కన్ఫ్యూజన్ లో కామ్రేడ్లు....!

Update: 2018-02-15 15:30 GMT

రోజురోజుకీ కుచించుకుపోతున్న కమ్యూనిస్టు పార్టీలు కుమ్ములాటలు మాత్రం మానడం లేదు. సైద్దాంతిక వర్గ విభేదాలతో ఆరోదశకంలో భారత కమ్యూనిస్టు పార్టీ రెండు ముక్కలైంది. విధివిధానాల పరమైన వైరుద్ధ్యాలతోపాటు ముఠాతత్వమే చీలికకు ప్రధాన కారణంగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో వామపక్షాల్లో మార్క్సిస్టు పార్టీ (సీపీఎం) దేశవ్యాప్తంగా ప్రధాన పక్షంగా అవతరించింది. పశ్చిమబంగ, కేరళ, త్రిపుర వంటి చోట్ల అధికారాన్ని కూడా సాధించగలిగింది. కానీ పశ్చిమబంగలో 2011 తర్వాత క్రమేపీ క్షీణదశలో పడింది. చిన్నరాష్ట్రమైన త్రిపురలో కూడా ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఎదురీత తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఒక్క కేరళలో మినహాయించి దాదాపు దేశవ్యాప్త ప్రాబల్యం క్షీణించినట్లేననేది రాజకీయ వర్గాల అంచనా. ఈ స్థితిలో కూడా మూలసిద్దాంతాల ఆధారంగా పార్టీని పటిష్టం చేసుకునే పనిని విడిచిపెట్టి ముఠాల కొట్లాటలో సొంత ఉనికికే ముప్పు తెచ్చుకుంటోంది. ప్రజాక్షేత్రంలో పలచనైపోతోంది. సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ వర్గాల విభేదాలు పతాకస్థాయికి చేరి పార్టీ ప్రస్థానాన్నే సంక్షోభం దిశలోకి తీసుకెళుతున్నాయి. 1962 కమ్యూనిస్టు పార్టీలో చీలికకు పునాది వేసిన నాటి పరిస్థితులు మార్క్కిస్టు పార్టీలో మళ్లీ కనిపిస్తున్నాయనేది రాజకీయవర్గాల భావన.

ప్రాంతీయ స్వార్థం...

దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాష్ట్రాలైన పశ్చిమబంగ, కేరళ లలో పార్టీ రెండు దారులుగా చీలిపోయింది. పశ్చిమబంగలోని పార్టీ శాఖ, కేరళలోని పార్టీ శాఖ పరస్పరం ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నించడం గడచిన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఈ విభేదాలు 2005లో కేరళకు చెందిన కారత్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింతగా పెరిగి పెద్దవయ్యాయి. అంతవరకూ పార్టీలో పశ్చిమబంగ శాఖ చెప్పిన మాటకు చాలా మన్నన దక్కుతుండేది. కారత్ వ్యూహాత్మకంగా తన పదవీ కాలంలో పశ్చిమబంగకు అంతంతమాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కేరళ శాఖ ప్రాముఖ్యాన్ని పెంచుతూ వచ్చారు. ఈలోపు 2011లో బెంగాల్ లో సీపీఎం అధికారాన్ని కూడా కోల్పోవడంతో సహజంగానే రాష్ట్ర శాఖ మాట చెల్లుబాటు కాని స్థితి ఏర్పడింది. పశ్చిమబంగ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత సీతారాం ఏచూరి 2015లో ప్రధానకార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకోవాలంటే కాంగ్రెసుతో కలవకతప్పదన్న రాష్ట్రశాఖ సూచనకు తలొగ్గి కాంగ్రెసుతో అవగాహనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. వికటించింది. ఇదే అదనుగా కారత్ వర్గం , సీతారాం ఏచూరి వర్గంపై అంతర్గతంగా పార్టీ వేదికలపై దాడిని మొదలుపెట్టింది. కేరళలో పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు కావడంతో జాతీయంగా ఉండే అవసరాలను పణంగా పెట్టి రాష్ట్ర, ప్రాంతీయ స్వార్థాన్నే నొల్లుకోవాలని చూస్తుండటం పెద్ద చర్చకు దారితీస్తోంది. కానీ పార్టీలో ఈ మొర వినేవాడు కరవవుతున్నాడు.

ఐక్యతకు హంసపాదు....

నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయజనతాపార్టీ దేశవ్యాప్తంగా భారీ విజయాలు నమోదు చేస్తూ విస్తరిస్తోంది. 2019లో కూడా తనకు ప్రత్యర్థిలేరన్న రాజకీయవాతావరణం సృష్టిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయపార్టీలుగా గుర్తింపు ఉన్న కాంగ్రెసు,సీపీఎంలు ప్రాంతీయపార్టీలను కలుపుకుంటూ ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించాలని ప్రజాస్వామ్య హితైషులు కోరుకుంటున్నారు. కానీ సీపీఎంలోని వర్గాలు, ప్రాంతీయతత్వం వల్ల ఈ విశాల ప్రయోజనానికి విఘాతం కలుగుతోంది. ఇటీవల కలకత్తాలో జరిగిన అత్యున్నత విధాన నిర్ణాయక సంఘమైన సెంట్రల్ కమిటీ సమావేశాల్లోనే సీపీఎం విభేదాలు బట్టబయలయ్యాయి. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెసుతో కలిసి నడవాలని ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించగా, కారత్ నేతృత్వంలోని ప్రధానవర్గం ఈ తీర్మానాన్ని ఓడించింది. ఐక్య కూటమి అవకాశాలకు గండి కొట్టింది. కాంగ్రెసుతో పొత్తు ద్వారాలను మూసివేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి 2019 ఎన్నిక నల్లేరుపై బండి నడకగా మారేందుకు తానే మార్గం సుగమం చేస్తోంది. వ్యక్తిగత ద్వేషాలు, ముఠాలు పార్టీనే కాకుండా జాతీయంగానూ రాజకీయ పునరేకీకరణను దెబ్బతీస్తున్నాయి. సీపీఎం కు ప్రస్తుతం పెద్దగా బలం లేకపోయినా కాంగ్రెసు, సీపీఎంలు కలిసి నడుస్తున్నాయనే భావన మిగిలిన పార్టీలు వీటి చెంత చేరేందుకు ప్రాతిపదికను నిర్మిస్తాయి. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఈ కూటమి చుట్టూ జట్టు కట్టే అవకాశాలు మెరుగుపడతాయి. కానీ తన తాజా నిర్ణయంతో ఐక్యతకు ఆదిలోనే హంసపాదు పెట్టింది మార్క్సిస్టు పార్టీ.

చారిత్రక తప్పిదాలే....

గతంలో జ్యోతిబసు ప్రధాని అయ్యే అవకాశాన్ని తోసిపుచ్చి మార్క్సిస్టులు దేశవ్యాప్తంగా బలపడే పరిస్థితులను కాలదన్నుకున్నారు. ఈ చారిత్రక తప్పిదంతో తర్వాత కాలంలో పార్టీ క్షీణించిపోవడానికి కారణమయ్యారు. బలమైన సైద్ధాంతిక భావనతో పార్టీ వాదనను వినిపించే ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ని మరోసారి రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా సీపీఎం ఇటీవల తోసిపుచ్చింది. కాంగ్రెసు సహకారంతో ఆయన ఎన్నిక కావాల్సి ఉండటంతో కేరళ వర్గం దీనిని అడ్డుకుంది. ఈ నిర్ణయంతో బలమైన వాణిని, పార్లమెంటులో మోడీ వంటివారిని నిలదీసే తార్కిక వాదనను మార్క్సిస్టు పార్టీ కోల్పోనుంది. తాజాగా రాజకీయ వ్యూహాత్మక పంథాను కేంద్రకమిటీ ప్రకటించింది. పరస్పర విరుద్దమైన భావనలతో కూడిన గందరగోళానికి తెరలేపింది. బీజేపీ ప్రథాన శత్రువు , దానిని అధికారంలోకి రాకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెసుతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని రెండో మాటలో తేల్చేసింది. యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో లేని వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీల బలం మొత్తం కలిపినా లోక్ సభ సీట్ల సంఖ్య వంద దాటదు. మరి అటువంటి స్థితిలో కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏతో ఎన్నికలకు ముందుగా కలిస్తే రాజకీయంగా చాలా ప్రభావాన్ని చూపవచ్చు. తటస్థ ఓటర్లను సైతం కూటమి వైపు ఆకర్షించవచ్చు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఈ కూటమి వైపు మళ్లించుకోవచ్చు. కానీ ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటున్న మొండితనం రాజకీయంగా మొదటికే మోసం తెస్తోంది. మరో చారిత్రక తప్పిదానికి లెంపలేసుకునే పరిస్థితికి దారి తీస్తోంది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News