కత్తులు...కాదు.....ఇక కసరత్తులే.....!

Update: 2018-02-10 14:30 GMT

కేసీఆర్ కత్తులు దూయడం లేదు. కసరత్తు మొదలుపెట్టారు. కాంగ్రెసుకు భిన్నంగా పక్కా అంచనాలు, పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పట్టి ప్రజాభిప్రాయాన్ని మదింపు చేసే ఎత్తుగడతో కదులుతున్నారు. జాతీయంగా ప్రఖ్యాతి వహించిన మూడు పరిశోధక సంస్థలతో ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో కులాలు, వర్గాలు, వయోభేదాలు, జీవన ప్రమాణాల ఆధారంగా క్లాసిఫై చేసి నమూనాలు సేకరిస్తారు. ఏ వర్గాల ప్రజలు టీఆర్ఎస్ కు ఎంతశాతం మద్దతుగా నిలుస్తున్నారు? ఏయే నియోజకవర్గాల ప్రజలు ఇంకా ఏమేం కోరుకుంటున్నారు? కులాలవారీ మొగ్గు ఎటువైపు ఉంది? మధ్యతరగతిలో మన్నన దక్కేదెవరికి? ఇటువంటి సామాజిక స్తరీకరణలతో కూడిన శాంపిల్ సర్వే చేపడుతున్నారు. ఇందులోనూ ఏ ఒక్కసంస్థపైనో ఆధారపడకుండా మూడు సంస్థలను ఎంచుకుని ఒకదానికొకటి సంబంధం లేని ప్రశ్నావళితో పక్కా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు సంస్థల సగటును లెక్కించి ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణాన్ని బేరీజు వేస్తారు.

మిలియన్ మీటర్...

వచ్చే ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రసమితికి మిలియన్ మీటర్ ప్రధాన కొలబద్ద కాబోతోంది. సర్వే బాద్యతలు స్వీకరించిన మూడు సంస్థలు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు వేల మంది ఓటర్ల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సేకరిస్తాయి. ఆయా సంస్థల ప్రతినిధులు 3.5 లక్షల మందిని కలిసి నేరుగా సమాచారం తీసుకుంటారు. దానిని క్రోడీకరించి, విశ్లేషించి , వాస్తవస్థితిని రిపోర్టు రూపంలో అందిస్తారు. మూడు సంస్థలు కలిసి పదిన్నర లక్షల వరకూ ప్రజలను కలుస్తారు. క్రైటీరియాలు వేర్వేరుగా నిర్ధారించడంతో ఒక సంస్థ కలిసిన వ్యక్తి మరో సర్వేలో నమోదు కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. మూడు సంస్థల నియోజకవర్గాలు అవే అయినప్పటికీ వేర్వేరు ఓటర్లను కలుస్తాయన్నమాట. దీనివల్ల కచ్చితత్వం, గరిష్టంగా నియోజకవర్గ అభిప్రాయం వెల్లడవుతాయి. నియోజకవర్గంలో సగటున 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకుంటే పదివేల మంది ఈ సర్వేలో అభిప్రాయాలు వెల్లడిస్తారు. అంటే నూటికి అయిదు మందిని కలుస్తారన్నమాట. రాష్ట్రంలో సాగుతున్న అతిపెద్ద పొలిటికల్ సర్వేగా దీనిని చెప్పాల్సి ఉంటుంది. రానున్న మూడు నెలల్లో ఈ ఫలితాలు మదింపు సాగుతుంది. సర్వే అంచనాలకనుగుణంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. టీఆర్ఎస్ విధానాల్లో మార్పులు కోరుకుంటున్నారా? ఎమ్మెల్యేల పనితీరు ఏవిధంగా ఉంది? ప్రజాసమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, పార్టీ, ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు? అన్న అంశాలు ఈ సర్వేలకు ప్రాతిపదికగా నిలవనున్నాయి.

శక్తి వర్సస్ యుక్తి...

ఈసారి సోషల్ మీడియా కూడా ఎన్నికలకు ప్రధాన ప్రచార వనరు కాబోతోంది. నిజానికి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక పార్టీగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకున్నది అంతంతమాత్రమే. అయితే తెలంగాణ సెంటిమెంటును ఇష్టపడే యువకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. అందులోనూ ఉద్యమ వేడి తగ్గకపోవడంతో తెలంగాణ రాష్ట్రసమితికి మంచి ప్రచారమే లభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నది టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమే. దీనికి ప్రత్యామ్నాయంగా సొంతంగా సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేసుకుని 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది అధికారపక్షం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఈవిషయంలో చాలా ముందంజలో ఉంది. శక్తి అనే ప్రత్యేక యాప్ ద్వారా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో కార్యకర్తల అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. రెండువైపుల నుంచి సమాచార పంపిణీ కి కూడా అవసరమైన సౌలభ్యం సమకూర్చుకున్నారు. దీనిని గమనించి ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఇదే రకమైన ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసులోపు గల యువత టీవీలు, పత్రికలు వంటివాటిపై ఆధారపడటం లేదు. సమాచార పంపిణీ, మార్పిడి, ప్రసారం అంతా సోషల్ మీడియా వేదికగానే సాగిపోతోంది. వీరిని టార్గెట్ చేసుకుంటూ టీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల స్ట్రాటజీని వర్కవుట్ చేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News