కమలద్వయానికి కాంగ్రెస్ సవాల్

Update: 2017-09-23 14:30 GMT

మల్లయుద్ధం, కర్ర సాము, కత్తితో కదనం ఏదైనా సొంతశక్తితో రంగంలోకి దిగవచ్చు. ప్రత్యర్థితో అటోఇటో తేలిపోతుంది. కానీ ప్రజాక్షేత్రం అలా కాదు. తన తెలివితేటలు,నైపుణ్యం కంటే ఎదుటిపక్షం బలహీనతలు , సామర్థ్యాలు, సమయోచిత వ్యూహాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. రాజకీయ రంగంలో కోట్లాది ప్రజల మనోభావాలే విజేతలను నిర్ణయిస్తాయి. నాయకునిగా పట్టం గడతాయి. పన్నెండేళ్లకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదురులేని అధికారాన్ని చెలాయించి భారత ప్రజల తీర్పుతో ప్రధానిగా పదోన్నతి పొందిన నరేంద్రమోడీకి ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. నోట్ల రద్దు కావచ్చు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు. ఆలోచన పుట్టిందే తడవగా ఆచరణలోకి తేవడం, అందులో ఎదురయ్యే సాధకబాధకాలను పెద్దగా పట్టించుకోకపోవడం మోడీ నైజంగా కొనసాగుతోంది. ఈ నిర్ణయాలే ఆయనను ధృఢమైన నాయకునిగా కూడా తీర్చిదిద్దాయి. సమాజ్ వాదీ, కాంగ్రెసు పార్టీలు కలిసి పోటీ చేసినా యూపీలో ఏకపక్ష విజయం బీజేపీని వరించింది. మోడీ ప్రభంజనం 2019 ఎన్నికల్లో కూడా కొనసాగనుందన్న బలమైన భావన వ్యాపించింది. అయితే వచ్చే మూడు నెలల్లో జరగబోతున్న గుజరాత్ ఎన్నికలు వెన్నుచూపని ఈ నేతకు వెరపు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతాపార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గుత్తాధిపత్యం కేంద్రీకృతమై పోయింది. కేంద్రప్రభుత్వంలోనూ అధికారం ఏకవ్యక్తి పెత్తనంగా మారిపోయింది. అటు బీజేపీని, ఇటు కేంద్రాన్ని సవ్యసాచిగా మోడీ శాసిస్తున్నారు. అమిత్ షా ను కేవలం మోడీ ఫ్రాక్సీగా మాత్రమే పార్టీ శ్రేణులు చూస్తున్నాయి.

గతంలోమోడీ వ్యూహం... షా అమలు....

గుజరాత్ మంత్రివర్గంలో మోడీ ఆలోచనలను అమలు చేయడానికే అమిత్ షాను వినియోగించేవారనేది జగమెరిగిన సత్యం. తు.చ తప్పకుండా చెప్పింది చెప్పినట్లు చేయడం, తద్వారా కష్టనష్టాలు ఎదురైనా అధినేత పేరు బయటపెట్టకుండా భరించడం షా కు మోడీ మిత్రత్వంతో అబ్బిన విద్య. ఇందువల్ల కొంతకాలం కారాగారానికి వెళ్లాల్సి వచ్చినా మౌనంగానే అన్నిటినీ భరించాడు. ఫలితంగానే అధికార జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఎందరో మహామహులున్న బీజేపీలో జూనియర్ అయిన అమిత్ షా ఎంపిక మోడీ ప్రాధాన్యమే. పార్టీలోనూ, బయటా విమర్శలను లెక్క చేయకుండా ఒకే రాష్ట్రానికి చెందినప్పటికీ షాకు కమలదళాధిపత్యం అప్పగించారు మోడీ. తద్వారా పార్టీలో నిర్ణయాలన్నిటినీ తన కనుసన్నల్లోకి తెచ్చేసుకున్నారు. బీజేపీ గతంలో ఎన్నడూ చూడని గుత్తాధిపత్యమిది. పార్టీ పెట్టినప్పట్నుంచి నిన్నామొన్నటివరకూ వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి వారెందరో కీలకంగా వ్యవహరించేవారు. వాజపేయి, అద్వానీలు ప్రథమశ్రేణి నేతలుగా ఉండేవారు. అప్పట్లో బీజేపీ భిన్నాభిప్రాయాలకు వేదికగా ఉండేది. వాజపేయి, అద్వానీ విభేదించుకున్న అనేక సందర్భాలున్నాయి. చివరికి సమష్టి నిర్ణయం అమలయ్యేది. గోద్రా అల్లర్ల తర్వాత రాజధర్మం పాటించని నరేంద్రమోడీని ముఖ్యమంత్రిత్వం నుంచి తొలగించాలని ప్రధాని వాజపేయి బలంగా భావించినా అమలు కాలేదు. అద్వానీ అడ్డుపడ్డారు. అటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండేది. ఇప్పుడు మోడీ తలచుకుంటే కాని పని ఉందా? వాజపేయి, అద్వానీల తరహాలో భిన్నాభిప్రాయానికి పార్టీలో స్థానం ఉందా? అంటే కచ్చితంగా లేదనే పార్టీ చెబుతోంది.

ఫలితాలకు మోడీ, షాలే బాధ్యులవుతారు.....

ఇటువంటి నేపథ్యంలో గుజరాత్ ఎన్నిక సాగనుంది. గెలుపోటములకు సమష్టి బాధ్యత తీసుకొనేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అందువల్ల గుజరాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఫలితం మోడీ, అమిత్ షాల నాయకత్వ పటిష్ఠతపై పెను ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రంలో వీరిద్దరి సారథ్యం మొదలయ్యాక ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చవిచూసింది. అయినా కాంగ్రెసు, ఆర్జెడీ, జేడీయుల కూటమి అందులోనూ మచ్చలేని నితీశ్ అభ్యర్థిత్వం కారణంగానే గెలిచిందనే భావం ఏర్పడింది. ఆప్ కు కొత్తగా అవకాశం ఇవ్వాలనుకున్న ఓటర్ల ప్రభావం అంటూ ఢిల్లీ ఓటమిని సరిపుచ్చుకున్నారు. అమిత్ షా, మోడీ నాయకత్వ సామర్థ్యంపై పెద్దగా సందేహాలు తలెత్తలేదు. గుజరాత్ లో ఇటువంటి పప్పులేం ఉడకవు. ఓటమికి నేరుగా మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆనందీబెన్, విజయరూపానీలు ముఖ్యమంత్రులుగా బీజేపీని అథ:పాతాళానికి తోసేశారు. పటేదార్ల ఉద్యమంతో బలమైన సామాజిక వర్గం బీజేపీకి దూరమైపోయింది. దళితులపై దాడులతో వారు కూడా బీజేపీకి ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా అవినీతి , కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో ఎదురైన ఓటములు పార్టీ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. మోడీ, అమిత్ షాలు ప్రతి ఎన్నికలోనూ వర్గాలవారీగా, ప్రాంతాలవారీగా ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు. అయితే ఇప్పుడు ఇదే ప్రణాళికను అమలు చేసేందుకు కాంగ్రెసు పార్టీ సిద్ధమవుతోంది.

కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో......

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా సౌరాష్ట్ర, ఉత్తర, దక్షిణ, మధ్య గుజరాత్ లు నాలుగు ప్రచార సెగ్మెంట్లుగా అంశాలవారీగా ప్రజల్లోకి వెళ్లడానికి కాంగ్రెసు సిద్ధమవుతోంది. ప్రజలతో మాటామంతీ నిమిత్తం జనసంవాద్ పేరిట ఈనెల 25 నుంచి రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. బహిరంగసభలు, పార్టీ సమావేశాలు, యువత, మహిళలతో భేటీలు, పటేదార్, మైనారిటీ, దళిత వర్గాలతో మంతనాలు, వ్యాపార వర్గాలతో సదస్సుల వంటివాటికి రూపకల్పన చేస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు పక్కాగా బీజేపీ స్ట్రాటజీని కాంగ్రెసు అనుసరించబోతోంది. అధికారాన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ 2002 నుంచి చూస్తే బీజేపీ ఓటింగు షేరు పడిపోతోంది. 2002లో 49.85 శాతం ఓట్లతో 127 స్థానాలు బీజేపీ దక్కించుకుంది. 2007లో 49.12 శాతం ఓట్లతో 117 స్థానాలు, 2012లో 47.85 శాతం ఓట్లతో 115 స్థానాలు వచ్చాయి. ఇటీవల ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు, స్థానిక నాయకత్వ లోపాలు వెరసి బీజేపీ అగ్రనాయకత్వానికి గుజరాత్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన ఉత్సాహాన్ని గుజరాత్ ఆవిరి చేసేస్తుందేమోనన్న భయం ఆవరించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నాయకద్వయానికి ఎదురవుతున్న అతి పెద్ద పరీక్ష. రచ్చ గెలిచి హల్ చల్ చేస్తున్న ఈ ఇరువురూ ఇంట గెలిచేనా? లేదా? కాలమే తేల్చి చెప్పాలి.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News