కమలానికి కేక్ వాక్ మాత్రం కాదు

Update: 2017-10-17 16:30 GMT

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... ప్రధాని నరేంద్రమోడీ నినాదమిది. గత కొంతకాలంగా కార్యకర్తల సభలు, సమావేశాల్లో వీరిద్దరూ అదేపనిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మోడీ, షా ల అవగాహనా రాహిత్యానికి, అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. నిన్నమొన్నటి దాకా ఢిల్లీ రాజకీయాలు తెలియని అమిత్ షాకు రాజకీయ అవగాహన కడూా తక్కువే. 1984లో తమ పార్టీ కేవలం రెండే స్థానాలు గెలుపొందిన విషయాన్ని ఆయన మర్చిపోయి కాంగ్రెస్ ముక్గ్ భారత్.... వంటి అర్థరహిత నినాదాలు చేస్తున్నారు. నాటి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పుణ్యమా అని హన్మకొంద స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మరో స్థానం గుజరాత్ లో గెలుచుకుంది. తెలుగుదేశం మద్దతుతో అప్పట్లో హన్మకొండలో పీవీ నరసింహారావును బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి ఓడించారు. సమకాలీన రాజకీయాల్లో ఏ పార్టిని అయినా ఓడించగలమేమోగాని అసలు లేకుండా చేయడం అసాధ్యం. ఈ విషయం షాకు తెలియకపోవచ్చు. అందువల్లే అవగాహన లేకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు.

కాషాయానికి కషాయం తప్పదా?

కాని అమిత్ షాకు అర్ధమయ్యేటట్లు చెబుతున్నారు ఓటర్లు. ఇప్పటిదాకా విషయం బాగా తలకెక్కలేదు. తాజాగా గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికతో ఒక షాకు మాత్రమే కాదు కాషాయ శ్రేణికి స్పష్టంగా అర్ధమైంది. బీజేపీ కంచుకోట అయిన పంజాబ్ లోని ఈ లోక్ సభ స్థానం ఫలితం బీజేపీని ఖంగుతినిపించింది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ నాయకుడు, సినీనటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరిగింది. 1998,1999,2004,2014 ఎన్నికల్లో వినోద్ ఖన్నా ఇక్కడ విజయ దుంధుభి మోగించారు. అలాంటి కంచుకోటలో కాషాయపార్టీ చతికల పడటం ప్రజల వైఖరిలో వస్తున్న మార్పునకు సంకేతంగా చెప్పడం తొందపాటే అవుతుంది. అయతే కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకడ్ సాధించిన 1,93,219 ఓట్ల ఆధిక్యం చూస్తే భవిష్యత్ రాజకీయాలు కమలం పార్టీకి కేక్ వాక్ కాదన్న సంగతి అర్థమవుతోంది.

అనేక ఉప ఎన్నికల్లో.....

ఒక్క గురుదాస్ పూర్ కాదు.. ఇంతకు ముందు జరిగిన అమృత్ సర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవంఎదురైంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని భారీ మెజారిటీతో ఓడించారు. అనంతరం సెట్లజ్-యుమున లింక్ కెనాల్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా అమరీందర్ రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో శ్రీనగర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోకూడా ఎన్టీయే కూటమి లోని పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ) అభ్యర్థి పరాజయం పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పీడీపీని ఓడించారు. ఫరూక్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. 2014లో ఇక్కడ గెలిచిన పీడీపీ నాయకుడు తారఖి హమీద్ కర్రా పోలీసుల అణిచివేతకు నిరసనగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ముస్లింలీగ్ నాయకుడు ఎబ్రోర్. ఇ. అహ్మద్ ఆకస్మిక మృతితో కేరళలోని మలప్పురం లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన ముస్లిం లీగ్ అభ్యర్థి కున్హల్ కుట్టి

గెలుపొందారు. ఇక్కడ బీజేపీ కేవలం 64,750 ఓట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా కేరళలోని వెంగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన ముస్లిం లీగ్ అభ్యర్థి కె.ఎన్.ఎ. ఖాదర్ గెలుపొందారు. నాందేడ్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 81 స్థానాలకు గాను కాంగ్రెస్ 73 స్థానాల్లో ఘన విజయం సాధించగా, కాషాయ పార్టీ కేవలం ఆరు సీట్లలో సంతృప్తి పడాల్సి వచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్వస్థలం నాందేడ్.

విద్యార్థి సంఘ ఎన్నికల్లోనూ....

విద్యార్థి సంఘాల ఎన్నికల్లో కూడా కమలనాధులు ఖంగుతినడం తాజా పరిణామం. ఇంతకుముందు ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్ యూ), ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. తాజాగా మరో ముఖ్యమైన అలహాబాద్ యూనివర్సిటీలోననూ కమలానికి కష్టాలే ఎదురయ్యాయి. సమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగం మొత్తం పదవులకు గాను నాల్గింటిని కైవసం చేసుకుని బీజేపీ విద్యార్థి సంఘమైన ఏబీవీపీపై పైచేయి సాధించింది. కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు సమాజ్ వాదీ విద్యార్థి సంఘం వశమయ్యాయి. 2015 ఎన్నికల్లో ఏబీవీపీ ఇక్కడ విజయం సాధించింది. అయిదులో నాలుగు పదవులను గెలుచుకుంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండటం ఇక్కడ గమనార్హం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ జెఎన్ యూల్లో ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ యూఐ జెండా ఎగురవేసింది. జేఎన్ యూ అధ్యక్ష పదవిని వామపక్ష విద్యార్థి సంఘం కైవసం చేసుకుంది. ఏబీవీపీ అభ్యర్థి నిధి త్రిపాఠీని వామపక్ష విద్యార్థి విభాగానికి చెందిన గీతాకుమారి ఓడించారు. మొత్తం నాలుగు స్థానాలను ఈ సంఘం నిలబెట్టుకుంది. ఏబీవీపీ ఎంతమాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను చేజిక్కించుకుంది. ఇంతకు ముందు ఈ పదవులు ఏబీవీపీ చేతిలో ఉన్నాయి. 2019 నాటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అంత తేలిక ఏమీ కాదని... ఉప ఎన్నికలు, విశ్వవిద్యాలయాల ఫలితాలు విస్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఓటర్లు అంత అమాకులు కాదు.....

బీజేపీ ఓటర్లలో అత్యధికులు అక్షరాస్యులు కాకపోవచ్చు. కాని వారు అమాయకులు కాదు. పాలు, నీళ్లను వేరే చేసే శక్తి వారికి ఉంది. నాయకుల మాటలను విశ్వసిస్తారు. అదే సమయంలో చేతలనుకూడా నిశితంగా పరిశీలిస్తారు. రెండింటి మధ్య సమతుల్యం లేకపోతే నిర్మొహమాటంగా పక్కనపెడతారు. అణకువగా ఉండే నాయకులనే అందలం ఎక్కిస్తారు. అహంకారంగా వ్యవహరించేవారిని అధికారం నుంచి తప్పిస్తారు. వారి ముందు ఎంత గొప్ప నాయకుల కుప్పిగంతులు చెల్లనే చెల్లవు. చరిత్ర చెబుతున్న సత్యమిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News