కడుక్కోవడమే... కమలం పని?...

Update: 2018-05-10 14:30 GMT

రాజకీయాలు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. ఎదుటి పక్షాన్ని తుత్తునియలు చేసేందుకు ప్రత్యర్థులు ఎంతకైనా తెగిస్తారు. అబద్ధాలు చెప్పడమే కాదు. నిజాలను వక్రీకరించడమూ నిరంతరం సాగుతుంటుంది. ఏ చిన్న అవకాశాన్ని అయినా ట్విస్టు చేసి ప్రత్యర్థిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తుంటారు. కుచించుకున్న పరిధిలో, పరిమిత లక్ష్యాలతో ప్రాంతీయ అస్తిత్వంతో కొనసాగే పార్టీలకు ఉండే వెసులుబాటు జాతీయ పార్టీలకు ఉండదు. అందువల్లనే అవి నిరంతరం సంకటపరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాయి. తాజాగా కమలం పార్టీకి ఈ కష్టాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి ముందుగానే పీక్ కు చేరిన దశలో బీజేపీ బూచిని చూపించి లబ్ధి పొందేందుకు గరిష్టంగా ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. నిజానికి బీజేపీ ఈరెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీకాదు. అయినప్పటికీ బీజేపీ ఎత్తుగడలను భూతద్దంలో చూపిస్తూ భారీగా ఓట్లు కొట్టేయాలని చూస్తున్నాయి. ప్రధానపార్టీతో ఏదో రకంగా బీజేపీకి లింకు పెట్టి భయపెట్టి తమ పార్టీకే ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

కేసీఆర్ మిషన్...

కేసీఆర్ చేపట్టిన మిషన్ ఫెడరల్ ఫ్రంట్ ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రత్యర్థులందరూ బీజేపీ ఖాతాలో వేసేస్తున్నారు. అసలీ ఆలోచన వెనక ఉంది బీజేపీనే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణలో అసలు కమలం పార్టీకి పెద్దగా సీన్ లేకపోయినప్పటికీ కేసీఆర్ మాత్రం కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా ఇతర పక్షాలను కలవడం కాంగ్రెసు వ్యతిరేక ఫ్రంట్ గా తీర్చిదిద్దడానికేననే ఆరోపణలున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పక్షాలు కాంగ్రెసుతో జట్టుకట్టకుండా నిరోధించేందుకే కేసీఆర్ వ్యూహం పన్నుతున్నారనే లాజిక్ ను లేవనెత్తుతున్నారు. ఈ మొత్తం కుట్రలో బీజేపీ తెర వెనక సారథ్యం లో టీఆర్ఎస్ అధినేత నడుస్తున్నారనే విమర్శలను ఎవరూ తిప్పికొట్టలేకపోతున్నారు. వివిధ రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న 15 వ ఆర్థిక కమిషన్ నిబంధనావళికి వ్యతిరేక సదస్సునూ తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించడాన్ని దీనికి ఆధారంగా చూపుతున్నారు. ఈ వివాదం ఒకవైపు నలుగుతుండగానే మరోవైపు కేసీఆర్ ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారు. బీజేపీతో టీడీపీకి కటీఫ్ అయిన నేపథ్యంలో కేసీఆర్ కేంద్రం సూచనల మేరకు చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఓటుకునోటు కేసును మరోసారి చర్చనీయం చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి. బీజేపీకి ఒకరకంగా ఇది జాతీయంగా నష్టదాయకమే. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో బీజేపీకి పెద్దగా స్టేక్స్ లేవు. కానీ దీని ప్రభావం నేషనల్ పాలిటిక్స్ పై పడుతుంది. తనకు దూరమైన పక్షాలపై ఏదో రూపంలో బీజేపీ కక్ష సాధింపునకు పూనుకొంటోందనే వాదనకు బలం చేకూరుతుంది. పాత్ర ఉన్నా లేకపోయినా కేసీఆర్ నిర్ణయాల్లో తన ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీపై పడుతోంది. అయినా కేంద్రానికి అనేక రకాల దర్యాప్తునిఘా సంస్థలున్నాయి. వాటన్నిటినీ వదిలేసుకుని అనిశ్చిత నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బీజేపీకి తెలియదనుకోవాలా?

జనసేన జంకు...

జనసేన వ్యూహకర్తగా దేవ్ ను ఎంపిక చేసుకోగానే గగ్గోలు మొదలైంది. బీజేపీ తన మనిషిని సేన శిబిరంలోకి పంపేసిందంటూ వార్తలు మొదలయ్యాయి. చంద్రబాబును వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు, జనసేనను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు దేవ్ పాత్రను పరిచయం చేశారంటూ కమలనాధులపై విరుచుకుపడుతున్నవారి సంఖ్య చాలా ఉంది. మొత్తం జనసేన పార్టీయే కమలం కనుసన్నల్లో నడుస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ప్రత్యేక హోదా అంశాన్ని రెండేళ్ల క్రితమే లేవనెత్తి గొడవ చేసిన పవన్ కల్యాణ్ నేపథ్యాన్ని ఉద్దేశపూర్వకంగానే టీడీపీ పక్కన పెట్టేసింది. దేవ్ పకడ్బందీ ప్లాన్ కు పడిపోయిన పవన్ అతని బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా వ్యూహాత్మక తప్పిదం చేశారు. దీనిని టీడీపీ రాజకీయంగా ఎన్ క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టింది. జనసేనను తిట్టడమెంత ప్రధానమో బీజేపీని టార్గెట్ చేయడం కూడా టీడీపీకి పొలిటికల్ గా చాలా అవసరం. దాంతో దేవ్ ను సాకుగా చూపుతూ కమలాన్ని కడిగిపారేస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సైకిల్ పార్టీ సవాల్ విసురుతోంది. తనకు దూరమైన పవన్ కల్యాణ్ ను తాము శత్రువగా భావిస్తున్న బీజేపీని ఒకే గాటన కట్టి రాజకీయం ప్రారంభించింది. దేవ్ జనసేన ప్రవేశానికి తమకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపై పడింది. అటుఇటూ ఎటూ తేల్చిచెప్పలేని పరిస్థితిని జనసేన ఎదుర్కొంటోంది. ‘దేవ్’ డా మజాకా అన్నట్లుగా ఉంది పవన్ పరిస్థితి. ఆ వాసుదేవుడు మళ్లీ చర్చల్లోకి రాకుండా పోయాడు. ఇంతకీ ఈ వ్యూహకర్త ఉన్నట్టా? లేనట్టా? ఇదే పెద్ద ప్రశ్న.

కన్నడ లింకు...

జేడీఎస్ ను సపోర్టు చేస్తానని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. దానికి బీజేపీ లింకు పెట్టేశారు కాంగ్రెసు నాయకులు. ప్రత్యక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా పరోక్షంగా ఆ పార్టీకి సహాయపడేలా టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోందని కమలానికి బురద పులిమేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం వరకూ తెలుగు ప్రజలు ఉన్నారు. 30 నియోజకవర్గాల్లో ఫలితాలను శాసించే స్థాయి తెలుగు ప్రజలకు ఉంది. ఇక్కడ స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోకుండా గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తోంది తెలుగుదేశం. నేరుగా కాంగ్రెసుకు ఓటేయమని ప్రచారం చేయలేకపోతోంది. బీజేపీని ఓడించమని కోరుతోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్, కేసీఆర్ వంటి వారు జేడీఎస్ కు మద్దతు పలుకుతామంటే మాత్రం బీజేపీకి సహకరించడమని ఆరోపిస్తోంది. కన్ఫ్యూజన్ తో గందరగోళం సృష్టిస్తూ బీజేపీ తప్పిదాలనే ఏకరవు పెడుతున్నారు. అందులో కొన్నిఅర్థసత్యాలూ రాజ్యం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని లోతుగా చెప్పాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో 12 వేల కోట్ల రూపాయల సంగతిని దాచిపెడుతున్నారు. కేంద్రం సిద్దంగా ఉన్నప్పటికీ తామే కాలదన్నుతున్నవిషయం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక కోణంలోనే విషయాన్ని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీపై బహుముఖంగా దాడి జరుగుతూ ఉండటంతో దీటుగా ఎదుర్కోలేకపోతోందనే చెప్పాలి. ఏదేమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఆంధ్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. బీజేపీ గెలిస్తే ప్రత్యేక హోదా అంశం తెలుగు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తేల్చిపారేసే అవకాశం కమలానికి దక్కుతుంది. ఆ పార్టీ ఓటమి పాలైతే తామే ఇందుకు కారణమని బోర విరుచుకుని ప్రకటించుకునే సాధికారత టీడీపీకి చిక్కుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News