాగుతారని భావిస్తున్నాయి. అర్స్ ను, సిద్ధరామయ్యకు కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ మైసూర్ జిల్లాకు చెందిన వారే. సిద్ధరామయ్య జిల్లాలోని చాముండేశ్వరినగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో దేవరాజ్ అర్స్ జిల్ాలోని హోన్సూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాధ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెంటిమెంట్ కు అనుగుణంగా కర్ణాటక ఈసారి కూడా కాంగ్రెస్ కు అండగా నిలుస్తుందని పార్టీ వర్గాల విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News