కమలం ఖేల్ ఖతం... దుకాణం బంద్...?

Update: 2017-11-04 15:30 GMT

అత్యాశకు పోతే ..అసలుకే మోసం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దున్నేయవచ్చనుకున్న బీజేపీకి ఇప్పట్నుంచే దుశ్శకునాలు కళ్లముందు కదలాడుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు రాష్ట్రాల్లోనూ తన బలాన్ని మించి లబ్ధి పొందింది బీజేపీ. తెలుగుదేశానికీ ఈ మైత్రి కలిసొచ్చింది. ముందునుంచీ బీజేపీ తెలంగాణ నేతలు టీడీపీతో చేయి కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో కలిసి నడిచారు. హైదరాబాదు పరిసరాల్లోనే బీజేపీకి అయిదు ఎమ్మెల్యేసీట్లు, ఒక ఎంపీ సీటు దక్కింది. సీమాంధ్ర సెటిలర్లు ఏకపక్షంగా ఈ కూటమిని బలపరచడంతోనే ఇది సాధ్యమైంది. అయితే ఆ తర్వాత ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెసు క్రమేపీ బలహీనపడటం, తెలుగుదేశం అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారడంతో తామే బలమైన ప్రత్యామ్నాయంగా మారతామని బీజేపీ నాయకులు ఊహించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళతామని అతివిశ్వాసం ప్రకటించారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో సహా అందరితోనూ ఇదే ప్రకటన చేయించారు. రాజకీయాల్లో రోజులన్నీ ఒకేలా ఉండవు. తాజాగా కాంగ్రెసు చుట్టూ జేఎసీలు, పౌరవేదికలు, ప్రజాసంఘాలు జతకూడుతున్నాయి. టీటీడీపీ నుంచి కూడా నియోజకవర్గ స్థాయి ప్రాధాన్యం ఉన్న నాయకులు కాంగ్రెసు వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారపక్షానికి ప్రదాన ప్రత్యామ్నాయం కాంగ్రెసు పార్టీ మాత్రమేనన్నవాతావరణం ఏర్పడింది. మరోవైపు అమిత్ షా పర్యటనతో కొన్ని నెలల క్రితం వేగం పెంచాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులు కనిపించడం లేదు. క్యాడర్ లో ఉత్సాహం తొణికిసలాడటం లేదు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి రెండు మూడు ప్రాంతాల్లో తప్ప ఎక్కడా పార్టీ కనీసం డిపాజిట్లు సాదిస్తుందన్న నమ్మకం క్యాడర్ లోనే లేదు. ఈలోపుగానే బీజేపీ ఆర్భాటానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సంకెళ్లు తెంచుకున్న సైకిల్

బీజేపీ తనంత తానుగానే టీడీపీకి దూరమని గతంలో ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి స్వేచ్ఛ లభించింది. తెలంగాణలో ఇకపై ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు అభ్యంతరాలు, ఆటంకాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో సంకీర్ణప్రభుత్వాన్ని నడుపుతున్న నేపధ్యంలో ఒకే పార్టీతో రెండు రాష్ట్రాల్లో రెండు వైఖరులు తీసుకోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తుంది. కానీ జాతీయపార్టీయే ఆ వెసులుబాటును కల్పించడంతో టీడీపీ తన ప్రయోజనాల దృష్టిలోనే ఇక నిర్ణయాలు తీసుకోవచ్చు. అధికారపక్షమైన టీఆర్ఎస్ తో చేయి కలిపినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇందుకు బీజేపీనే ఒక మార్గం చూపింది. తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెసుతో చేతులు కలపలేదు. ఇటు బీజేపీ పొమ్మంటోంది. ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ను ఎంచుకుంటే తప్పేమిటన్న వాదనకు ఆస్కారం ఏర్పడింది. వస్తుసేవల పన్ను అమలు, నోట్లరద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలతో అర్బనైజేషన్ ఎక్కువగా కనిపించే తెలంగాణలో బీజేపీకి, మోడీకి ఆదరణ తగ్గింది. నిజానికి 2014 ఎన్నికల్లో మోడీ జాతీయ నేతగా ప్రవేశించినప్పటి ఉత్సాహం కూడా పార్టీలోనూ, ప్రజల్లోనూ ఇప్పుడు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీని దూరం చేసుకోవడం స్వయంకృతాపరాధమే. ఒంటరిగా బరిలోకి దిగితే భంగపాటు తప్పకపోవచ్చని పరిశీలకుల అంచనా. ఒక రకంగా తెలంగాణలో నిర్దేశక పాత్ర నుంచి అనామక పార్టీగా మిగిలిపోయే పరిస్థితిని చేజేతులారా కొని తెచ్చుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలోనూ ఎదురీతే...

మళ్లీ తిరిగి ప్రధానిగా మోడీ ఎన్నికవుతారన్న సంశయం లేకుంటే బీజేపీతో ఏపీలో కూడా తెగతెంపులు చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు సర్వదా సిద్ధమే. కానీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి. పోలవరం, విదేశీసాయంతో అమలు చేసే ప్రాజెక్టులకు కేంద్రం పూచీకత్తు, రాజధాని నిర్మాణానికి క్లియరెన్సుల వంటివన్నీ కేంద్రంతో ముడిపడిన అంశాలు. పైపెచ్చు బీజేపీతో పొత్తు కారణంగానే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంటు ఉండనే ఉంది. అయితే తాజాగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో మైనారిటీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీని పూర్తిగా దూరంగా పెట్టారు. టీడీపీ ఘనవిజయం సాధించింది. కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ కార్పొరేటర్ల విజయం 70శాతం వరకూ ఉండగా, బీజేపీకి కేటాయించిన సీట్లలో విజయం 40 శాతానికే పరిమితమైంది. దీంతో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ బలహీనంగా ఉన్న విషయం రుజువైంది. తాము పొత్తును వదులుకుంటే వైసిపి బీజేపీకి చేరువ కాదన్న విషయం స్పష్టమైతే టీడీపీ కూడా కమలానికి చేయిచ్చేసే చాన్సులే ఎక్కువ. ఇందుకు కావాల్సినన్ని సాకులు సిద్దంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కనీసం ప్రత్యేక ప్యాకేజీకి నిధులివ్వలేదు. పోలవరం నిర్మాణానికి సకాలంలో సహకరించడం లేదు. విశాఖకు రైల్వేజోన్ మంజూరే చేయలేదు. వీటన్నిటిని కారణాలుగా చూపి ఎన్నికల తరుణంలో టీడీపీ బీజేపీని దూరం పెట్టేయవచ్చు. వైసీపికి మైనారిటీ , దళిత ఓటింగు ప్రధానమైనది. వీటికి తోడు ప్రత్యేక హోదా అంశాన్ని ఇటీవలికాలంలో మళ్లీ లేవనెత్తుతోంది. సో, బీజేపీతో కలవడం వైసీపీకి ఆత్మహత్యాసదృశమవుతుంది. అటు ఏపీలో పవన్ కల్యాణ్ జనసేనతో, ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ తో కలిసి రెండు చోట్లా జెండా ఎగరేసేందుకు టీడీపీ ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రెంటికీ చెడ్డ రేవడిలా కమలనాథులు మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News