క‘మండల్ ’ కసరత్తు?

Update: 2017-10-04 08:30 GMT

అధికారాన్ని శాశ్వతం చేసుకొనేందుకు కమల నాథులు మరో మండల్ కసరత్తు కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఓబీసీ ప్రయోజనాల సమ పంపిణీ పేరుతో వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణ నిమిత్తం జస్టిస్ రోహిణి కమిషన్ నియామకం దేశరాజకీయ చిత్రపటంపై పట్టు బిగించేందుకు వేస్తున్న తొలి అడుగు. సమాజంలోని భిన్న వర్గాలను చేరువ చేసుకునేందుకు ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు తెలివైన ఎత్తుగడ. ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ)కు గడచిన రెండున్నర దశాబ్దాలుగా అమలు చేసిన రిజర్వేషన్ల సాఫల్యవైఫల్యాలు, సాధికారత పై సమీక్షించబోతున్నారు. అదే సమయంలో ఓబీసీల ఉపవర్గీకరణ ద్వారా మరిన్ని కులాల మన్నన పొందేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు.

మండల్ రిజర్వేషన్లతో.....

భారత రాజకీయాల దశదిశ మార్చేసి కొన్ని సామాజిక వర్గాలు రాజకీయాధిక్యాన్ని సాధించడానికి దోహదం చేసిన ఘనత మండల్ రిజర్వేషన్లకు దక్కుతుంది. సామాజికంగా , విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు విద్యా,ఉద్యోగ ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో మొరార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్న సమయంలో బి.పి.మండల్ నేతృత్వంలో కమిషన్ ను నియమించారు. 1980లో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎస్సీ, ఎస్టీలను మినహాయించి 3743 కులాలు, జాతులకు చెందిన ప్రజలు సామాజిక,విద్యారంగాల్లో వెనకబడి ఉన్నారని నిర్ధారించింది. దేశ జనాభాలో వీరి సంఖ్య 52 శాతం. 2006లో వెనకబడిన వర్గాల కమిషన్ ఆయా కులాలు,.జాతుల సంఖ్యను 5013కి పెంచింది. మండల్ కమిషన్ సిఫార్సు మేరకు 1990లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)కు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేశారు. 1993 నుంచి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. రాజకీయంగా ఇది అత్యంతప్రభావశీలమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగాలు పొందడమే కాకుండా ఓబీసీలు సంఘటితమయ్యేందుకు ఉపకరించింది. ఆయా వర్గాలకు చెందిన నేతలు రాజకీయంగా ఎదిగేందుకు సానుకూలత ఏర్పడింది. ములాయం, లాలూ ఈ రకంగా పైకొచ్చినవారే. కులవృత్తులు, కాయకష్టం చేసుకుని జీవించేవారు. బాల్యవివాహాలతో అనారోగ్యం కొని తెచ్చుకునేవారు. విద్యార్జనలో ఉన్నతస్థాయికి చేరుకోలేనివారు. మధ్యలోనే బడులు మానేసే విద్యార్థులు ఇలా అనేక ప్రాతిపదికల ఆదారంగా సమాజంలోని మిగిలిన కులాలవారీతో పోల్చి ఓబీసీల వెనకబాటుతనాన్ని మండల్ కమిషన్ నిర్ధారించింది. అయితే 5013 ఓబీసీ కులాల్లో రిజర్వేషన్లను అందిపుచ్చుకుని సామాజికంగా ఎదిగిన కులాలు, వర్గాలు కేవలం 12 వందల వరకూ మాత్రమే ఉన్నట్లు ఒక అంచనా. రిజర్వేషన్ల ఫలాలను కేటాయించిన వర్గాల్లో 22 నుంచి 25 శాతం ప్రజలే గంపగుత్తగా పొందుతున్నారనే భావన నెలకొంది.

జస్టిస్ రోహిణి కమిషన్ తో......

ఇంకా ఏయే వర్గాలు ఓబీసీ ప్రయోజనాలు అందుకోకుండా చీకట్లో మగ్గిపోతున్నాయన్న అంశాన్ని జస్టిస్ రోహిణి కమిషన్ సమీక్షిస్తుంది. అందరికీ రిజర్వేషన్లు ఫలాలు అందేలా ఆయా కులాలను ఉపవర్గీకరించి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ల ప్రాతిపదికను సవరించేందుకు సిఫార్సులు కూడా చేస్తుంది. ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో యాదవులు గణనీయంగా లాభం పొందారు. వెనుకబడిన వర్గాల్లోనే ఉన్న ఇతర కులాలు యాదవులతో పోటీపడలేక ప్రయోజనాలు అందుకోలేకపోయాయి. ఈరకంగా చూస్తే రిజర్వేషన్లు ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. ఈ అసంతృప్తి మిగిలిన వర్గాల్లో ఉంది. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా యాదవేతర బీసీలు, అత్యంత వెనకబడిన కులాల(ఎంబీసీ)ను సమీకరించి గెలుపుసాధించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ప్రాబల్య బీసీ కులాలే రిజర్వేషన్లు పొందుతుండటంతో మిగిలిన వర్గాలు నిరాశ చెందుతున్నాయి. వారి కోటా వారికే చెందేలా పునస్సమీక్ష , పునర్విభజన చేయగలిగితే వారంతా బీజేపీకి రుణపడి ఉంటారు. ఉత్తరప్రదేశ్ ప్రయోగం సాధికారికంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తేవడం ద్వారా రాజకీయంగా తన బలాన్ని సంఘటితం చేసుకోవచ్చని కమలనాథుల యోచన. నిజానికి మండల్ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినప్పట్నుంచీ కాంగ్రెసు తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో 20 సూత్రాల పథకం , దళితుల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎస్సీ,ఎస్టీల్లో బలమైన పట్టు సాధించింది. బహుజనసమాజ్ వంటి పార్టీలు పుట్టుకురావడం, బీసీలకు మండల్ రిజర్వేషన్లతో కాంగ్రెసు ఏకచ్ఛత్రాధిపత్యం దెబ్బతింది. 2004 నుంచి 2014 వరకూ సంకీర్ణ సారథిగా కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ పునాదిని పటిష్ఠ పరుచుకునే ప్రయత్నాలు చేయలేకపోయింది. మండల్ రిజర్వేషన్ల అమల్లోని లోపాలపై దృష్టి పెడితే మెజార్టీ వర్గాలను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని బీజేపీ చక్కగా వినియోగించుకుంటూ 2019 ఎన్నికలకుగాను రాజకీయ చదరంగంలో పావులు కదుపుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News