కమలం గెలిచింది..కాంగ్రెసు నవ్వింది...!

Update: 2017-12-19 15:30 GMT

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. అందులోని పాఠం అర్థం చేసుకోవడమే రాజకీయం. జో జీతా హై వహీ సికిందర్, గెలిచినవాడే విజేత. రాజ్యం చేస్తాడు. కానీ గెలుపులోని పాఠం పట్టించుకున్న వాడు పర్మినెంట్ గా ప్రజల మనిషిగా నిలిచిపోతాడు. పొరపాట్లను దిద్దుకుంటూ తడబాట్లను సరిచేసుకుంటాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో విజయాలు జాతీయ ప్రధాన పక్షాలైన రెండు పార్టీలకూ చెంపపెట్టుగానే చెప్పాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అడ్డగోలు నిర్ణయాలతో జనజీవనానికి సంబంధం లేకుండా ఒంటెత్తు పోకడతో చెలరేగిపోతున్న కేంద్రానికి గుజరాత్ ప్రజల తీర్పు ఒక చిన్న కుదుపు. ఆత్మావలోకనం చేసుకోమని సూచించిన హెచ్చరిక. అవినీతి, అక్రమాల్లో కూరుకున్నారని తెలిసినా సీఎం కుటుంబాన్ని ఉపేక్షించి, పార్టీని గెలిపిస్తే చాలు అంతా కొట్టుకుపోతుందని భావించిన కాంగ్రెసును హిమాచల్ ప్రజలు చాచి పెట్టి కొట్టారు. హిమాచల్ ప్రదేశ్ సేదతీర్చినా గుజరాత్ గెలుపును బీజేపీ ఆస్వాదించలేకపోతోంది. తుడిచిపెట్టుకుపోతామేమోననుకున్న గుజరాత్ లో అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కొన్నందుకు కాంగ్రెసు కాసింత తెరిపిన పడుతోంది. రెండు పార్టీల స్వయం కృతాపరాధం దొందూ దొందే అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి.

గెలుపు పాఠం...

ఈ ఎన్నికలో బ్రాండ్ మోడీ బాగా పనిచేసింది. గుజరాత్ లో స్థానిక కమలనాథులు దాదాపు చేతులెత్తేశారు. ఎంతో పటిష్టమైన యంత్రాంగం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఆగ్రహరూపం సంతరించుకుంటోందని గ్రహించిన బీజేపీ శ్రేణులు ఓటమి ఖాయమేమోనని భయపడ్డాయి. కానీ తన సొంత రాష్ట్రం, సంస్కరణలకు తొలి నుంచీ బలమైన మద్దతుగా నిలుస్తోన్న గుజరాత్ లో ఓడిపోతే రాజకీయంగా ఎదురయ్యే పర్యవసానాలను గ్రహించి మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించారు. కేవలం మతమే కాదు. పాకిస్తాన్ వ్యతిరేకతతోనూ సరిపుచ్చలేదు. గుజరాతీ ఆత్మ గౌరవం పేరుతో తన ప్రతిష్టను కూడా జత చేసి ప్రజలను సమ్మోహపరిచారు. అర్థించారు. అభ్యర్థించారు. ఫలితంగా మోడీ గెలిచాడు. కానీ పార్టీ ప్రభ మాత్రం కనిపించలేదు. బొటాబొటి మెజార్టీతో గట్టెక్కింది. కాంగ్రెసుకు రాష్ట్రంలో దిశానిర్దేశం చేసే నాయకుడు లేడు. కరిష్మాటిక్ ప్రాంతీయ ప్రచారకుడు లేడు. పోలింగు బూతునకు తీసుకెళ్లే శ్రేణులు లేవు. ప్రచార వ్యయాన్ని భరించే స్తోమత అంతంతమాత్రమే కానీ బీజేపీ తప్పులే ప్రచారాంశాలుగా అధికారపక్షాన్ని ఓడించినంత పనిచేసింది కాంగ్రెసు. ఈ పార్టీకి లోపాలను సరిదిద్ది నియోజకవర్గ స్థాయి స్ట్రాటజీ అమలు చేసే వ్యూహకర్తలు కరవయ్యారు. దీంతో కాంగ్రెసు గెలుపు ముంగిట్లో బొక్కబోర్లా పడింది.

మోడీ ‘షా‘ సించారు..

ఆపసోపాలు పడుతూ వచ్చిన బీజేపీ చివరి క్షణంలో బోర్లా పడిన కాంగ్రెసును ఒక్క అంగలో దాటేసి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఈ రెంటి మధ్య తేడా ఒక్క అడుగు మాత్రమే. దీర్ఘకాల వ్యూహమే కాదు, చివరి వరకూ అలసిపోకుండా, పడిపోకుండా చూసుకోవాల్సిన నేర్పు, ఓర్పు కూడా అవసరమే. దాదాపు విజయం ఖాయమైన స్థితిలో నియోజకవర్గాల వారీ గ్రౌండ్ రిపోర్టులతో పోటాపోటీగా ఉన్న సీట్లపై దృష్టి పెట్టి ఉంటే మరో 15 స్థానాల వరకూ కాంగ్రెసుకు దక్కి ఉండేవనేది పరిశీలకుల అంచనా. గుజరాత్ లో ప్రాంతాలు, వర్గాలు, నియోజకవర్గాల్లో అణువణువూ మోడీకి కొట్టిన పిండి. ఓటర్ల ఆలోచనలను పసికట్టే నేర్పు ఉంది. రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోనని ఒకానొక దశలో ప్రధాని చేసిన వ్యాఖ్య యాదృచ్ఛికం కాదు. క్షేత్రస్థాయిలో బీజేపీ పరిస్థితికి దర్పణం. చివరి పదిరోజుల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. ఓబీసీలు, పటేదార్లు, గిరిజనులు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతినే ప్రాంతాలను గుర్తించారు. వర్గాల వారీ హామీలు గుప్పించడంతోపాటు ఇంటింటికీ కార్యకర్తలు చేరుకుని సముదాయించి, సమన్వయ పరిచి బీజేపీ నెగ్గాల్సిన అవసరాన్ని తెలియ చెప్పేలా ప్రత్యేక ప్రచార ప్రణాళికను అమలు చేశారు. ఇందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. నిత్యం నియోజకవర్గాల వారీ సమీక్షలు జరిపి హామీలు, ఆర్థిక అంశాల్లో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదని భరోసా నిచ్చారు. ఎన్నికలకు వారం రోజుల ముందు బీజేపీ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెసుకు 64, బీజేపీకి 60 స్థానాలు పక్కాగా వస్తాయని తేలింది. 55 సీట్లలో నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఇక్కడ న్యూట్రల్ ఓటర్లు, స్వింగ్ ఓటర్లే కీలకం కాబోతున్నట్లు కమల నాథులు గ్రహించారు. కాంగ్రెసుతో పోటాపోటీగా ఉన్న 55 సీట్లపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టి అందులో 38 స్థానాలను బీజేపీ ఖాతాలో పడేలా చేసుకోగలిగారు. ఇదే ఫలితాన్ని నిర్దేశించింది. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో కనీసం సగం దక్కించుకోగలిగినా కాంగ్రెసు గట్టెక్కి ఉండేది.

సొంత పద్దు సాంతం సున్నా...

ప్రాంతీయ నాయకత్వాన్ని బలంగా తయారు చేసుకోకపోతే కాంగ్రెసుకు భవిష్యత్తులో కూడా కష్టాలు తప్పవు. మోడీ ఢిల్లీ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానం భర్తీ చేయడం ఇప్పటికీ బీజేపీకి గుజరాత్ లో కష్టమవుతోంది. అయితే సొంత రాష్ట్రం కావడంతో నేనున్నాననే భరోసానిస్తున్నారు ప్రధాని. దాంతో లోకల్ లీడర్షిప్ లోపాలను కొంతమేరకు కప్పి పుచ్చగలుగుతున్నారు. కానీ కాంగ్రెసుకు అటువంటి అవకాశం లేదు. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. బీజేపీకి కాంగ్రెసును ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలంటే కచ్చితంగా ఒక బలమైన నాయకుడు ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది. శంకర్ సింగ్ వాఘేలా బయటికి వెళ్లిపోయిన తర్వాత పార్టీని సొంతం చేసుకుని పట్టుమని పదిసీట్లు గెలిపించే నాయకుడు రాష్ట్రంలో కాంగ్రెసుకు కరవు అయ్యాడు. కనీసం కాంగ్రెసు అజెండాను భుజాన వేసుకుని ఊరూరూ తిరిగిన హార్దిక్ పటేల్ స్థాయిలో కూడా కాంగ్రెసు నేతలు పని చేయలేదు. ఇది పార్టీకి రాజకీయంగా భవిష్యత్తులో కూడా సవాల్ గానే చూడాల్సి ఉంటుంది. అల్పేష్ ఠాకూర్, జిగ్నేస్ మేవాని వంటి నాయకులు కొత్త శక్తులుగా రూపుదాల్చడం ఈ ఎన్నికల్లో మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. భవిష్యత్తులో రాష్ట్రంలో యువ నాయకత్వం అభివృద్ధి చెందడానికి ఇదో సంకేతం.

భవిష్యత్ సూచి...

పెద్దగా క్యాడర్ బలం లేదు. నాయకత్వ లోపాలు వెన్నాడినా కాంగ్రెసు బాగానే పుంజుకుంది. బీజేపీ గ్రామ ప్రాంతాలను, వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రత్యర్థి కాంగ్రెసుకు కలిసొచ్చింది. 150 ప్లస్ అంటూ ఎన్నికల పాట మొదలెట్టిన బీజేపీకి వందలోపు సీట్లు, వేళ్లమీద లెక్కించదగ్గ మెజారిటీ దఖలైంది. అలాగని గుజరాత్ ప్రజలు బీజేపీని తిరస్కరించారని చెప్పడం తప్పు. 2012 ఎన్నికల కంటే 1.2 శాతం వరకూ అదనంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు కు మాత్రం 2.5 శాతం వరకూ ఓట్లు పెరిగాయి. బీజేపీకి, తమ కు మధ్య 2002,2007,2012 లో వచ్చిన ఓట్ల అంతరాన్ని కాంగ్రెసు గణనీయంగా తగ్గించుకోగలిగింది. బలమైన ప్రజామద్దతు కలిగిన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వీటన్నిటికంటే ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై గుజరాత్ ఎన్నికల ప్రభావం పడనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు గుజరాత్ ప్రజలు మద్దతిచ్చారని ప్రధాని మోడీ పైకి ఎన్ని ప్రకటనలు చేసినా తీర్పు బీజేపీ నాయకుల్లో అసంతృప్తినే మిగిల్చింది. ఏకపక్షంగా దేశం మొత్తాన్ని దున్నేయవచ్చనుకున్న మోడీ , అమిత్ షా ద్వయం స్పీడుకు బ్రేకులు పడ్డాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో గుజరాత్ స్థాయిలో బీజేపీకి బూత్ ల వారీ మేనేజ్ చేయగలిగిన కార్యకర్తలు, వ్యూహకర్తలు లేరు. ఈ రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలకు వెళుతున్నాయి. కాంగ్రెసుకు ఆయా రాష్రాల్లో మంచి యువ నాయకత్వం ఉంది. ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రభావం కూడా అంతంతమాత్రమే. అందువల్ల బాగా కష్టపడి ప్రజలను చేరుకోగలిగితే ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితమైన కాంగ్రెసు తన పరిధిని విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే జరిగితే 2019 ఎన్నికలకు హస్తం పార్టీలో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. జమిలీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికల వంటి దుందుడుకు చర్యలకు పాల్పడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని మోడీ, అమిత్ షా లకు గుర్తు చేశాయి గుజరాత్ ఫలితాలు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News